
- విమెన్స్ టీమ్ విక్టరీ
- స్పిన్నర్లు సూపర్
- అదరగొట్టిన శ్రేయాంక, సైకా ఇషాక్
ముంబై : సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఇండియా విమెన్స్ టీమ్ వైట్‌వాష్ తప్పించుకుంది. యంగ్ స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (3/19), సైకా ఇషాక్ (3/22) సూపర్ బౌలింగ్‌కు తోడు ఓపెనర్ సృతి మంధాన (48 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 48) మెరుపులతో మూడో, చివరి టీ20లో గెలిచి ఊరట దక్కించుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 126 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్ హీథర్ నైట్ (42 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52) ఫిఫ్టీతో మెప్పించగా, అమీ జోన్స్ (25), చార్లీ డీన్ (16 నాటౌట్) రాణించారు. మిగతా బ్యాటర్లంతా నిరాశ పరిచారు. ఇండియా బౌలర్ల దెబ్బకు ఆ టీమ్‌లో నలుగురు సున్నా చుట్టారు. అనంతరం మంధాన మెరుపులకు తోడు జెమీమా రోడ్రిగ్స్ (29) రాణించడంతో ఇండియా 19 ఓవర్లలోనే 130/5 స్కోరు చేసి గెలిచింది. తొలి రెండు టీ20ల్లో గెలిచిన ఇంగ్లండ్ 2–1తో సిరీస్ నెగ్గింది. శ్రేయాంకకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సివర్ బ్రంట్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు ఈ నెల 14న డీవై పాటిల్ స్టేడియంలో మొదలవుతుంది.
హీథర్ పోరాటం
ఆరంభంలో పేసర్ రేణుకా ఠాకూర్, మధ్యలో స్పిన్నర్లు శ్రేయాంక, సైకా చెలరేగడంతో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్న ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది. కొత్త బాల్‌తో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న రేణుక ఈ మ్యాచ్‌లోనూ జట్టుకు మంచి ఆరంభం ఇచ్చింది. ఇన్నింగ్స్ మూడో బాల్‌కే ఓపెనర్ మియా బౌచియెర్ (0)ను డకౌట్ చేసింది. తన తర్వాతి ఓవర్లోనే ప్రమాదకర సోఫియా డంక్లీ (11)ను శ్రేయాంక క్యాచ్‌తో వెనక్కుపంపి ప్రత్యర్థని ఒత్తిడిలో పడేసింది. కెప్టెన్ హర్మన్ తెలివిగా ఆరో ఓవర్లోనే స్పిన్నర్ సైకాను బౌలింగ్‌కు దింపింది. క్రీజులో ఇబ్బంది పడుతున్న కాప్సీ (7)ని సైకా తన తొలి బాల్‌కే ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 26/3తో డీలా పడింది.
ఈ టైమ్‌లో అమీ జోన్స్‌తో కలిసి ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంది. అమీ వెంటవెంటనే మూడు ఫోర్లు కొట్టగా, శ్రేయాంక బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్స్‌తో నైట్ కూడా జోరు పెంచింది. దాంతో సగం ఓవర్లకు ఇంగ్లిష్ టీమ్ 62/3తో నిలిచింది. 12వ ఓవర్లో మరోసారి బౌలింగ్‌కు ఇచ్చిన సైకా వరుస బాల్స్‌లో అమీ జోన్స్‌తో పాటు గిబ్సన్ (0)ను ఔట్ చేయగా.. తర్వాతి ఓవర్లో శ్రేయంక కూడా వరుస బాల్స్‌లో బెస్ హీత్ (1), ఫ్రెయా కెంప్ (0)ను పెవిలియన్ చేర్చింది. దాంతో 70/7తో నిలిచిన ఇంగ్లండ్ వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. 15వ ఓవర్లో ఎకిల్‌స్టోన్ (2)ను శ్రేయంక బౌల్డ్ చేసింది. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా హీథర్ నైట్ ఒంటరి పోరాటం చేసింది. స్లాగ్ ఓవర్లలో చార్లీ డీన్ సపోర్ట్‌తో వరుస బౌండ్రీలతో చెలరేగింది. అమన్‌జోత్ వేసిన చివరి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న నైట్ తర్వాతి బాల్‌కు ఔటైంది. తొమ్మిదో వికెట్‌కు నైట్, డీన్ 50 రన్స్ జోడించారు.
మంధాన జోరు
స్టార్ ఓపెనర్ మంధాన, జెమీమా సత్తా చాటడంతో చిన్న టార్గెట్‌ను ఇండియా సులువుగానే ఛేజ్ చేసింది. కానీ, ఆతిథ్య జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. మూడో ఓవర్లోనే ఓపెనర్ షెఫాలీ వర్మ (6) కెంప్ బౌలింగ్‌లో బౌల్డ్ అయింది. అయితే, మంధాన, వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా బాధ్యతగా బ్యాటింగ్ చేశారు. తొలుత జాగ్రత్తగా ఆడిన ఈ ఇద్దరు ఆరో ఓవర్లో చెరో బౌండ్రీ కొట్టారు. తర్వాతి ఓవర్లో రోడ్రిగ్స్ రెండు ఫోర్లతో జోరు పెంచగా.. ఎకిల్‌స్టోన్ బౌలింగ్‌లోనే మంధాన లాఫ్టెడ్ షాట్‌తో సిక్స్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. కెంప్ వేసిన 11వ ఓవర్లోనూ మరో సూపర్ సిక్స్‌తో అలరించింది. కానీ, తర్వాతి ఓవర్లోనే జెమీమాను డీన్ ఎల్బీ చేయడంతో రెండో వికెట్‌కు 57 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో మంధానకు దీప్త శర్మ (12) తోడైంది.
ఈ ఇద్దరూ వెంటవెంటనే చెరో రెండు ఫోర్లు కొట్టడంతో 15 ఓవర్లకు ఇండియా 93/2తో నిలిచింది. కానీ, తర్వాతి ఓవర్లో దీప్తిని కెంప్ ఔట్ చేయగా.. పిఫ్టీ ముంగిట ఎకిల్‌స్టోన్ బౌలింగ్‌లో మంధాన కూడా ఔటవడంతో ఇంగ్లిష్ టీమ్ రేసులోకి వచ్చేలా కనిపించింది. విజయానికి మరో 11 రన్స్ అవసరమైన దశలో 19వ ఓవర్ తొలి బాల్‌కు రిచా ఘోష్ (2)ను ఎకిల్‌స్టోన్ బౌల్డ్ చేయడంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ, హర్మన్ (6 నాటౌట్) తోడుగా అమన్‌జోత్ (13 నాటౌట్) అదే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి ఇండియాను గెలిపించింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 126 ఆలౌట్ (హీథర్ నైట్ 52, శ్రేయాంక 3/19, సైకా 3/22).
ఇండియా:19 ఓవర్లలో 130/5 (మంధాన 48, జెమీమా 29, ఫ్రెయా కెంప్ 2/24).