52 ఏళ్ళ వరల్డ్ కప్ కల తీరింది. కోట్లాది మంది ప్రార్ధనలు ఫలించాయి. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్ ను భారత మహిళలు జట్టు సొంతం చేసుకుంది. సొంతగడ్డపై తిరుగులేని ఆట ఆడుతూ విశ్వ విజేతగా అవతరించింది. ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్ లో సమిష్టిగా రాణించి వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది. మరోవైపు తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టిన సౌతాఫ్రికాకు నిరాశే మిగిలింది.
52 ఏళ్ళ వరల్డ్ కప్ చరిత్రలో భారత మహిళల జట్టుకు తొలి వన్డే వరల్డ్ కప్ కావడం విశేషం. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్ రౌండ్ షోతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ వీరోచిత సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది.
లారా వోల్వార్డ్ సెంచరీతో పోరాటం:
299 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు చక్కని ఆరంభం ఇచ్చారు. లారా వోల్వార్డ్, టాజ్మిన్ బ్రిట్స్ తొలి వికెట్ కు 51 పరుగులు జోడించారు. పవర్ ప్లేలో వీరిద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లను విసిగించారు. అయితే ఎట్టకేలకు సౌతాఫ్రికా తమ తొలి వికెట్ ను రనౌట్ రూపంలో కోల్పోయింది. అమన్‌జోత్ కౌర్ అద్భుతమైన ఫీల్డింగ్ కు బ్రిట్స్ రనౌటయింది. ఆ తర్వాత శ్రీ చారని ఒక చక్కని బంతితో అన్కె బోష్ ను ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ చేసింది. దీంతో 62 పరుగులు సౌతాఫ్రికా 2 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో షెఫాలీ వర్మ తన స్పిన్ మ్యాజిక్ చూపించింది. కీలక సమయంలో రెండు వికెట్లు పడగొట్టి సౌథఫరికాను ఒత్తిడిలోకి నెట్టింది. 20 ఓవర్లో సునే లూస్ ఔట్ (25) చేసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టిన షెఫాలీ..ఆ తర్వాత తాను వేసిన ఓవర్లో మారిజాన్ కాప్ ను 4 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపింది. 2 వికెట్ల నష్టానికి 114 పరుగులతో పటిష్టంగా ఉన్న సౌతాఫ్రికా షెఫాలీ ధాటికి రెండు కీలక వికెట్లు చేజార్చుకొని 4 వికెట్ల నష్టానికి 123 పరుగులతో నిలిచింది. ఉన్నత సేపు క్రీజ్ లో ఇబ్బంది పడిన సినాలో జాఫ్తా 29 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటవ్వడంతో ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది.
టీమిండియా విజయం లాంఛనమే అనుకున్న సమయంలో అన్నేరీ డెర్క్సెన్, వోల్వార్డ్ కలిసి జట్టును ముందుకు తీసుకెళ్లారు. 61 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించి ఇండియాను కొంచెం టెన్షన్ పెట్టారు. దీప్తి వీరి భాగస్వామ్యానికి బ్రేక్ వేయడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో అసాధారణంగా పోరాడిన వోల్వార్డ్ సెంచరీ పూర్తి చేసుకొని ఇండియాకు చుక్కలు చూపించింది. సెంచరీ తర్వాత ఈ సఫారీ కెప్టెన్ ఒక భారీ షాట్ కు ప్రయత్నించి ఔట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా ఇండియా వైపు మళ్లింది. చివర్లో టైలండర్లు పోరాడలేకపోవడంతో ఇండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ ఐదు వికెట్లుపడగొట్టింది. షెఫాలీ రెండు.. శ్రీ చరని ఒక వికెట్ పడగొట్టింది.
ఇండియా భారీ స్కోర్:
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాకా మూడు వికెట్లు పడగొట్టింది. ట్రయిన్, నాడిన్ డి క్లెర్క్, నాన్కులులేకో తలో వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఇండియాకు ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలీ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ప్రారంభంలో కాస్త ఆచితూచి ఆడినా.. ఆ తర్వాత బ్యాట్ ఝులిపించారు. సఫారీ బౌలర్లను అలవోకగా ఆడుతూ స్వేచ్ఛగా బౌండరీలు రాబట్టారు. ఈ క్రమంలో వెరీ భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. తొలి వికెట్ కు 104 పరుగులు జోడించిన తర్వాత 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మందాన ఔటైంది. స్మృతి ఔటైనా జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
రెండో వికెట్ కు 62 పరుగులు జోడించి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు.
భారీ స్కోర్ ఖాయమన్న దశలో షెఫాలీ (87), జెమీమా (24) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దీంతో ఇండియా 171 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కౌర్, దీప్తి శర్మ కలిసి టీమిండియాను ముందుకు తీసుకెళ్లారు. జాగ్రత్తగా ఆడుతూ చిన్నగా స్కోర్ బోర్డును ముందుకు కదిపారు. నాలుగు వికెట్ కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు స్కోర్ ను 200 పరుగులు దాటించారు. క్రీజ్ లో ఉన్నంత వరకు ఇబ్బందిపడిన హర్మన్ ప్రీత్ కౌర్ 20 పరుగులు చేసి పెవిలియన్ కు చేరింది. ఓ వైపు వికెట్లకు పడుతున్నా దీప్తి శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. చివర్లో రిచా ఘోష్ బౌండరీలతో హోరెత్తించడంతో ఇండియా స్కోర్ 298 పరుగులకు చేరుకుంది.
Hurray.
— Dear Men (@Dear_Men_Life) November 2, 2025
We won.
Congratulations India🇮🇳
India won by 52 runs against South Africa in Mumbai.#indwvssaw#IndianCricket#WomensWorldCup2025#INDWvsSAW pic.twitter.com/T7aGhbrcXc
