మరో 4 రోజులు వానలు.. నేడు (ఆగస్ట్ 17) 5 జిల్లాలకు రెడ్ అలర్ట్‌

మరో 4 రోజులు వానలు.. నేడు (ఆగస్ట్ 17) 5 జిల్లాలకు రెడ్ అలర్ట్‌
  • ఉమ్మడి ఆదిలాబాద్ అతలాకుతలం.. ఉత్తర తెలంగాణలో దంచికొడ్తున్న వర్షాలు 
  • ఉప్పొంగి ప్రవహిస్తున్న ఒర్రెలు, వాగులు
  • వందలాది గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. ఆదిలాబాద్‌, నిర్మల్​కు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ 
  • మరో 4 రోజులు వానలు.. నేడు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ 
  • గోదావరి ప్రాజెక్టులకు జలకళ
  • కడెం, ఎల్లంపల్లి గేట్లు ఓపెన్​

హైదరాబాద్, వెలుగు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఉమ్మడి ఆదిలాబాద్ అతలాకుతలమైంది. అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లా తాంసిలో 17.4, తలమడుగులో 17 సెంటీమీటర్ల. వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆనంద్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ వద్ద పెన్‌‌‌‌‌‌‌‌గంగా నది బ్రిడ్జి పైనుంచి పారుతుండడంతో మహారాష్ట్రకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఆసిఫాబాద్ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. వందలాది ఎకరాల్లో పత్తి నీట మునిగింది.

మంచిర్యాల జిల్లాలో లక్సెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లి, మందమర్రి, జన్నారం, నెన్నెల, తాండూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాసిపేట మండలంలోని బుగ్గ చెరువు మత్తడి పొంగడంతో చేపల వేటకు వెళ్లిన నలుగురు యువకులు వరదలో చిక్కుకోగా.. స్థానికులు తాళ్ల సహాయంతో రక్షించారు. కడెం గేట్లు ఎత్తగా, ప్రాజెక్టు దిగువన చేపలు పట్టేందుకు వెళ్లిన గంగాధర్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. 

ఆదిలాబాద్ వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం..
శనివారం అత్యధిక వర్షపాతం నమోదైన టాప్​టెన్ ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్​ జిల్లా తాంసిలో 17.4, తలమడుగులో 17, రామ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 16.7, సాత్నాలలో 15.6, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో 15, గుడిహత్నూరులో 14.9, సిరికొండలో 14.7, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 14.1, ఆదిలాబాద్ జిల్లా హీరాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13.9, ఇచ్చోడలో 12.9, లోకారి కేలో 12.7, జైనథ్‌‌‌‌‌‌‌‌లో 12.4, మంచిర్యాల జిల్లా భీమినిలో 11.9, నెన్నెల్‌‌‌‌‌‌‌‌లో 10.2, ఆసిఫాబద్​ జిల్లా కెరమెరిలో 10  సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

మిగతా జిల్లాల్లోనూ..
జగిత్యాల, నిజామాబాద్ ​జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, హనుమకొండ, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. సంగారెడ్డిలోని పలు గ్రామాల్లో వాగులు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గంగారం సమీపంలోని నీలగండి వద్ద రోడ్డు తెగిపోవడంతో ఇల్లందు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. 

గూడూరు మండలంలోని పాకాల వాగు సైతం ఉప్పొంగడంతో కేసముద్రం- గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు ఉధృతంగా పారుతున్నాయి. కాల్వొడ్డు దగ్గర మున్నేరు 14 ఫీట్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. వాగులోకి ప్రస్తుతం 55 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది.

కారేపల్లి, కామేపల్లి మండలాల్లో బుగ్గవాగు పొంగడంతో పలు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ (ఘనపూర్ ఆనకట్ట) నుంచి భారీగా వరద వస్తుండడంతో ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం మూడు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా పారుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ భారీ వర్షాలతో పలుచోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. 

వాతావరణ శాఖ హెచ్చరికలు..
ఆదిలాబాద్, నిర్మల్​ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, ములుగు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్ ​అలర్ట్ ​జారీ చేసింది. ఆదిలాబాద్, జనగామ, జయశంకర్ ​భూపాలపల్లి, ఖమ్మం, ఆసిఫాబాద్​, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని చెప్పింది. సోమవారం నుంచి మూడ్రోజుల పాటు ఆరెంజ్​ అలర్ట్ ​జారీ చేసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రాజెక్టులన్నీ ఫుల్.. 
భారీ వర్షాలతో గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తగా, ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తారు. ఆదిలాబాద్‌‌‌‌లో సాత్నాల ప్రాజెక్ట్‌‌‌‌ నాలుగు గేట్లు, మత్తడివాగు ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నిర్మల్‌‌‌‌లో స్వర్ణ ప్రాజెక్ట్‌‌‌‌, గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి కూడా నీళ్లను విడుదల చేస్తున్నారు. ఇక శ్రీరాంసాగర్‌‌‌‌ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తున్నది.