
- కారుxబంగారం వీటిలో ఏది బెటర్
- పదేళ్లలో కారు విలువ 80 శాతం పడిపోతుంది.. ఇదేకాలంలో గోల్డ్ విలువ పెరుగుతూనే ఉంటుంది
- ఫోన్లు, వెకేషన్లు, కార్లు వంటివి తాత్కాలిక ఆనందానికే..
- స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా గోల్డ్‌ను చూడాలి: ఎనలిస్టులు
న్యూఢిల్లీ: చాలా మధ్య తరగతి కుటుంబాలు కారు కొనడాన్ని గొప్పగా భావిస్తాయి. గోల్డ్ కొనడాన్ని పాతకాలపు అలవాటుగా చూస్తాయి. కానీ, కొన్నేళ్లు పోతే ఈ రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
కారా? బంగారమా ?
కారు: మధ్య తరగతి కుటుంబాలకు కారు కొనుక్కోవడం ఒక డ్రీమ్. కారు విలువ టైమ్ అయ్యే కొద్దీ తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. 10–12 ఏళ్లలో 70–80 శాతం విలువ కోల్పోతుందని అంచనా. కేవలం కారు మాత్రమే కాదు, ఫోన్, ట్రిప్‌లు వంటివి తాత్కాలిక ఆనందాన్నిచ్చేవే కాని సంపదను పెంచవు. కారు కొన్న వ్యక్తి ఫ్యూయల్, మెయింటైనెన్స్ వంటి ఖర్చులను కూడా భరించాల్సి వస్తుంది.
బంగారం: గోల్డ్ విలువ స్థిరంగా పెరుగుతూ ఉంటుంది. ద్రవ్యోల్బణం, మార్కెట్ అనిశ్చితి వంటి పరిస్థితుల్లో కూడా బంగారం రక్షణగా పనిచేస్తుంది. కారు ఒక "లయబిలిటీ", బంగారం ఒక "ఆస్తి". అందుకే మధ్య తరగతి కుటుంబాల్లో బంగారం కొనుగోలు చేసినవారే నిజమైన పెట్టుబడిదారులు. 2024లో బంగారం 20 శాతానికిపైగా రాబడిని ఇచ్చింది. మరోవైపు కంపెనీలు కిందటేడాది కార్ల ధరలను మూడు సార్లు పెంచాయి.
ఉదాహరణకు, 2012లో ఒక తండ్రి రూ.7 లక్షల విలువైన కారు కొనుగోలు చేశాడనుకుందాం. అదే సమయంలో తల్లి అదే మొత్తానికి బంగారం కొనుగోలు చేస్తుంది. 2025కి వచ్చేసరికి ఆ కారు విలువ రూ.1.5 లక్షలకు పడిపోయింది. అంటే 70–80 శాతం విలువ కోల్పోయింది. బంగారం విలువ ఇదే టైమ్‌లో రూ.24 లక్షలకు పెరిగింది. ఇది 240 శాతం రిటర్న్! దీనికి సంబంధించి ఇండస్ట్రిలిస్ట్ హర్ష్ గోయెంకా తన అనుభవాన్ని గతంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఆయన రూ.8 లక్షలకు కారు కొనగా, ఆయన భార్య అదే మొత్తానికి బంగారం కొనుగోలు చేసింది. ఇప్పుడు కారు విలువ రూ.1.5 లక్షలకు పడిపోగా, బంగారం విలువ రూ.32 లక్షలకు పెరిగింది. “వెకేషన్ 5 రోజులే ఉంటుంది. బంగారం మాత్రం 5 తరాలు ఉంటుంది” అని ఆమె సలహా ఇచ్చిందని గోయెంకా పేర్కొన్నారు. మరో ఉదాహరణలో, ఆయన రూ. ఒక లక్ష విలువైన ఫోన్ కొనగా, ఆమె బంగారం కొనింది. ఇప్పుడు ఫోన్ విలువ రూ.8 వేలకు పడిపోయింది. బంగారం విలువ రూ.2 లక్షలకు పెరిగింది.
అనిశ్చితి టైమ్‌లో గోల్డ్ వైపే..
బంగారాన్ని ద్రవ్యోల్బణానికి హెడ్జ్‌గా వాడతారు. అంటే ద్రవ్యోల్బణం ఎంత పెరిగినా, దానికి తగ్గట్టు గోల్డ్ విలువ కూడా పెరుగుతుందని అర్థం. దీని విలువ తగ్గిపోదు. అదే రూపాయి వంటి కరెన్సీల విలువ ద్రవ్యోల్బణం పెరిగితే పడిపోతుంది. గ్లోబల్‌గా అనిశ్చితులు నెలకొంటే ఆర్‌బీఐ వంటి వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ కొనుగోలకు మొగ్గు చూపుతాయి. మరోవైపు కార్లు, ఫోన్లు, ట్రిప్స్ వంటి వస్తువులు కాలంతో విలువ కోల్పోతాయి.
బంగారం, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల విలువ పెరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 24క్యారెట్ల బంగారం ధర రూ.1,01,240 (10 గ్రాములకు), 22క్యారెట్ల ధర రూ.92,800 కి చేరింది. మూడేళ్ల క్రితం రూ.60 వేల దగ్గర వీటి ధరలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ (28 గ్రాములు) ధర 3,300 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.