- 25 ఏండ్లలోపు వారిలో 40 % అన్ ఎంప్లాయిమెంట్
- అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీ నివేదిక
న్యూఢిల్లీ: డిగ్రీ పట్టా ఉంటే చాలు కొలువు దొరుకుతుందనే రోజులు పోయాయి. పీజీలు, పీహెచ్డీలు చేసిన వారికీ సరైన ఉద్యోగాలు దొరకడంలేదు. దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ల సంఖ్య ఏటేటా పెరుగుతున్నా.. వారికి తగిన ఉపాధి అవకాశాలు లభించడంలేదని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ తన తాజా నివేదికలో వెల్లడించింది.
ముఖ్యంగా 20 నుంచి 29 ఏండ్ల మధ్య వయసున్న 6.3 కోట్ల మంది గ్రాడ్యుయేట్లలో సుమారు 1.1 కోట్ల మంది నిరుద్యోగులేనని నివేదిక స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం..డిగ్రీ పూర్తయిన ఏడాదిలోపు స్థిరమైన ఉద్యోగం పొందుతున్న వారు కేవలం 7 శాతం మాత్రమే ఉన్నారు. 25 ఏండ్లలోపు వయసున్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం ఏకంగా 40 శాతంగా ఉండగా.. 25 నుంచి 29 ఏండ్ల గ్రూపులో ఇది 20 శాతంగా నమోదైంది.2004 నుంచి 2023 మధ్య కాలంలో ఏటా సగటున 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు కొత్తగా మార్కెట్లోకి రాగా.. కేవలం 28 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించింది.
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ప్రతి 100 మందిలో కేవలం ఏడుగురికి మాత్రమే ఏడాది తిరిగేలోపు ఒక పక్కా వేతనంతో కూడిన ఉద్యోగం దొరుకుతున్నది. అంటే మిగిలిన 93 మందికి ఆ ఏడాదిలో ఉద్యోగమే దొరకటం లేదు. గ్రాడ్యుయేట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతున్నదని నివేదిక పేర్కొంది.
మధ్యలోనే ఆగిపోతున్న చదువులు
ఆర్థిక ఇబ్బందులతో దేశంలో యువకులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. 2017లో విద్యను అభ్యసిస్తున్న యువకుల వాటా 38 శాతంగా ఉంటే, 2024 చివరి నాటికి అది 34 శాతానికి పడిపోయింది.కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వల్ల చదువు మానేస్తున్నామని చెప్పే వారి సంఖ్య 2017లో 58% ఉండగా, 2023 నాటికి అది 72 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఉద్యోగంలో చేరిన సమయంలో డిగ్రీ లేని వారితో పోలిస్తే గ్రాడ్యుయేట్ల జీతం రెండు రెట్లు ఎక్కువగా ఉంటోందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అభిప్రాయపడింది.
