భారత ఉన్నత విద్యకు ‘త్రీ ఇన్ వన్’ నియంత్రణ

భారత ఉన్నత విద్యకు ‘త్రీ ఇన్ వన్’ నియంత్రణ

భారతదేశ ఉన్నత విద్యావ్యవస్థ సుమారు 1,100 విశ్వవిద్యాలయాలు, దాదాపు 45,000  కళాశాలలతో  విశాలమైనది.  కానీ, దాని నియంత్రణ పర్యవేక్షణ చాలాకాలంగా విమర్శలకు గురి అవుతున్నది.  ప్రస్తుతం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విశ్వవిద్యాలయాలను,  నాన్ టెక్నికల్ ఉన్నత విద్యను పర్యవేక్షిస్తుండగా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) సాంకేతిక విద్యను,  నేషనల్  కౌన్సిల్ ఫర్  టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఉపాధ్యాయుల విద్యను పర్యవేక్షిస్తున్నది.  ఈ మూడు సంస్థలు  విడివిడిగా పనిచేయడం వలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. 

యూజీసీ, ఏఐసీటీఈ,  ఎన్సీటీఈ అనేవి విభిన్న డేటా వ్యవస్థలను కలిగి ఉంటాయి.  అదేవిధంగా  ఒక  ప్రోగ్రామ్ లేదా  ఒక  డిగ్రీ  ఏ సంస్థ కిందకు వస్తుందనే దానిపై విరుద్ధమైన నియమాలు గందరగోళానికి  దారితీస్తున్నాయి. ఉదాహరణకు మాస్టర్ అఫ్ సైన్స్(ఎంఎస్సీ) పూర్తిచేసిన తరువాత సంబంధిత ఎం.టెక్. కోర్సులలో  విశ్వవిద్యాలయాలు అడ్మిషన్స్ ఇచ్చినప్పటికీ.. ఇంజినీరింగ్ కళాశాల ఉపాధ్యాయ నియామకాల్లో వీరు చేసిన ఎం.టెక్. కోర్స్​ను  కొన్ని విశ్వవిద్యాలయాలు 
పరిగణనలోకి తీసుకోవు. 

ప్రతిసంస్థ దాని సొంత నియమ, నిబంధనలను కలిగి ఉన్నది.  దీనివలన సాంకేతిక, నాన్- టెక్నికల్, టీచర్ ఎడ్యుకేషన్  విభాగాలలో ఏకరీతి నాణ్యత,  సజావుగా  క్రెడిట్ బదిలీలు నిర్ధారించడం కష్టమవుతున్నది. ఉదాహరణకు నాన్- టెక్నికల్  విద్య అంటే సైన్స్, కామర్స్, ఆర్ట్స్ వంటి విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు ఉన్నతవిద్య  కళాశాలలో లెక్చరర్​గా  నియామకానికి నెట్ లేదా సెట్ పరీక్షలో  తప్పనిసరిగా అర్హత సాధించవలసిన అవసరం ఉన్నది.  

సాంకేతిక విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులకు ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్​గా నియామకానికి  నెట్,  సెట్  లేదా  గేట్ పరీక్షలో  తప్పనిసరిగా అర్హత సాధించవలసిన అవసరం లేదు. అదేవిధంగా స్కూల్ టీచర్ల నియామకానికి  తప్పనిసరిగా  టెట్ పరీక్షలో అర్హత సాధించవలసిన అవసరం ఉన్నది.  విద్యార్థులు ఈ మూడు సంస్థల విభిన్న నియమాలను, అర్హతలను అర్థం చేసుకోవడంలో  ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

విద్యావకాశాలు పరిమితం

విద్యార్థులకు ఈ మూడు సంస్థల నియమాలు వారి విద్యావకాశాలను పరిమితం చేస్తున్నది. ఈ మూడు సంస్థలు సమన్వయంతో  పరిశ్రమలు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యను రూపకల్పన చేయలేకపోతున్నాయి.  ఇటువంటి ఇబ్బందులను నివారించడం కోసం యూజీసీ,  ఏఐసీటీఈ,  ఎన్సీటీఈ.. ఈ మూడు  సంస్థలను  కలిపి 'వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్' అనే ఒకే సంస్థ  నియంత్రిస్తుంది. అంటే  ‘త్రీ ఇన్ వన్’ అన్నమాట. 

 గతంలో  'హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’(హెచ్‌‌‌‌.ఈ.సీ.ఐ.) అనే  ఈ  ప్రతిపాదిత బిల్లు ఇప్పుడు 'వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్' అని  12.12.2025  నాడు కేంద్ర మంత్రివర్గం పేరు మార్చటం జరిగింది.  'వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్'  వైద్య,  న్యాయ కళాశాలలను  పర్యవేక్షించదు.  హెచ్‌‌‌‌.ఈ.సీ.ఐ. సంస్థ ఏర్పాటును జాతీయ విద్యావిధానం-2020 (ఎన్.ఇ.పి.2020)లో  ప్రతిపాదించారు. 

ఎన్.ఇ.పి.2020 ఆవశ్యకత

స్వాతంత్ర్యం తర్వాత  జాతీయ విద్యావిధానాన్ని మొదటిసారిగా 1968లో  అప్పటి  ప్రధానమంత్రి  ఇందిరా గాంధీచే  ప్రవేశపెట్టారు.  కొత్త జాతీయ విద్యా విధానం 1986లో ఆనాటి  ప్రధానమంత్రి  రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారు. 1986 నాటి  జాతీయ విద్యా విధానాన్ని  పీవీ నరసింహారావు ప్రభుత్వం 1992లో  సవరించింది.  34 సంవత్సరాల తర్వాత  2020వ  సంవత్సరంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం-2020 (ఎన్.ఇ.పి.2020)ను రూపొందించింది.  

ప్రముఖ అంతరిక్ష  శాస్త్రవేత్త,  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) మాజీ  చైర్మన్,  కె. కస్తూరిరంగన్ అధ్యక్షతన తొమ్మిదిమంది విద్యావేత్తల కమిటీ జాతీయ విద్యా విధానం-2020ను రూపొందించినది. ఎన్.ఇ.పి.2020 అనేది  భారతదేశ  విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి ఉద్దేశించిన ఒక జాతీయ విద్యా విధానం.  

ఐక్యరాజ్యసమితి  నిర్దేశించిన  పదిహేడు  సస్టైనబుల్  డెవలప్​మెంట్​లక్ష్యాలలోని  నాలుగో లక్ష్యంతో  ఎన్.ఇ.పి.2020  బలంగా ముడిపడి ఉంది.  ఇది 2030 నాటికి అందరికీ సమ్మిళిత,  సమానమైన నాణ్యమైన విద్యను అందించడం,  జీవితాంతం అభ్యసన అవకాశాలను ప్రోత్సహించటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 

వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్'  ఒకే రకమైన  నియమాలను అనుసరించటం వలన  నిర్ణయాలను తీసుకోవటంలో  స్పష్టత,  విద్యావ్యవస్థ సంస్కరణలలో వేగవంతమైన ఆచరణాత్మక నిర్ణయాలను తీసుకొనే అవకాశం ఉన్నది.

'వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్'  ప్రతిపాదిత బిల్లు.  ఇది లోక్​సభ ఆమోదాన్ని  పొందవలసి ఉన్నది.  డిసెంబర్ 16 , 2025 నాటి  లోక్‌‌‌‌సభ  తీర్మానం ప్రకారం,  ఉన్నత  విద్యా కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేసే బిల్లును పార్లమెంట్ ఉమ్మడి కమిటీకి పంపింది.  ఈ ఉమ్మడి కమిటీలో లోక్‌‌‌‌సభ నుంచి 21మంది సభ్యులు,  రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు.  

ప్రతిపాదిత  కమిటీ 2026 బడ్జెట్ సమావేశాల మొదటి భాగం చివరిరోజు నాటికి తన నివేదికను సమర్పిస్తుంది. ఈ బిల్లు ఒక సమగ్ర  సంస్కరణను సూచిస్తున్నప్పటికీ, జాగ్రత్త వహించాలనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.

అధికార కేంద్రీకరణ

ఒకే  కమిషన్ కింద అధికార  కేంద్రీకరణ పాలనాపరమైన ఆందోళనలను పెంచుతుంది.  రాష్ట్రాలు తమ సంస్థలపై తమ అధికారం తగ్గినట్లు భావిస్తే ఉద్రిక్తతలు తలెత్తవచ్చు.  ప్రస్తుతం విద్యా నాణ్యత  పూర్తిగా తగ్గిపోతున్నది.  విద్యా వ్యవస్థ కేవలం కాగితపు పులులను మాత్రమే తయారుచేస్తున్నది.

  అంటే  అధికమార్కులతో  డిగ్రీలను  ప్రదానం చేస్తున్నది కానీ కావలసిన నైపుణ్యాలను నేర్పించడం లేదు.  ప్రపంచంలో అత్యధిక  జనాభా కలిగిన మన దేశంలో ప్రపంచస్థాయి  విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్​లో  కనీసం 200లోపు కూడా స్థానం సంపాదించటం లేదు. 

ఉన్నత  విద్యాప్రమాణాలను పర్యవేక్షించే  నేషనల్ బోర్డు అఫ్  అక్రెడిటేషన్,  నాక్ వంటివి ఉన్నప్పటికీ వాటి పర్యవేక్షణ నామమాత్రంగానే ఉన్నది.  నాణ్యత లేని పరిశోధన పత్రాలు,  పీహెచ్డీలు చాలా  సర్వసాధారణమయ్యాయి.  అందువలన  కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలోని వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని దానికి తగినవిధంగా  'హయ్యర్ ఎడ్యుకేషన్  కమిషన్ ఆఫ్ ఇండియా’ బిల్లు రూపకల్పన చేసినట్లయితే  మనదేశంలోని  ఉన్నత విద్యావ్యవస్థ బలపడుతుంది. 

హెచ్​ఈసీఐ

‘హయ్యర్ ఎడ్యుకేషన్  కమిషన్ ఆఫ్ ఇండియా’  ఈ  కింది నాలుగు స్వతంత్రమైన, పరస్పరం అనుసంధానమైన విభాగాలకు  పర్యవేక్షకుడిగా పనిచేస్తుంది.  ఈ  నాలుగు విభాగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క  నిర్దిష్ట  పనిని నిర్వహిస్తాయి. 

 

  • 1. జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ కౌన్సిల్:  నియమాలను రూపొందించడం, కొత్త కళాశాలలు/ కోర్సులను ఆమోదించడం, ప్రమాణాలను అమలు చేయడం వంటి విధులను ఈ మండలి నిర్వహిస్తోంది.
  • 2.  నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ : ఇది  అక్రిడిటేషన్‌‌‌‌ను నిర్వహిస్తుంది.  కళాశాలలు / విశ్వవిద్యాలయాలను వాటి నాణ్యత ఆధారంగా మూల్యాంకనం చేయడం,  రేటింగ్  చేయడంవంటి విధులను ఈ మండలి నిర్వహిస్తోంది.
  • 3. ఉన్నత విద్య గ్రాంట్స్ కౌన్సిల్:  ఇది ప్రభుత్వ గ్రాంట్లు, స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌లు, అభివృద్ధి / పరిశోధన కోసం డబ్బును సంస్థలకు పంపిణీ చేస్తుంది. 
  • 4.  జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్:  ఇది అభ్యాస ఫలితాలను విశ్లేషిస్తుంది. విద్యార్థులు తమ కార్యక్రమాలలో ఏమి నేర్చుకోవాలి,  సాధించాలి అనే అంశాలను నిర్వచిస్తుంది.

- డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్–