మనం చాక్లెట్‌కు భారీ పెట్టుబడులు.. వ్యాపార విస్తరణే లక్ష్యమన్న చైతన్య ముప్పాల

మనం చాక్లెట్‌కు భారీ పెట్టుబడులు.. వ్యాపార విస్తరణే లక్ష్యమన్న  చైతన్య ముప్పాల

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రీమియం క్రాఫ్ట్ చాక్లెట్ బ్రాండ్ ‘మనం చాక్లెట్’ సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ చాక్లెట్ ఖ్యాతిని పెంచే దిశగా అడుగులు వేస్తూ.. ఈ సంస్థ సిరీస్-A ఫండింగ్ రౌండ్‌లో ఏకంగా 9 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.85 కోట్ల మేర భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ 'ఓమ్నివోర్' నేతృత్వంలో జరిగిన ఈ ఫండింగ్‌లో టర్నర్ మోరిసన్ కన్సార్టియం కూడా భాగస్వామిగా ఉంది.

కొత్త ఫండ్స్ సాయంతో మనం చాక్లెట్ దేశవ్యాప్తంగా తన వ్యాపారాన్ని మరింత వేగంగా విస్తరించనుంది. ముఖ్యంగా రాబోయే 12 నెలల్లో ఢిల్లీ NCR ప్రాంతంలో కొత్త ఎక్స్‌పీరియన్షియల్ రీటెయిల్ స్టోర్లను ప్రారంభించాలని సంస్థ ప్లాన్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన యంగ్ బిజినెస్ మెన్ చైతన్య ముప్పాల 2021లో ఈ కంపెనీని స్థాపించారు. చైతన్య కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, అమెరికాకు చెందిన ఐఐసీసీటీ గుర్తింపు పొందిన భారతదేశపు మొట్టమొదటి 3 సర్టిఫైడ్ చాక్లెట్ టేస్టర్ కూడా. 

మనం చాక్లెట్ ప్రత్యేకత అంతా దాని 'ఫార్మ్-టు-బార్' మోడల్‌లోనే ఉంది. కకావో సాగు, ఫెర్మెంటేషన్ నుంచి చాక్లెట్ తయారీ, అమ్మకం వరకు ప్రతి దశనూ ఈ సంస్థే స్వయంగా నిర్వహిస్తుంది. దీని మాతృ సంస్థ 'డిస్టింక్ట్ ఒరిజిన్స్' ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 250 మందికి పైగా రైతులతో కలిసి 3వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కకావో పంటను సాగు చేయిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా దేశంలోనే అతిపెద్ద కకావో పండించే ప్రాంతంగా ఉన్న సంగతి తెలిసిందే. 

ప్రపంచంలోనే అతిపెద్ద కకావో ఫెర్మెంటేషన్ ఫెసిలిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన 'డిస్టింక్ట్ ఒరిజిన్స్ కకావో ఫెర్మెంటరీ' పశ్చిమ గోదావరిలోని తాడికలపూడిలో ఉంది. ఇక్కడ సొంత టెక్నాలజీ ద్వారా కకావో గింజల నాణ్యతను, చాక్లెట్ రుచిని మెరుగుపరుస్తారు. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఫ్లాగ్‌షిప్ స్టోర్ 'మనం చాక్లెట్ కార్ఖానా', అలాగే న్యూఢిల్లీలోని అవుట్‌లెట్, ఆన్‌లైన్ ఛానెల్స్ ద్వారా ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా చాక్లెట్ ప్రియులను ఆకట్టుకుంటోంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ సొమ్మును తన సప్లై అండ్ లాజిస్టిక్స్ వ్యవస్థల బలోపేతానికి వినియోగించాలని చైతన్య నిర్ణయించారు.

ఓమ్నివోర్ పార్ట్‌నర్ రైహెమ్ రాయ్ మాట్లాడుతూ.. మనం చాక్లెట్ రైతులతో కలిపి పనిచేస్తున్న వ్యాపార విధానాన్ని అభినందించింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల నుండి రైతులకు రక్షణ కల్పిస్తూ వారి ఆదాయాన్ని పెంచుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల చాక్లెట్ సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్న వేళ గ్లోబల్ చాక్లెట్ పరిశ్రమలో భారతదేశం ఒక కీలకమైన శక్తిగా ఎదిగేందుకు మనం చాక్లెట్ మార్గం సుగమం చేస్తోందని రాయ్ అన్నారు.