
సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయాల రైల్ నిలయం భవనానికి.. ఇండియన్ గ్రీన్ బల్డింగ్ కౌన్సిల్ గోల్డ్ రేటింగ్ అవార్డును ప్రకటించింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా ఈ భవనం ఇంతకుముందు గోల్డ్ రేటింగ్‌ను సాధించగా నిర్దేశించిన అన్ని ప్రమాణాలను మళ్లీ పాటించినందుకు గోల్డ్ రేటింగ్‌ను తిరిగి ధ్రువీకరించారు. దీంతో ఈ సర్టిఫికేషన్ జులై 2023 నుంచి మూడేళ్ల పాటు పొడిగించారు.
ఈ భవనానికి ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ వ్యర్థ నీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ అనుకూలమైన గార్డెనింగ్, విద్యుత్ శక్తి ఆదా, ఉత్పత్తి, నివాసితుల సౌకర్యాలు, భవన కార్యకలాపాలు, నిర్వహణ లాంటి వివిధ నీటి సంరక్షణ, పొదుపు చర్యలను సక్రమంగా పాటించారు. దీంతో పాటు ఈ రేటింగ్ కోసం నిర్దేశించిన ఆరు ప్రమాణాలైన స్థిరమైన స్టేషన్ సౌకర్యం, ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుధ్యం, ఇంధన సామర్థ్యం, నీటి సామర్థ్యం, స్మార్ట్, గ్రీన్ చొరవ, ఆవిష్కరణ, అభివృద్ధి లాంటి అంశాలను ఆధారంగా చేసుకుని అవార్డులు ఇస్తున్నారు.
ఈ సర్టిఫికేషన్‌ను మరో మూడేళ్ల పాటు పొడిగించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ జిబీసీ నుంచి గోల్డ్ రేటింగ్‌ను పొందడంలో హరిత పద్ధతులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ డివిజన్ అధికారులు, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయ అధికారులను అభినందించారు.