- ఈ ఏడాది10.5 శాతం పెరిగిన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు
- 46 లక్షల యూనిట్లతో కొత్త రికార్డ్
- సీఏఎఫ్‌ఈ రూల్స్‌తో బండ్ల ధరలు పెరిగే అవకాశం
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈ ఏడాది రికార్డు స్థాయి వృద్ధిని సాధించింది. కొత్త సంవత్సరంలో కూడా ఇదే ఊపు కొనసాగుతుందని, ప్యాసింజర్ బండ్ల అమ్మకాలు 7–8 శాతం వృద్ధి సాధిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. జీఎస్‌టీ కోత, వడ్డీ రేటు తగ్గింపులు, ఆదాయ పన్ను రాయితీలు వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచి, వాహనాల డిమాండ్‌ను నిలబెడతాయని అంచనావేశాయి.
2025లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఊహించని స్థాయిలో 46 లక్షల యూనిట్లకు చేరాయి. కిందటేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే 10.5 శాతం వృద్ధి నమోదయ్యింది. పట్టణాల్లో డిమాండ్ పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు నిలకడగా ఉండడం, ఫైనాన్స్ అందుబాటులో ఉండడంతో బండ్ల అమ్మకాలు పుంజుకున్నాయి. ఈ ఏడాది కూడా ఎస్‌యూవీల ఆధిపత్యం కొనసాగింది. సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది దాదాపు 2.5 కోట్ల టూవీలర్లు, 10 లక్షల కమర్షియల్ బండ్లు కూడా అమ్ముడయ్యాయి.
కొత్త రూల్స్‌తో సవాళ్లు
2027 నుంచి కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్‌ఈ) నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బండ్ల సీఓ2 ఉద్గారాలను, ఫ్యూయల్ వాడకాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ రూల్స్‌ను తీసుకొచ్చింది. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం) బండ్లను ఈ నిబంధనలకు తగ్గట్టు తయారు చేయాల్సి ఉంటుంది. 2027 కి రెడీ కావడానికి 2026 అంతా సరిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ రూల్స్ అమల్లోకి తెస్తే కంపెనీల ఖర్చులు పెరుగుతాయని, ఫలితంగా బండ్ల ధరలు కూడా పెరుగుతాయని వివరించాయి. టూవీలర్ తయారీ కంపెనీలు ఏబీఎస్, సీబీఎస్ వంటి సెక్యూరిటీ ఫీచర్లతో బండ్లను తేవడం తప్పనిసరి. దీంతో ఎంట్రీ-లెవల్ ధరలు పెరిగి, కొన్ని విభాగాల్లో వృద్ధి మందగించే అవకాశం ఉంది. సప్లయ్ చెయిన్ సమస్యలు, గ్లోబల్ అనిశ్చితులు, కరెన్సీ బలహీనత వంటి అంశాలు ప్రీమియం వాహనాలపై ప్రభావం చూపుతాయని ఎనలిస్టులు పేర్కొన్నారు.
మారుతి సుజుకీ సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, ‘‘వినియోగదారులకు జీఎస్‌టీ 2.0 ప్రయోజనాలు 2026లో పూర్తిగా అందుతాయి. ప్యాసింజర్ సెగ్మెంట్ సేల్స్ 7–8 శాతం వృద్ధి చెందుతాయి”అని అన్నారు. డీలర్స్‌లలో 74శాతం మంది రానున్న మూడు నెలల్లో మంచి వృద్ధి ఆశిస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) అధ్యక్షుడు వినేశ్వర్ తెలిపారు.
సొషైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) అధ్యక్షుడు షైలేష్ చంద్ర ఎగుమతుల్లో డబుల్-డిజిట్ వృద్ధి ఉంటుందని అన్నారు. టాటా మోటార్స్, మహీంద్రా, హోండా, రెనాల్ట్, టయోటా, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి కంపెనీలు ఎస్‌యూవీలు, ఈవీలు, సీఎన్‌జీ బండ్లపై దృష్టి పెట్టి, కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
