
వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం (అక్టోబర్ 14) ముగిసిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విండీస్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ లో పోరాడిన వెస్టిండీస్ కేవలం 121 పరుగుల టార్గెట్ ను మాత్రమే ఇండియా ముందు ఉంచగలిగింది. 121 పరుగుల టార్గెట్ ను ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి గెలిచింది. స్వల్ప ఛేజింగ్ లో రాహుల్ (58*) హాఫ్ సెంచరీతో రాణించగా సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
వికెట్ నష్టానికి 63 పరుగులతో చివరి రోజు ఆట ప్రారంభించిన టీమిండియా సాయి సుదర్శన్ (39), గిల్ (13) వికెట్లను కోల్పోయింది. అయితే ఒక ఎండ్ లో రాహుల్ హాఫ్ సెంచరీతో జాగ్రత్తగా ఇండియాకు విన్నింగ్ రన్స్ కొట్టాడు. ఈ విజయంతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఇండియా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన గిల్ సేన.. ఢిల్లీ టెస్టులో 7 వికెట్ల తేడాతో నెగ్గింది.
ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు జైశ్వాల్ సెంచరీ, సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసి భారీ స్కోర్ కు బాటలు వేసుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా సెకండ్ డే కూడా పూర్తిగా అధిపత్యం చెలాయించింది.
రెండో రోజు మరో 200 పరుగులు చేసి రెండో సెషన్‌లో 518/5 స్కోరు వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఇండియా. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (175), కెప్టెన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సాయి సుదర్శన్ (87), కేఎల్ రాహుల్ (38), నితీశ్‌కుమార్ రెడ్డి (43) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలలో వారికన్ 3, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకు ఆలౌటైంది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/82) టర్నింగ్ మ్యాజిక్ చేయడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 248 రన్స్‌కే వెస్టిండీస్ ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కావడంతో టీమిండియాకు 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో వెస్టిండీస్ ను టీమిండియా ఫాలో ఆన్ ఆడించింది.
రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. టాగెనరైన్ చంద్రపాల్, అలిక్ అథనాజ్ ఔట్ కావడంతో విండీస్ జట్టు 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఈ దశలో కాంప్‌బెల్ (115), హోప్ (102) జట్టును ఆదుకున్నా నాలుగో రోజు రెండో సెషన్ లో టీమిండియా బౌలర్లు విజృంభించడంతో ఇండియా ముందు స్వల్ప టార్గెట్ ను మాత్రమే ఉంచగలిగింది. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో మూడు వికెట్లు పడగొట్టారు. సిరాజ్ రెండు.. సుందర్, జడేజాలకు తలో వికెట్ లభించింది. 121 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఇండియా మూడు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.