గుజరాత్ లో తుఫాన్.. రంగంలోకి దిగిన సైన్యం

గుజరాత్ లో తుఫాన్.. రంగంలోకి దిగిన సైన్యం

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను అతితీవ్ర రూపం ధరించి తీరం వైపు దూసుకొస్తోంది. గురువారం (జూన్ 15న) గుజరాత్‌ లోని కచ్‌ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకనుంది. దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 

రంగంలోకి ఆర్మీ బలగాలు
బిపోర్‌జాయ్‌ తుపానుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. భారత ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి విపత్తు పరిస్థితులైనానా దీటుగా ఎదుర్కొనేందుకు ఆర్మీ సైన్యం సిద్ధంగా ఉంది. 

గుజరాత్ ముఖ్యమంత్రికి మోడీ ఫోన్ 
తుపాను ముప్పు నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ లో మాట్లాడారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

విద్యాసంస్థలకు సెలవులు
సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కచ్‌, ద్వారక ప్రాంతాల్లో దాదాపు 12వేల మందిని మరో చోటుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే జూన్‌ 15 వరకు గుజరాత్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

రైళ్ల రాకపోకలకు అంతరాయం 
తుపాను ఎఫెక్ట్‌తో పశ్చిమ రైల్వే పరిధిలో వందకు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇప్పటివరకు 67 రైళ్లను అధికారులు రద్దు చేయగా.. మరో 56 రైళ్ల ప్రయాణాన్ని కుదించారు. ముంబయిలో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. 

ప్రస్తుతం బిపోర్‌జాయ్‌ తుపాను పోరుబందర్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 300 కిలోమీటర్లు, ద్వారకకు నైరుతి దిశలో 290 కిలోమీటర్లు, జఖౌ పోర్టుకు దక్షిణ-నైరుతి దిశలో 340కిలోమీటర్ల దూరంలో ఉంది. జూన్‌ 15వ తేదీన సాయంత్రం ఈ తుపాను జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటే అవకాశముందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. 

2023 జూన్ 15వ తేదీ ఉదయం ద్వారక.. కచ్ ప్రాంతాల మధ్య 135 కిలోమీటర్ల వేగంతో బిపోర్‌జాయ్‌ తుపాన్ తీరాన్ని తాకనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఆ ప్రాంతంలో విధ్వంసం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో అధికారులు చేపల వేట పనులను  కూడా నిలిపివేశారు. కచ్ జిల్లాలోని తీర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 

మంగళవారం ఉదయం, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ,మత్స్య శాఖ సహాయ మంత్రి పర్షోత్తం రూపాలా దేవభూమి ద్వారకా జిల్లాలో పరిస్థితిని సమీక్షించారు. అటు సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు నడపటం లేదని పశ్చిమ రైల్వే సీపీఆర్వో సుమిత్ ఠాకూర్ తెలిపారు.  

తుపాను నేపథ్యంలో వైద్యారోగ్య పరిస్థితులను పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతోపాటు భోజన ఏర్పాట్లను షెల్టర్ హోమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం (జూన్ 13న) తెలిపారు. తీరప్రాంతాల్లోని ఓడరేవుల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ ఖాళీ చేయించి, ఓడలకు లంగరు వేసి, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.