ఫారిన్ కంపెనీలు ఎగవడ్తయ్.. జాగ్రత్త: రాహుల్ గాంధీ

ఫారిన్ కంపెనీలు ఎగవడ్తయ్.. జాగ్రత్త: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయిందని, ఇలాంటి సమయంలో ఇండియన్ కంపెనీలను టేకోవర్ చేసుకునేందుకు ఫారిన్ కంపెనీలు పొంచి ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. విదేశాల్లో కంపెనీల నుంచి మన కార్పొరేట్లను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. విపత్కర పరిస్థితుల్లో ఫారిన్ కంపెనీలు మన కార్పొరేట్లను హస్తగతం చేసుకోకుండా చూడాలని కోరారు. హౌజింగ్ డెవలప్​మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్​డీఎఫ్​సీ)లో 1.01 శాతం వాటాను పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కొనుగోలు చేసిన మరుసటి రోజే రాహుల్ ఈ ట్వీట్ చేశారు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో చైనా బ్యాంక్.. హెచ్​డీఎఫ్​సీలో దాదాపు 1.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది.

‘‘భారీగా ఎకానమీ పడిపోతున్న సందర్భంలో కార్పొరేట్​లను విదేశీ బడా సంస్థలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు. జాతీయ సంక్షోభం ఉన్న ఇలాంటి సమయంలో ఇండియన్ కార్పొరేట్​లను ఫారిన్ కంపెనీలు కంట్రోల్ చేసే ఎలాంటి పరిస్థితులను అనుమతించకూడదు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.