కర్మఫలం: చేయని తప్పుకు ఎందుకు శిక్ష పడుతుంది.. అతను ఏ కర్మను అనుభవిస్తాడు..

 కర్మఫలం:   చేయని తప్పుకు ఎందుకు శిక్ష పడుతుంది.. అతను ఏ కర్మను అనుభవిస్తాడు..

ప్రతి మానవుడు కర్మ ఫలాన్ని అనుభవించాలి.. దాని ఆధారంగా జీవితం కొనసాగుతుంది.  మనం ఎవరికి ఎలాంటి హాని చేయకపోయినా ... చాలా ఇబ్బందులు పడుతుంటాం.  అలాంటి వాటినే కర్మఫలం అంటారు. పురాణాల ప్రకారం  కర్మఫలాలు ఎన్ని రకాలుగా ఉంటాయి.. గత జన్మలో చేసిన పాప పుణ్యాలు ఈ జన్మలో అనుభవిస్తారా..! మోక్షం ఎప్పుడు లభిస్తుంది.. కర్మలు ఎన్ని రకాలు.. అవి ఏ రూపంలో వస్తాయి.. ఎలా అనుభవిస్తాం.. వీటిని ఎలా తొలగించుకోవాలి.. అనే విషయాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం...

ఈ భూమి మీద మళ్ళీ జన్మ లేకుండా ముక్తినిపొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవాలి..  అలా వదిలించుకొనే వరకు మళ్లీ ..మళ్లీ పుడుతుంటారు.  చేసిన కర్మలు  ఎప్పటికైనా వదిలించుకోవాల్సిందే... అలా జరిగినప్పుడే మోక్షం లభించి.. ఇక మరుజన్మ ఉండదని పురాణాల ద్వారా తెలుస్తుంది. . .

మానవ జన్మ అవతరించిన తరువాత... ఉదయం లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తుంటాం.  అలా చేసే పనులు గతజన్మ... లేదా ఈ జన్మలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా కర్మల ప్రకారం చేస్తుంటాం.  ఇలా చేసే ప్రతి పనికి  కర్మ ఫలితం తప్పకుండా అనుభవించాలని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

కర్మ ఫలితం ప్రకృతి సహజ గుణం.. మనం చేసిన పనివలన వెంటనే ఎలాంటి ఫలితం రాకపోవచ్చు.  కాని ఆ పనివలన మంచి గాని.. చెడు గాని జరిగేందుకు సమయం తీసుకుంటుంది.  ఉదాహరణకు మనపై ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు అది కోర్టుకు వెళితే.. అది తేలేంతవరకు కొంత సమయం పడుతుంది కదా..! అలానే   మనం చేసే ప్రతి కర్మ కూడా ఎపుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చియే తీరుతుంది.


ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం..  ఫలితాన్నిచ్చే సమయాన్ని బట్టి కర్మలను మూడు  రకాలుగా విభజించారు. 

 

  •  1) అగామి కర్మలు
  •  2)సంచిత కర్మలు 
  • 3)ప్రారబ్ద కర్మలు.

 అగామి కర్మలు  :   ఇప్పుడు మనం చేస్తున్న కర్మలన్నీ ఆగామి కర్మలే. అయి తే ఈ కర్మలలో కొన్ని అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చేస్తాయి. ఉదాహరణకు ఏదైనా దెబ్బతగిలితే వెంటనే బాధ కలుగుతుంది కదా..! కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వటం కోసం కూడబెట్టు కొనిఉంటాయి. ఉదాహరణకు మనం భోజనం చేస్తాం. అది కూడా కర్మ.వెంటనే మన ఆకలి తీరుతుంది. ఎవరినైన కోపంతో తిడతాం.అవతలివాడు బలంగలవాడైతే చెంప పగలగొడుతాడు. అది కర్మఫలం. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితన్నిచ్చేస్తాయి. 

కానికొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు. ఉదాహరణకు ఎదురుగాలేని వాణ్ణి తిడతాం.వాడిమీద నిందలు వేస్తాం.కానీ అతనికి ఎదురుతిరిగే శక్తి ఉండదు.  కామ్​గా ఊరుకుంటాడు. తిట్టినవాడికి  అప్పటికప్పుడు ఫలితం రాదు. ఏదో ఒక రూపంలో తప్పక అనుభవిస్తారు.  కాని అది దాని వలన జరిగిందని తెలియదు.

దానధర్మాలు చేస్తాం... పుణ్యకార్యాలు చేస్తాం...అవన్నీ వెంటనే ఫలితన్నిచ్చేవి కావు. అలానే జీవహింస చేస్తాం... దాని ఫలితం వెంటనే కనబడదు. ఏదోఒక రోజు అనుభవించి తీరాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే మనం పరీక్షలు వ్రాస్తాం. ..ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది.ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితాన్ని ఇవ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వటానికి మంచి కర్మను కూడబెట్టుకోవాలి. ఇలా ఈ రకంగా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే.

 సంచిత కర్మలు :   ఇంతకూ ముందు జన్మలో చేసి, తర్వాత ఎప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టబడిన కర్మలలో నుండి ఆ జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇస్తాయి. గత జన్మలో అనుభవించగా మిగిలిపోయిన కర్మ ఫలం ..  ఒక జన్మనుండి మరొక జన్మకు మోసుకుంటూ వస్తారు.  ఇలా వచ్చిన కర్మలను సంకుచిత కర్మలు అంటారు.

 జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా గాని ఈ సంచిత కర్మలు మాత్రం జీవున్ని విడిచి పెట్టకుండా అతడితో ప్రయాణమై వస్తుంటాయి. మనం అద్దె ఇళ్ళలో వుండి మరొక ఇంటికి మారేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న వస్తువులను ఎలా మూటగట్టుకొని వేలతామో అలాగే జీవుడుకు శరీరం భగవంతుడు ఇచ్చిన అద్దె ఇంటిలాంటి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆశరీరంలో ఉన్నప్పుడు సంపాదించినా కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక అద్దె ఇంటిలాగా ... ఇంకో శరీరాన్ని వెతుక్కుంటూ వెళతాడు. ఇలా తీసుకువెళ్ళేవే సంచిత కర్మలు. ఇది కూడా అనుభవించి తీరాల్సిందే.  అందుకే ఒక్కోసారి చేయని తప్పుకు శిక్ష పడుతుంది కదా..! అంటే అలాంటి వ్యక్తి సంచిత కర్మలను అనుభవిస్తున్నాడని అర్దం.  

 ప్రారబ్ధ కర్మలు: అనేక  సంచిత కర్మలు జీవుడితో కలిసి ఉంటాయి.ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో  అప్పుడు అతడి account వున్న సంచిత కర్మల నుండి , ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో ..పండుతాయో, ఫలితన్నివ్వటానికి సిద్దంగా ఉంటాయో వాటిని ప్రారబ్ద కర్మలు అంటారు.ఆ ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి... దానికి తగిన శరీరంతో జీవుడు మళ్ళి ఈ లోకంలో ప్రవేశిస్తాడు.  అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు శరీరం వుంటుంది..

 ప్రారబ్ద కర్మలను తొలగించుకోవడానికి భగవంతుడు మనకు (జీవునికి) మరొక శరీరాన్ని ఇస్తుంటే, మనం ఇక్కడ వాటిని వదిలించుకోవడానికి వచ్చి... చేసే కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానముతో చెడు పనులు చేస్తూ కర్మను కూడగట్టుకుంటున్నాము. .ఇలా చేయడం వలన  మరల మరలా భగవంతుడు మనకు (జీవునికి), నీ కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణిడిగా తన  దగ్గరకు రమ్మని అతనికి మరల శరీరాన్ని ఇస్తున్నాడు.

 మనం ఏ రోజైతే సంపూర్ణంగా అన్ని కర్మలను ఈ  శరీరంతో  వదిలించుకుంటామో, మనం అప్పుడు మాత్రమే మన నివాస స్తానానికి  ( కైలాసం గాని.. వైకుంఠం గాని.. దేవుని సన్నిధికి) చేరుకుంటాము. మన నివాస స్థానము...మనం అనుకున్న్నట్టుగా వున్న ఈ శరీరము కాదు , ఈ భూమిమీద వున్న ఇల్లు కాదు. నీ నివాస స్థానము ఈ సృష్టికి మూలకరణము అయిన పరమాత్మునిలో ఐక్యం అవడమేనని పండితులు చెబుతున్నారు. అప్పటి వరకు ...పునరపి జననం ..పునరపి మరణం ...పునరపి జటరేశయనం” అని శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పినట్లు మళ్ళీ మళ్ళీ చస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్బంలో ప్రవేశిస్తూనే ఉంటాం.. . .