ఇరగదీసిన్రు: విండీస్‌‌ పై ఇండియా గెలుపు

ఇరగదీసిన్రు: విండీస్‌‌ పై ఇండియా గెలుపు

సెమీస్‌‌ బెర్తు ఖాయం !

చెలరేగిన షమీ, కోహ్లీ, బుమ్రా

 కరీబియన్ల ఖేల్​ఖతం

సూపర్‌‌ ఫెర్ఫామెన్స్‌‌తో దూసుకుపోతున్న టీమిండియా.. వరల్డ్‌‌కప్‌‌లో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌‌లో కెప్టెన్‌‌ కోహ్లీ (82 బంతుల్లో 8 ఫోర్లతో 72), ధోనీ (61 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 నాటౌట్‌‌) మాస్టర్‌‌ క్లాస్‌‌ ఇన్నింగ్స్‌‌కు తోడు బౌలింగ్‌‌లో షమీ (4/16), బుమ్రా (2/9) నిప్పులు చెరగడంతో.. విండీస్‌‌ బ్యాటింగ్‌‌ లైనప్‌‌ చెల్లాచెదురైంది. దీంతో గట్టిపోటీ తప్పదనుకున్న మ్యాచ్‌‌ కాస్త ఏకపక్షంగా మారింది. ఓవరాల్‌‌గా మెగా ఈవెంట్‌‌లో మిగతా తొమ్మిది జట్లు కనీసం ఒక్కదాంట్లోనైనా పరాజయం చవిచూసినా, విరాట్‌‌సేన మాత్రం అపజయమనేదే లేకుండా సెమీస్‌‌ బెర్త్‌‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మరోవైపు అన్ని రంగాల్లో విఫలమైన కరీబియన్‌‌ జట్టు అధికారికంగా సెమీస్‌‌ రేసు నుంచి నిష్క్రమించింది.

గాయాలు వెంటాడినా.. వేదికలు మారినా.. ప్రత్యర్థులు మారినా.. వరల్డ్‌‌కప్‌‌లో టీమిండియా విజయాల్లో మాత్రం మార్పు లేదు. ఎంత పెద్ద ప్రత్యర్థి ఎదురైనా.. ఎదురులేని ఆటతో చెలరేగుతున్న విరాట్‌‌సేన.. గురువారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లోనూ 125 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌‌పై ఘన విజయం సాధించింది. దీంతో 11  పాయింట్లతో సెమీస్‌‌ బెర్త్‌‌కు మరింత చేరువైంది. టాస్‌‌ గెలిచిన ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు చేసింది.  రాహుల్‌‌ (64 బంతుల్లో 6 ఫోర్లతో 48), హార్దిక్‌‌ (38 బంతుల్లో 5 ఫోర్లతో 46) రాణించారు. తర్వాత విండీస్‌‌ 34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. సునీల్‌‌ ఆంబ్రిస్‌‌ (31) టాప్‌‌ స్కోరర్‌‌. టీమిండియా బౌలర్లు షమీ (4/16), బుమ్రా (2/9), చహల్‌‌ (2/39) చెలరేగడంతో..  గేల్‌‌ (6)తో సహా అందరూ విఫలమయ్యారు. కోహ్లీకి ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

పెవిలియన్‌‌కు క్యూ..
టీమిండియా బౌలింగ్‌‌ దాటికి విండీస్‌‌ ఏ దశలోనూ టార్గెట్‌‌ ఛేజ్ చేసేలా కనిపించలేదు. భారీ స్టార్లతో కూడిన బ్యాటింగ్‌‌ బలగం తక్కువ పరుగులకే చేతులెత్తేసింది. ఆరుగురు బ్యాట్స్‌‌మెన్‌‌ సింగిల్‌‌ డిజిట్‌‌ స్కోరుకే పరిమితంకావడంతో విండీస్‌‌ కోలుకోలేకపోయింది. ఆరంభంలో షమీ.. డబుల్‌‌ స్ట్రయిక్‌‌ ఇస్తే.. తర్వాతి బౌలర్లు పట్టు జారకుండా చూశారు. భారీ ఆశలు పెట్టుకున్న గేల్‌‌, హోప్‌‌ (5)ను షమీ ఏడు బంతుల తేడాలో పెవిలియన్‌‌కు పంపి వికెట్లపతనాన్ని మొదలుపెట్టాడు.  16/1 స్కోరుతో కష్టాల్లో పడ్డ విండీస్‌‌ను ఆంబ్రిస్‌‌, పూరన్‌‌ (28) ఆదుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 10 ఓవర్లలో 29/2 స్కోరుకే  పరిమితమైన విండీస్‌‌ను మ్యాచ్‌‌ మధ్యలో కుల్దీప్‌‌ (1/35), చహల్‌‌, హార్దిక్‌‌ (1/28) బాగా కట్టడి చేశారు.  మూడో వికెట్‌‌కు 55  పరుగులు జోడించి ఆంబ్రిస్‌‌ ఔటయ్యాడు.  కొద్దిసేపటికే ‘కుల్చా’ ద్వయం.. పూరన్‌‌, హోల్డర్‌‌ (6)ను పెవిలియన్‌‌కు పంపడంతో 98 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌‌కు చేరింది. బ్రాత్‌‌వైట్‌‌ (1), హెట్‌‌మయర్‌‌ (18)పై ఆశలు పెంచుకున్నా.. బుమ్రా దెబ్బకు ఈ ఇద్దరు అల్లాడిపోయారు. బంతిని ముట్టుకోవడానికి కూడా సాహసం చేయకపోవడంతో కనీసం సింగిల్స్‌‌ కూడా రాలేదు. 27వ ఓవర్‌‌లో తొలి రెండు బంతుల్లో ఈ ఇద్దర్ని ఔట్‌‌ చేసి హ్యాట్రిక్‌‌ మీద నిలిచిన బుమ్రాకు రోచ్‌‌ (14 నాటౌట్‌‌) అడ్డుపడ్డాడు. కానీ.. ఇక్కడి నుంచి టీమిండియా పేస్-స్పిన్‌‌ కాంబినేషన్‌‌ ఓవర్‌‌కో వికెట్‌‌ తీసి ఓటమి అంచుల్లోకి నెట్టింది. చివర్లో రోచ్‌‌, థామస్‌‌ (6) కాసేపు పోరాడినా.. లక్ష్యాన్ని కరిగించలేకపోయారు.

కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్​
అంతకుముందు స్లో పిచ్‌‌పై టీమిండియాకు సరైన ఆరంభం దక్కలేదు. రోచ్‌‌ (3/36) బంతిని భారీ సిక్సర్‌‌గా మలిచి టచ్‌‌లోకి వచ్చిన రోహిత్‌‌ (18)ను దురదృష్టం వెంటాడింది. ఆరో ఓవర్‌‌లో థర్డ్​ అంపైర్​ అనుమానాస్పద నిర్ణయానికి అతను ఔటయ్యాడు. ఇండియా 29 రన్స్‌‌ వద్ద తొలి వికెట్‌‌ కోల్పోయింది. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన కోహ్లీ కరీబియన్‌‌ పేసర్లపై ఆధిపత్యం చూపెట్టినా.. రెండో ఎండ్‌‌లో సహకారం కరువైంది. రాహుల్‌‌ రెండు, మూడు డ్రైవ్స్‌‌ కొట్టడంతో 20 ఓవర్లలో ఇండియా స్కోరు 97/1కు చేరింది. కానీ 21 ఓవర్‌‌లో హోల్డర్‌‌ (2/33) వేసిన యాంగిల్‌‌ డెలివరికి రాహుల్‌‌ వికెట్‌‌ ఎగిరిపోయింది. ఫలితంగా రెండో వికెట్‌‌కు 69 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. నాలుగో స్థానంలో వచ్చిన శంకర్‌‌ (14), కేదార్‌‌ జాదవ్‌‌ (7) మరోసారి నిరాశపర్చారు. రోచ్‌‌ వికెట్‌‌ టు వికెట్‌‌ బంతులను ఎదుర్కోలేక వీళ్లు ఇబ్బందిపడ్డారు. 11 బంతుల తేడాలో ఈ ఇద్దర్ని ఔట్‌‌ చేసిన రోచ్‌‌ విండీస్‌‌ శిబిరంలో ఆనందం నింపాడు. కోహ్లీ 55 బంతుల్లో హాఫ్‌‌ సెంచరీ చేసినా.. ధోనీ కుదురుకోవడానికి టైమ్‌‌ తీసుకున్నాడు. ఒకటి, రెండు భారీ షాట్లతో జోరు తెచ్చిన విరాట్‌‌.. 39వ ఓవర్‌‌లో అనవసరంగా వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. దీంతో ఐదో వికెట్‌‌కు 40 రన్స్‌‌ సమకూరాయి.

మహీ ఫినిషింగ్‌‌..
180/5 స్కోరు వద్ద వచ్చిన హార్దిక్‌‌ దూకుడుకు ప్రాధాన్యమిచ్చాడు. స్టంపింగ్‌‌ చాన్స్‌‌ నుంచి బయటపడ్డ మహీ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్నా.. రోచ్‌‌, హోల్డర్‌‌ బౌలింగ్‌‌లో మాత్రం తడబడ్డాడు. అయినా సింగిల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసి హార్దిక్‌‌కు అవకాశం ఇచ్చాడు. దీనిని ఉపయోగించుకున్న పాండ్యా చకచకా బౌండరీలు బాదుతూ రన్‌‌రేట్‌‌ పెంచాడు. దాదాపు 10 ఓవర్లు ఆడిన ఈ జోడీ ఆరో వికెట్‌‌కు 70 పరుగులు జత చేయడంతో ఇండియా స్కోరు 250కి చేరుకుంది. చివరి ఓవర్లలో భారీ హిట్టింగ్‌‌ చేయాలన్న హార్దిక్‌‌ కలకు కొట్రెల్‌‌ (2/50–) అడ్డు తగిలాడు. 49వ ఓవర్‌‌లో నాలుగు బంతుల్లో హార్దిక్‌‌, షమీ (0)ని ఔట్‌‌ చేసి కట్టడి చేశాడు. చివరి ఓవర్‌‌లో ధోనీ 2 సిక్సర్లు, 1 ఫోర్‌‌తో 16 రన్స్‌‌ రాబట్టడంతో ఇండియా భారీ టార్గెట్‌‌ను నిర్దేశించింది. ఓవరాల్‌‌గా మ్యాచ్‌‌ మొత్తంలో టీమిండియా రన్‌‌ చేయకుండా163 బాల్స్‌‌ను వృథా చేసింది.

రోహిత్‌‌ ఔటా.. నాటౌటా?
వరల్డ్‌‌కప్‌‌లో అంపైరింగ్‌‌ తప్పిదాలు కొనసాగుతున్నా.. థర్డ్‌‌ అంపైర్‌‌ కూడా తప్పుడు నిర్ణయమిచ్చి అందర్ని షాక్‌‌కు గురి చేశాడు. ఆరో ఓవర్‌‌లో రోచ్‌‌ వేసిన ఓ ఫుల్‌‌ లెంగ్త్‌‌ బంతి రోహిత్‌‌ బ్యాట్‌‌–ప్యాడ్‌‌ మధ్యలో నుంచి కీపర్‌‌ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై విండీస్‌‌ అప్పీల్‌‌ చేసినా.. ఫీల్డ్‌‌ అంపైర్‌‌ నాటౌట్‌‌గా ప్రకటించాడు. వెంటనే కరీబియన్లు రివ్యూకు వెళ్లారు. రివ్యూలో బంతిని సమీక్షించే క్రమంలో కొద్దిపాటి స్పైక్‌‌ కనిపించింది.  అయితే అది బ్యాట్‌‌కు తగిలిందా? లేక ప్యాడ్‌‌కు తగి లిందా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. ఒక కోణంలో చూస్తే ఏక కాలంలో బ్యాట్‌‌కు, ప్యాడ్‌‌కు తాకడంతో స్పైక్‌‌ కనిపించినట్లు అల్ట్రా ఎడ్జ్‌‌లో  స్పష్టమైంది.  కానీ రెండో కోణంలో చూస్తే.. బ్యాట్‌‌ కంటే ప్యాడ్లు కొద్దిగా ముందున్నట్లు కనిపించింది. దీని ఆధారంగా చేసుకుని థర్డ్‌‌ అంపైర్‌‌ ఔటిచ్చాడు. కానీ ఇది క్లియర్‌‌ ఔట్‌‌ కాదని డీఆర్‌‌ఎస్‌‌లో స్పష్టమవుతున్నా.. ‘బెనిఫిట్‌‌ ఆఫ్‌‌ డౌట్‌‌’ కింద బ్యాట్స్‌‌మన్‌‌కు అనుకూలంగానైనా తీర్పు ఇవ్వాలి. లేదంటే  నిర్ణయాన్ని ఫీల్డ్‌‌ అంపైర్‌‌కైనా వదిలేయాలి. ఈ రెండు చేయకుండా థర్డ్​ అంపైర్​ ఔట్​ ఇవ్వడాన్ని విమర్శకులు తప్పుబడుతున్నారు.

స్కోర్‌‌ బోర్డు
ఇండియా: రాహుల్‌‌ (బి) హోల్డర్‌‌ 48, రోహిత్‌‌ (సి) హోప్‌‌ (బి) రోచ్‌‌ 18, కోహ్లీ (సి) సబ్‌‌/ బ్రావో (బి) హోల్డర్‌‌ 72, శంకర్‌‌ (సి) హోప్‌‌ (బి) రోచ్‌‌ 14, జాదవ్‌‌ (సి) హోప్‌‌ (బి) రోచ్‌‌ 7, ధోనీ (నాటౌట్‌‌) 56, హార్దిక్‌‌ (సి) అలెన్‌‌ (బి) కొట్రెల్‌‌ 46, షమీ (సి) హోప్‌‌ (బి) కొట్రెల్‌‌ 0, కుల్దీప్‌‌ (నాటౌట్‌‌) 0,

ఎక్స్‌‌ట్రాలు: 7, మొత్తం: 50 ఓవర్లలో 268/7.

వికెట్లపతనం: 1–29, 2–98, 3–126, 4–140, 5–180, 6–250, 7–252.బౌలింగ్‌‌: కొట్రెల్‌‌ 10-–0–50–2, రోచ్‌‌ 10–0–36–3, థామస్‌‌ 7–0–63–0, అలెన్‌‌ 10–0–52–0, హోల్డర్‌‌ 10–2–33–2, బ్రాత్‌‌వైట్‌‌ 3–0–33–0.

వెస్టిండీస్‌‌:  గేల్‌‌ (సి) జాదవ్‌‌ (బి) షమీ 6, ఆంబ్రిస్‌‌ (ఎల్బీ) పాండ్యా 31, హోప్‌‌ (బి) షమీ 5, పూరన్‌‌ (సి) షమీ (బి) కుల్దీప్‌‌ 28, హెట్‌‌మయర్‌‌ (సి) రాహుల్‌‌ (బి) షమీ 18, హోల్డర్‌‌ (సి) జాదవ్‌‌ (బి) చహల్‌‌6, బ్రాత్‌‌వైట్‌‌ (సి) ధోనీ (బి) బుమ్రా 1, అలెన్‌‌ (ఎల్బీ) బుమ్రా 0, రోచ్‌‌ (నాటౌట్‌‌) 14, కొట్రెల్‌‌ (ఎల్బీ) చహల్‌‌ 10, థామస్‌‌ (సి) రోహిత్‌‌ (బి) షమీ 6, ఎక్స్‌‌ట్రాలు: 18, మొత్తం: 34.2 ఓవర్లలో 143 ఆలౌట్‌‌.

వికెట్లపతనం: 1–10, 2–16, 3–71, 4–80, 5–98, 6–107, 7–107, 8–112, 9–124, 10–143. బౌలింగ్‌‌: షమీ 6.2-–0–16–4, బుమ్రా 6–1–9–2, పాండ్యా 5–0–28–1, కుల్దీప్‌‌ 9–1–35–1, జాదవ్‌‌ 1–0–4–0, చహల్‌‌ 7–0–39–2 .