- సైబర్ స్కామ్ కేంద్రాల నుంచి రక్షించిన ఇండియన్ ఎంబసీ
వియాంటినె (లావోస్) : లావోస్‌లోని సైబర్ స్కామ్ సెంటర్స్‌లో చిక్కుకున్న 47 మంది భారతీయులను ఇండియన్ ఎంబసీ రక్షించింది. బోకియో ప్రావిన్స్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్) కేంద్రాల నుంచి వీరిని కాపాడింది. ఈమేరకు శనివారం అక్కడి ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. లావోస్‌లోని సైబర్ స్కామ్ సెంటర్స్ లో 47 మంది ఇండియన్లు చిక్కుకున్నారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో వీరిలో
29 మందిని లావోస్ అధికారులు ఎంబసీకి అప్పగించారు. మిగిలిన 18 మంది సాయం కోసం ఎంబసీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఎంబసీ అధికారులు వియాంటినె నుంచి బోకియోకు వచ్చి వారిని రక్షించారు. లావోస్ అధికారులతో సంప్రదింపులు జరిపి ఇండియాకు పంపించే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటి వరకు లావోస్‌లో 635 మంది ఇండియన్స్ ను కాపాడి, భారత్‌కు సురక్షితంగా తరలించినట్టు ఎంబసీ పేర్కొంది.