న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన భారత్.. ఇది పశ్చిమ ఆసియాలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికగా బుధవారం (ఏప్రిల్ 8) ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం. ఇది పశ్చిమ ఆసియాలో శాశ్వత శాంతికి దారితీస్తుందని ఆశిస్తున్నాం. మేము ఇంతకుముందు చెప్పినట్లుగానే కొనసాగుతున్న సంఘర్షణకు త్వరగా ముగింపు పలకడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు, దౌత్యం చాలా అవసరం” అని ఎంఈఏ పేర్కొంది. పశ్చిమాసియా సంఘర్షణతో ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌లకు అంతరాయం కలగడం ప్రజలను అపారమైన బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసింది.
హోర్ముజ్ జలసంధి గుండా నిరాటంకమైన నౌకాయాన స్వేచ్ఛ, ప్రపంచ వాణిజ్య ప్రవాహం కొనసాగుతుందని ఆశిస్తున్నామని పేర్కొంది. ప్రాంతీయ సంఘర్షణలను పరిష్కరించడానికి చర్చలు, దౌత్యం ముఖ్యమనే తన వైఖరిని భారత్ పునరుద్ఘాటించింది. పశ్చిమ ఆసియాలో త్వరితగతిన, సుస్థిరమైన శాంతిని సాధించడంలో దౌత్యం కీలకమని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో స్థిరత్వానికి భారతదేశం కట్టుబడి ఉందని తెలిపింది.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదించిన సీజ్ ఫైర్ ప్రతిపాదనకు ఇరు దేశాలు అంగీకారం తెలపడంతో పశ్చిమాసియాలో దాదాపు నెలన్నర రోజులుగా సాగుతోన్న భీకర యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. యుద్ధాన్ని పూర్తిగా ముగించడమే లక్ష్యంగా 2026, ఏప్రిల్ 10న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ బృందాలు ప్రత్యక్ష చర్చలు జరపనున్నాయి.
