మార్వాడీ గోబ్యాక్ అంటూ.. ఆగస్టు 18న అమనగల్లు బంద్ కు పిలుపు

మార్వాడీ గోబ్యాక్ అంటూ.. ఆగస్టు 18న అమనగల్లు బంద్ కు పిలుపు

రంగారెడ్డి: మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం..హైదరాబాద్ నగరంనుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోంది. రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో మార్వాడీ గోబ్యాక్ అంటూ నినదిస్తున్నారు. నల్లగొండ జిల్లా ఆమనగల్లులో వ్యాపారులు మార్వాడీ గోబ్యాక్ అంటూ నినదించారు.  ఆగస్టు 18న మార్వాడీ గోబ్యాక్ అంటూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి ఆమనగల్లుకు చెందిన కిరాణ ,వస్త్ర ,వర్తక సంఘం,- స్వర్ణకార సంఘం బంద్ కు పిలుపునిచ్చింది. 

తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మార్వాడీలు విస్తరిస్తూ అన్ని రకాల వ్యాపారాలను కబ్జా చేస్తున్నారని నాణ్యతలేని, నాసిరకం వస్తువులను అమ్ముతూ ఈ ప్రాంత వ్యాపారస్తులను పరోక్షం దెబ్బతీస్తున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్వాడీల విస్తరణతో స్థానిక యువత ఉపాధి కోల్పోతున్నారని ఆరోపించారు.

మార్వాడీ షాపుల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించకుండా వారి ప్రాంతాలనుంచి తీసుకొచ్చిన మనుషులను లేబర్ గా పెట్టుకుంటున్నారని అన్నారు. ఇదే ఇలాగే కొనసాగితే తెలంగాణ ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ బంద్ కు పిలుపినిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు 

తెలంగాణలో ఇటీవల గో బ్యాక్ మార్వాడీ (Go Back Marwadi) అనే నినాదంతో సోషల్ మీడియాలో ఓ ఉద్యమం మొదలయ్యింది ఈ వివాదం సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో జరిగిన ఓ ఘటనతో ప్రారంభమైంది. పార్కింగ్ విషయంలో ఓ దళితుడిపై మార్వాడీ వ్యాపారులు దాడి చేశారని అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన గాయకుడు, రచయిత గోరేటి రమేష్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ ఒక పాట రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాట పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మార్వాడీలకు వ్యతిరేకంగా గో బ్యాక్ మార్వాడీ అనే నినాదం మొదలైంది.

గోరేటి రమేష్ రాసిన పాటతో స్ఫూర్తి పొందిన స్థానిక గ్రూపులు, ప్రజలు సోషల్ మీడియాలో మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం ఉధృతం అయింది. మార్వాడీల దుకాణాలను, స్వీట్ హౌస్‌లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వారి దగ్గర వస్తువులు కొనవద్దని, ఆహార పదార్థాలు తీసుకోవద్దని ప్రచారం చేస్తున్నారు. 

ఈ వివాదంపై బీజేపీ నాయకులు బండి సంజయ్ కుమార్ ,రాజా సింగ్ స్పందించి మార్వాడీలకు మద్దతుగా మాట్లాడారు. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం హిందూ సమాజాన్ని చీల్చడానికి కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్ర అని వారు ఆరోపించారు.

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో మార్వాడీల ఉనికి వందల సంవత్సరాలుగా ఉంది. నిజాం పాలన కాలంలోనే చాలా మంది మార్వాడీలు రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు. వారు వ్యాపారం, వాణిజ్యం, అప్పులు ఇవ్వడం వంటి ఆర్థిక కార్యకలాపాలలో కీలకంగా ఉన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మార్వాడీలు ముఖ్యమైన ఆధారం అని వారి పూర్వీకులు ఈ ప్రాంతంలోనే పుట్టి, ఈ అభివృద్ధికి తోడ్పడ్డారని కొందరు చెబుతున్నారు. 

అయితే మార్వాడీలు ఆర్థికంగా దోపిడీకి పాల్పడుతున్నారని స్థానిక వ్యాపారులు ,ప్రజలు ఆరోపిస్తున్నారు.ఈ వివాదం సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల మధ్య తీవ్రమైన చర్చలకు దారి తీస్తోంది.