పీఎఫ్ఐపై ఐదేండ్ల బ్యాన్

పీఎఫ్ఐపై ఐదేండ్ల బ్యాన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలతో సంచలనంగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్​ ఇండియా (పీఎఫ్ఐ), దానికి అనుబంధంగా ఉన్న 8 సంస్థలపై కేంద్రం నిషేధం విధించింది. టెర్రరిస్ట్ సంస్థలతో లింకులు ఉన్నాయని, దేశంలో ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం, ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేసినట్లు ఆధారాలు దొరకడంతో వీటిని నిషేధించినట్లు బుధవారం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద వీటిని ఐదేండ్ల పాటు బ్యాన్ చేస్తున్నామని, మంగళవారం రాత్రే నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు తెలిపింది. 

నిషేధిత సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) లీడర్లే పీఎఫ్ఐని స్థాపించారని, దీనికి జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబీ)తోనూ లింకులు ఉన్నాయని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), ఇతర టెర్రరిస్ట్ సంస్థలతోనూ పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నట్లు కేంద్ర సంస్థల దర్యాప్తులో ఆధారాలు దొరికాయని వెల్లడించింది. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థల ఆస్తుల స్వాధీనంతో పాటు వీటి సభ్యులను అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారాన్ని ఇస్తూ కేంద్రం మరో నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని పీఎఫ్ఐ స్టూడెంట్ విభాగం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్​ఇండియా పేర్కొంది.   

దేశ భద్రతకు ముప్పు

పీఎఫ్ఐని బ్యాన్ చేయాలని యూపీ, కర్నాటక, గుజరాత్ ప్రభుత్వాలు కూడా సిఫార్సు చేశాయని కేంద్రం తన నోటిఫికేషన్​లో పేర్కొంది. ‘‘పీఎఫ్ఐ సభ్యుల ద్వారా రెహాబ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఫండ్స్​ను సేకరిస్తోంది. అనుబంధ సంస్థల యాక్టివిటీలను పీఎఫ్ఐ నేతలే పర్యవేక్షిస్తున్నారు. యువత, స్టూడెంట్లు, మహిళలు, ఇమామ్‌‌లు, లాయర్లు, బలహీనవర్గాల వారిని తమ వైపు ఆకర్షించేందుకు, ఫండ్స్ సేకరణ కోసమే పీఎఫ్ఐ నేతలు 8 అనుబంధ సంస్థలను మెంటైన్ చేస్తున్నారు” అని కేంద్రం తెలిపింది. ‘‘మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల సాధికారత కోసం పని చేస్తున్నామని చెప్పుకుంటున్న పీఎఫ్ఐ.. సామాజిక ఉద్యమం ముసుగులో రాడికల్ ఇస్లాంను ప్రచారం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వడం, హింసాత్మక ఘటనలకు పాల్పడడం, కరాటే పేరుతో యువతకు టెర్రరిస్ట్ శిక్షణ ఇవ్వడం, అమాయక యువతను రెచ్చగొట్టి టెర్రరిజం వైపు ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలు చేస్తోంది” అని భద్రతా సంస్థలు చెప్తున్నాయి.   

బాంబు పేలుళ్లకూ కుట్ర

ఒక కాలేజీ ప్రొఫెసర్ చేతులు నరికేయడం, ఇతర మతాల సంస్థలకు చెందిన పలువురు వ్యక్తులను హత్య చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలపై బాంబు దాడులకు కుట్ర పన్నడం, టెర్రరిస్ట్ యాక్టివిటీలకు పీఎఫ్ఐ, ఇతర సంస్థలు పాల్పడుతున్నాయని కేంద్ర హోం శాఖ తెలిపింది. కేరళ, కర్నాటక, తమిళనాడులోనే ఎక్కువ మంది ఈ సంస్థల సభ్యుల చేతిలో హింసాత్మక దాడులకు గురైనట్లు వెల్లడించింది. దేశ, విదేశాల నుంచి బ్యాంకులు, హవాలా, విరాళాల ద్వారా పీఎఫ్ఐ, ఇతర సంస్థలు ఫండ్స్ సేకరిస్తూ టెర్రర్ యాక్టివిటీస్ చేస్తున్నందున వీటికి ఇన్ కం ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ను కూడా రద్దు చేసినట్లు కేంద్రం తెలిపింది. 

250 మంది అరెస్ట్ 

ఎన్ఐఏ సెప్టెంబర్​ 22న ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ సహా 14 రాష్ట్రాల్లో దాడులు చేసింది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతలు, కార్యకర్తల ఇళ్లల్లో సోదాల తర్వాత వంద మందికిపైగా అరెస్టయ్యారు. ఈ సోదాల్లో ల్యాప్‌‌టాప్ లు, పెన్‌‌డ్రైవ్ లు సహా పలు ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కూడా పలు రాష్ట్రాల్లో సోదాలు 150 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా 250కి పైగా వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  

ఆర్ఎస్ఎస్​నూ నిషేధించాలె: కాంగ్రెస్, ఆర్జేడీ

కేరళ కాంగ్రెస్ శాఖ, దాని మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కూడా పీఎఫ్ఐ బ్యాన్​ను సమర్థించాయి. అయితే, ఆర్ఎస్ఎస్ ను కూడా నిషేధించాలని డిమాండ్ చేశాయి. ఖురాన్​కు పీఎఫ్ఐ వక్రభాష్యం చెప్తూ ఈ కమ్యూనిటీ ప్రజలను హింసా మార్గంలో నడిపిస్తోందని ఐయూఎంఎల్ నేత ఎంకే మునీర్ ఆరోపించారు. పీఎఫ్ఐ కంటే ముందుగా ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చెయ్యాల్సిందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ హిందూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా మారిందని ఆయన ఆరోపించారు. 

కాంగ్రెసే పెంచి పోషించింది: బీజేపీ

దేశ ఐక్యత, సమగ్రతకు పీఎఫ్ఐ ముప్పు తెస్తోందని, దీనిని బ్యాన్ చేయడం సరైనదేనని యూపీ, కర్నాటక, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల సీఎంలు స్వాగతించారు. పీఎఫ్ఐను బ్యాన్ చేయడం ద్వారా కేంద్రం సరైన సమయంలో గట్టి చర్యను తీసుకుందని బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. టెర్రరిస్టులతో లింకులు పెట్టుకోవడంతో పాటు అనేక దాడులకు పాల్పడిన పీఎఫ్ఐని కాంగ్రెస్ పార్టీనే పెంచి పోషించిందని ఆరోపించింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని విమర్శించింది. పీఎఫ్ఐ నిషేధిత సిమి సంస్థకు మరో రూపమేనని బీజేపీ జనరల్ సెక్రటరీ సీటీ రవి అన్నారు.

కేంద్రం బ్యాన్ చేసిన సంస్థలివే.. 

పీఎఫ్ఐ, రెహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్​హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ విమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రెహాబ్ ఫౌండేషన్-కేరళ.  

బ్యాన్​ను సమర్థించం: అసదుద్దీన్ 

పీఎఫ్ఐ యాక్టివిటీలను తాము ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తామని, కానీ ఆ సంస్థపై నిషేధాన్ని మాత్రం సమర్థించబోమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కొంత మంది వ్యక్తులు నేరాలు చేసినంత మాత్రాన ఆ సంస్థ మొత్తాన్ని బ్యాన్ చేయడం సరికాదన్నారు. 

ఎన్‌‌ఐఏ కస్టడీకి పీఎఫ్‌‌ఐ నిందితులు

హైదరాబాద్‌‌, వెలుగు: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌‌ఐ) కేసులో ఎన్‌‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. చంచల్‌‌గూడ జైలులోని నలుగురు నిందితులను బుధవారం కస్టడీలోకి తీసుకుంది. గత వారం దేశవ్యాప్తంగా ఎన్‌‌ఐఏ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో  ఏపీకి చెందిన హమాన్, వహీద్, జాఫరుల్లాతో పాటు తెలంగాణకు చెందిన అబ్దుల్‌‌ వారిస్‌‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్‌‌ చేశారు. చంచల్‌‌గూడ జైలులో రిమాండ్‌‌ చేశారు. కోర్టు అనుమతితో నలుగురు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను చంచల్‌‌గూడ జైలు నుంచి మాదాపూర్‌‌‌‌లోని ఎన్‌‌ఐఏ ఆఫీస్‌‌కు తరలించి విచారిస్తున్నారు. మొదటి రోజు విచారణలో పీఎఫ్‌‌ఐ ఏర్పాటు యాక్టివిటీస్‌‌కి సంబంధించిన వివరాలను రికార్డ్‌‌ చేసినట్లు తెలిసింది.