మమ్మల్ని బెదిరించాలని చూస్తే బెదరం.. బీహార్‎లో ఓట్ చోరీ పచ్చి అబద్ధం: ఈసీ

మమ్మల్ని బెదిరించాలని చూస్తే బెదరం.. బీహార్‎లో ఓట్ చోరీ పచ్చి అబద్ధం: ఈసీ

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘానికి అన్ని పార్టీలు సమానమేనని.. ఈసీ చట్టాలను ఎప్పుడూ గౌరవిస్తోందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర ఎన్నికల సంఘం పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. బీహార్ ఓటర్ జాబితా సవరణ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలపై ఆదివారం (ఆగస్ట్ 17) ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మేరకు భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదాభావాలు లేవని.. పౌరులు, పార్టీల మధ్య ఈసీ ఎలాంటి వివక్ష చూపించదని స్పష్టం చేశారు.

కొందరు ఎన్నికల కమిషన్‎పై పగబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఫేక్ ఇన్ఫర్మేషన్‎తో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈసీ భుజంపై గన్ పెట్టి ఓటర్లతో రాజకీయం చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మమ్మల్ని బెదిరించాలని చూస్తే బెదరమని.. తప్పుడు ఆరోపణలకు ఎన్నికల సంఘం భయపడదని తేల్చి చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఈసీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‎లో ఓటు చోరీ అనేది పచ్చి అబద్ధమని.. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే బీహార్లో ఓటర్ల జాబితా సవరణ చేపట్టామని తెలిపారు.

►ALSO READ | బీహార్ లో ప్రారంభమైన రాహుల్ ఓట్ అధికార్ యాత్ర

కానీ కొందరు రాజకీయ లబ్ధి కోసం ఓట్ చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎన్నికల సంఘాన్ని విమర్శించడం సరికాదని చురకలంటించారు. ఓటర్ జాబితా సవరణలో భాగంగా ఓటు తొలగిస్తే బాధితులు అభ్యంతరాలు తెలపవచ్చని సూచించారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని.. ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందవచ్చని తెలిపారు. 

కాగా,  2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈసీ బీజేపీతో కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడిదంటూ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఓట్ చోరీకి నిరసనగా ఆదివారం (ఆగస్ట్ 17) బీహార్‎లో ఓట్ చోరీ అధికార్ యాత్ర చేపట్టారు రాహుల్. ఆగస్టు 17వ తేదీ నుంచి 16 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. 25 జిల్లాల్లో 1300 కి.మీ వరకు రాహుల్ యాత్ర చేయనున్నారు. సెప్టెంబర్ 1న పట్నాలో జరిగే భారీ బహిరంగ సభలో యాత్ర ముగియనుంది.