IND vs NZ: ఆల్ రౌండ్ షో తో దుమ్ములేపిన టీమిండియా.. తొలి టీ20లో న్యూజిలాండ్‌పై ఘన విజయం

IND vs NZ: ఆల్ రౌండ్ షో తో దుమ్ములేపిన టీమిండియా.. తొలి టీ20లో న్యూజిలాండ్‌పై ఘన విజయం

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాగ్ పూర్ వేదికగా బుధవారం (జనవరి 21) విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ చెలరేగితే.. ఆ తర్వాత బౌలర్లు రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  190 పరుగులు చేసి ఓడిపోయింది. అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

239 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్లోనే వికెట్ ను కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కాన్వేను డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. కాసేపటికి హార్దిక్ పాండ్య.. రచీన్ రవీంద్ర(1) ను ఔట్ చేసి ఇండియాకు రెండో వికెట్ అందించాడు. ఈ దశలో కివీస్ ను ఆదుకునే బాధ్యత రాబిన్సన్, గ్లెన్ ఫిలిప్స్ తీసుకున్నారు. భారీ షాట్లతో స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్ లోనే విడదీశాడు. ఒక చక్కని డెలివరీతో   21 పరుగులు చేసిన రాబిన్సన్ ను ఔట్ చేశాడు. 

51 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్ తన పోరాటాన్ని ఆపలేదు. భారీ షాట్లతో చెలరేగిన ఫిలిప్స్.. చాప్ మాన్ (39) తో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 7 ఓవర్లలోనే 78 పరుగులు చేసి కొంచెం పోటీ ఇచ్చారు. 78 పరుగులు చేసి దూకుడు చూపించిన పిలిప్స్ ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ ఛేజింగ్ లో వెనకబడింది. మిచెల్, సాంట్నర్ చివర్లో మెరుపులు మెరిపించినా కివీస్ విజయానికి సరిపోలేదు. ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య తలో వికెట్ పడగొట్టారు. 

►ALSO READ | IND vs NZ: అభిషేక్ శర్మ ఖాతాలో వరల్డ్ రికార్డ్.. టీమిండియా ఓపెనర్ ధాటికి విండీస్ వీరుడు వెనక్కి

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అభిషేక్ శర్మ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ సంజు శాంసన్ (10), ఇషాన్ కిషాన్ (8) త్వరగానే పెవిలియన్ కు చేరడంతో టీమిండియా 27 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్ లో అభిషేక్ శర్మ ఎప్పటి లాగే దుమ్ములేపాడు. సూర్య కూడా వేగంగా ఆడడంతో స్కోర్ కార్డు పరుగులు పెట్టింది. ఇక అభిషేక్ అయితే కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆటాడుకున్నాడు.

మూడో వికెట్ కు సూర్యతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో అభిషేక్ 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్వల్ప వ్యవధిలో సూర్య (32)తో పాటు అభిషేక్ శర్మ (84) ఔట్ కావడంతో ఇండియా పరుగుల వేగం కొంచెం తగ్గింది. హార్దిక్ పాండ్య కొంచెం సేపు మెరుపులు మెరిపించాడు. మిడిల్ ఓవర్స్ లో కివీస్ పుంజుకొని వికెట్లు తీయడంతో ఇండియా 185 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే చివరి వరకు క్రీజ్ లో ఉన్న రింకూ సింగ్ భారత జట్టుకు భారీ స్కోర్ అందించాడు. చివరి ఓవర్లో రింకూ రెండు సిక్సులు, రెండు ఫోర్లు కొట్టడంతో స్కోర్ 238 పరుగులకు చేరుకుంది. రింకూ 20 బంతుల్లోనే 44 పరుగులు చేయడం విశేషం.