సిరీస్‌ మనదే.. మూడో టీ20లోనూ ఇండియా విమెన్స్ టీమ్ విక్టరీ

సిరీస్‌ మనదే.. మూడో టీ20లోనూ  ఇండియా విమెన్స్ టీమ్ విక్టరీ
  • 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపు
  • 3–0తో సిరీస్‌ టీమిండియా సొంతం 
  • రాణించిన హర్మన్‌, రేణుకా, దీప్తి శర్మ

తిరువనంతపురం: శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌‌‌‌లో ఇండియా అమ్మాయిల జైత్రయాత్ర కొనసాగుతోంది. చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో షెఫాలీ వర్మ (42 బాల్స్‌‌‌‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 79 నాటౌట్‌‌‌‌) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన మూడో టీ20లోనూ ఇండియా 8 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది.  ఫలితంగా ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో మరో రెండు మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది. టాస్‌‌‌‌ ఓడిన శ్రీలంక 20 ఓవర్లలో 112/7 స్కోరు చేసింది. ఇమేషా దులానీ (27) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తర్వాత ఇండియా 13.2 ఓవర్లలో 115/2 స్కోరు చేసి నెగ్గింది. లక్ష్యం చిన్నదిగా ఉండటంతో ఓపెనర్‌‌‌‌ షెఫాలీ.. లంక బౌలర్లపై విరుచుకుపడింది. ఆరంభం నుంచే ఎక్కువగా స్ట్రయిక్‌‌‌‌ తీసుకుని బౌండ్రీలు బాదింది. రెండో ఎండ్‌‌‌‌లో స్మృతి మంధాన (1) మరోసారి ఫెయిలైంది. కావిషా దిల్హారి (2/18) వేసిన నాలుగో ఓవర్‌‌‌‌లో క్లీన్‌‌‌‌ ఎల్బీ అయ్యింది. ఫలితంగా తొలి వికెట్‌‌‌‌కు 21 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఈ దశలో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌ (9) కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించలేకపోయింది. 8వ ఓవర్‌‌‌‌లో కావిషాకే వికెట్‌‌‌‌ ఇచ్చుకుంది. 67/2 వద్ద వచ్చిన హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (21 నాటౌట్‌‌‌‌).. షెఫాలీకి అండగా నిలిచింది. ఈ ఇద్దరు పోటీపడి రన్స్‌‌‌‌ రాబట్టారు. ఈ క్రమంలో షెఫాలీ 24 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసింది. లంక బౌలర్ల నుంచి ప్రతిఘటన లేకపోవడంతో ఈ ఇద్దరు మూడో వికెట్‌‌‌‌కు 48 రన్స్‌‌‌‌ జత చేసి మరో 40 బాల్స్‌‌‌‌ మిగిలి ఉండగానే ఈజీగా విజయాన్ని అందించారు. రేణుకాకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం ఇదే వేదికపై నాలుగో టీ20 జరుగుతుంది. 

బౌలర్లు అదుర్స్‌‌‌‌..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన లంకను ఇండియా బౌలర్లు దెబ్బకొట్టారు. పేసర్‌‌‌‌ రేణుకా సింగ్‌‌‌‌ (4/21), స్పిన్నర్ దీప్తి శర్మ (3/18) కట్టుదిట్టమైన బౌలింగ్‌‌‌‌తో వికెట్లు తీయడంతో పాటు రన్స్‌‌‌‌నూ కట్టడి చేశారు. మిగతా బౌలర్లు వికెట్లు తీయలేకపోయినా రన్స్‌‌‌‌ను నిరోధించారు. ఓపెనర్లలో హాసిని పెరీరా (25) మెరుగ్గా ఆడినా.. రెండో ఎండ్‌‌‌‌లో సరైన సహకారం దక్కలేదు. ఇన్నింగ్స్‌‌‌‌ ఐదో ఓవర్‌‌‌‌లోనే దీప్తి టర్నింగ్‌‌‌‌ బాల్‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌ చామిరి ఆటపట్టు (3) ఔటైంది. తర్వాతి ఓవర్‌‌‌‌లో రేణుకా డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చింది. మూడు బాల్స్‌‌‌‌ తేడాలో పెరీరా, హర్షిత సమరవిక్రమ (2)ను పెవిలియన్‌‌‌‌కు పంపింది. దీంతో పవర్‌‌‌‌ప్లేలో లంక 32/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఇమేషా నిలకడగా ఆడింది. 10వ ఓవర్‌‌‌‌లో నీలాక్షిక సిల్వ (4)ను రేణుకా ఔట్‌‌‌‌ చేయడంతో స్కోరు బోర్డు 45/4గా మారింది. ఇమేషాతో జతకలిసిన కావిషా దిల్హారి (20) బ్యాట్‌‌‌‌ ఝుళిపించింది. ఈ ఇద్దరు చకచకా బౌండ్రీలు బాదుతూ ఇండియా బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఐదో వికెట్‌‌‌‌కు 40 రన్స్‌‌‌‌ జోడించి నిలదొక్కుకున్నారు. కానీ 14వ ఓవర్‌‌‌‌లో మళ్లీ బౌలింగ్‌‌‌‌కు దిగిన దీప్తి.. కావిషా వికెట్‌‌‌‌ పడగొట్టడంతో స్కోరు 90/6గా మారింది. మరో 8 రన్స్‌‌‌‌ జోడించి ఇమేషా కూడా వెనుదిరిగింది. 98/7తో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన కౌశిని నూత్యంగన (19 నాటౌట్‌‌‌‌) ఒంటరి పోరాటం చేసింది. మాల్షా షిహాని (5), మల్కి మదారా (1 నాటౌట్‌‌‌‌) నిరాశపర్చడంతో లంక తక్కువ  స్కోరుకే పరిమితమైంది. 

సంక్షిప్త స్కోర్లు

శ్రీలంక: 20 ఓవర్లలో 112/7 (ఇమేషా 27, హాసిని 25, రేణుకా సింగ్‌‌‌‌ 4/21, దీప్తి శర్మ 3/18). ఇండియా: 13.2 ఓవర్లలో 115/2 (షెఫాలీ 79*, హర్మన్‌‌‌‌ 21*, కావిషా 2/18).

1టీ20ల్లో అత్యధిక వికెట్లు (151) తీసిన తొలి బౌలర్‌‌‌‌గా మేఘన్‌‌‌‌ షుట్‌‌‌‌ (ఆస్ట్రేలియా)తో కలిసి దీప్తి శర్మ సంయుక్తంగా టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. దీప్తి 151 మ్యాచ్‌‌‌‌ల్లో 
ఈ ఘనత సాధిస్తే, షుట్‌‌‌‌  143 మ్యాచ్‌‌‌‌ల్లోనే ఈ ఫీట్‌‌‌‌ను అందుకుంది.