న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. గురువారం జరిగే గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్‌లో పెద్దగా అనుభవం లేని నమీబియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్ ఉండటంతో ఇండియా బ్యాటర్లపై ప్రధానంగా దృష్టి నెలకొంది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ మినహా మిగతా వారంతా తేలిపోయారు.
ఒక్కరంటే ఒక్కరు వికెట్ కాపాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో నమీబియాతో మ్యాచ్‌లో బ్యాటింగ్ వీరులందరూ గాడిలో పడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఏమాత్రం తేడా వచ్చినా రాబోయే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నమీబియా బౌలింగ్‌ను చితక్కొట్టి తొలిసారి మూడొందల మార్క్‌ను అందుకోవాలని టీమిండియా ప్రణాళికలు వేస్తోంది. ఇది ఎంతవరకు విజయవంతమవుతోంది చూడాలి.
అభిషేక్ డౌట్..
నమీబియాతో మ్యాచ్ కంటే అభిషేక్ కడుపు ఇన్ఫెక్షన్ టీమిండియాను ఎక్కువగా భయపెడుతోంది. మంగళవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న అతని పరిస్థితి ఢిల్లీ చేరేసరికి మరింత క్షీణించింది. దాంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. రెండు రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత బుధవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో అతను నమీబియాతో మ్యాచ్‌లో అడతాడా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ అభిషేక్ గైర్హాజరైతే సంజూ శాంసన్‌కు ఓపెనింగ్ స్లాట్ కేటాయించనున్నారు. కానీ అతను కూడా గాయం నుంచి కోలుకుని వస్తుండటంతో ఫామ్‌పై ఆందోళన కనిపిస్తోంది.
భారీ ఆశలు పెట్టుకున్న ఇషాన్ కిషన్ వేగంగా ఆడే క్రమంలో అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడు. తిలక్ వర్మ కూడా గాడిలో పడాల్సి ఉంది. ఈ ముగ్గురు చెలరేగితే ఆరంభంలోనే భారీ స్కోరును ఆశించొచ్చు. కెప్టెన్ సూర్య ఫామ్‌లో ఉండటం ఇండియాకు అతిపెద్ద బలం. కానీ మిడిలార్డర్‌లో శివమ్ దూబే, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా వైఫల్యం జట్టు స్కోరును వెంటాడుతోంది. ఈ ముగ్గురు ఫినిషర్లుగా మిడిల్ భారాన్ని సమర్థవంతంగా మోయగలిగితే ఇండియాకు తిరుగుండదు.
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మెరుస్తున్నా.. బ్యాటింగ్‌పై కూడా దృష్టి సారించాలి. వీళ్లందరూ ఈ మ్యాచ్‌లో బ్యాట్లు ఝుళిపిస్తేనే పాక్‌తో మ్యాచ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడే అవకాశం ఉంటుంది. బౌలింగ్‌లో పేసర్ బుమ్రా అందుబాటులోకి రావడం ప్లస్ పాయింట్. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతను నెట్స్‌లో సూపర్ బౌలింగ్ చేశాడు. దాంతో ఈ మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్‌ను కొనసాగించి సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వొచ్చు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నుంచి నమీబియాకు ముప్పు తప్పదు. అయితే వ్యక్తిగత పెర్ఫామెన్స్ కంటే ప్రతి ఒక్కరూ గాడిలో పడటం టీమిండియాకు అత్యవసరం.
హింగో స్థానంలో షికోంగో
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియాకు పోటీ ఇచ్చే స్థాయి నమీబియాకు లేదు. కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో తమ పట్టు నిలుపుకోవాలని చూస్తున్న నమీబియా.. బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టిసారించింది. ఇందుకోసం నెదర్లాండ్స్‌తో ఆడిన జట్టులో స్వల్ప మార్పులు చేయనుంది. అయితే వామప్ మ్యాచ్‌లో ఇండియా ద్వితీయశ్రేణి జట్టు చేతిలో ఓడటం నమీబియా వైఫల్యాన్ని సూచిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్‌ను టీమిండియా వామప్‌గా చేసుకున్నా ఇబ్బందిలేదు.
బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, పాండ్యా బౌలింగ్‌ను ఎదుర్కొని నిలవాలంటే నమీబియా శక్తికి మించి శ్రమించాలి. ఆల్‌రౌండర్ జేజే స్మిత్‌పై ఎక్కువ భారం పడనుంది. అతను 140 స్ట్రయిక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. స్టీన్‌క్యాంప్, ఫ్రీలింక్, జాన్ నికోల్, ఎరాస్మస్ బ్యాట్లు ఝుళిపిస్తే స్కోరును ఆశించొచ్చు. స్పిన్నర్ బెర్నార్డ్ స్కూల్జ్ నుంచి కాస్త ముప్పు ఉండొచ్చు. గత మ్యాచ్‌లో రెండు ఓవర్లలో 22 రన్స్ ఇచ్చిన మాక్స్ హీంగో ప్లేస్‌లో బెన్ షికోంగ్‌ను జట్టులోకి తీసుకోనున్నారు.
జట్లు (అంచనా):
ఇండియా: అభిషేక్ శర్మ / సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా / సిరాజ్, వరుణ్ చక్రవర్తి.
నమీబియా: లారెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రీలింక్, జాన్ నికోల్ లోఫ్టి ఈటన్, గెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేజే స్మిత్, జాన్ గ్రీక్, డైలాన్ లీచెర్, విలియమ్ మైబర్గ్ , రూబెన్ ట్రూపెల్మ్‌న్, బెర్నార్డ్ స్కూల్జ్, బెన్ షికాంగో.
