
ముంబై : బ్యాటింగ్‌లో విఫలమైన ఇండియా విమెన్స్ టీమ్.. టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది. జెమీమా రోడ్రిగ్స్ (33 బాల్స్‌లో 2 ఫోర్లతో 30) మినహా మిగతా వారందరూ ఫెయిల్ కావడంతో.. శనివారం జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2–0తో కైవసం చేసుకుంది. టాస్ ఓడిన ఇండియా 16.2 ఓవర్లలో 80 రన్స్‌కే కుప్పకూలింది.
ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో ఇన్నింగ్స్ రెండో బాల్‌కే షెఫాలీ (0)డకౌటైంది. స్మృతి మంధాన (10) , కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (9), దీప్తి శర్మ (0), రిచా ఘోష్ (4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లిష్ బౌలర్లలో చార్లీ డీన్, లారెన్ బెల్, ఎకిల్‌స్టోన్, సారా గ్లెన్ తలా రెండు వికెట్లు తీశారు.
తర్వాత ఇంగ్లండ్ 11.2 ఓవర్లలో 82/6 స్కోరు చేసింది. క్యాప్సే (25) టాప్ స్కోరర్. సివర్ బ్రంట్ (16) ఫర్వాలేదనిపించింది. చార్లీన్ డీన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం మూడో మ్యాచ్ జరుగుతుంది.