
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమ్మె ఉద్రిక్తత కొనసాగుతోంది. కార్మికుల వేతనాల పెంపు, పని గంటలపై ఫిల్మ్ ఫెడరేషన్‌కు, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం కారణంగా గత 14 రోజులుగా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ సంక్షోభం తెలుగు సినిమాను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. పెద్ద బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాల నిర్మాణం కూడా పూర్తిగా ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce), ఫిల్మ్ ఫెడరేషన్‌కు ఒక లేఖ పంపింది. ఈ లేఖలో ఫిల్మ్ ఛాంబర్ తమ డిమాండ్లను, వేతన పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలకు మీరు ఒకే అంటే మేము కూడా ఒకే అన్నట్లు ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది. సమ్మె ముగింపు పలకాలని కోరింది.
ఫిల్మ్ ఛాంబర్ ప్రతిపాదనలు ఇవే..
ఫిల్మ్ ఛాంబర్ ప్రకారం, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉన్న 12 గంటల కాల్ షీట్‌ను రెగ్యులర్ పని గంటలుగా పరిగణించాలి. అంతకుమించి పని చేస్తే అదనపు వేతనంపై చర్చలు జరపాలని కోరింది. కార్మిక శాఖ ప్రకటించిన సెలవు దినాలు, రెండో ఆదివారం మాత్రమే రెట్టింపు వేతనం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారు. 2022 జూలై ఒప్పందం ప్రకారం, ఫైటర్స్, డాన్సర్స్ కోసం నిర్దేశించిన రేషియోలను తప్పనిసరిగా అమలు చేయాలని ఫిల్మ్ ఛాంబర్ నొక్కి చెప్పింది. ఈ రేషియోలను 2023 సెప్టెంబరు నుంచి పాటించడం లేదని పేర్కొంది. అంతే కాకుండా జనరల్ కండిషన్స్ క్లాజ్ 1 ప్రకారం, తమ చిత్రాలకు అవసరమైన నిపుణులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉండాలని ఫిల్మ్ ఛాంబర్ లేఖలో వివరించింది.
►ALSO READ | టాలీవుడ్ సంక్షోభం.. నిర్మాతలు, కార్మికుల మధ్య రాజీకి చిరంజీవి మధ్యవర్తిత్వం
వేతనాల పెంపు ప్రతిపాదనలు..
ఫిల్మ్ ఛాంబర్ ప్రతిపాదనల ప్రకారం.. కార్మికులు కొన్ని షరతులకు అంగీకరిస్తేనే వేతన పెంపు ఉంటుందని స్పష్టమైంది. రోజుకు రూ. 2000 లేదా అంతకంటే తక్కువ వేతనం పొందే కార్మికులకు మొదటి ఏడాది 10 శాతం, ఆ తర్వాత రెండు సంవత్సరాలు ప్రతి ఏటా 5 శాతం చొప్పున వేతనం పెంచడానికి నిర్మాతలు సిద్ధపడ్డారు. రూ. 2000 నుంచి రూ. 5000 మధ్య వేతనం పొందే వారికి మూడు సంవత్సరాల పాటు ప్రతి ఏటా 5 శాతం వేతన పెంపును ప్రతిపాదించారు. మరోవైపు తక్కువ బడ్జెట్ చిత్రాలకు ఈ వేతన పెంపు వర్తించదు. వారికి ప్రస్తుత వేతనాలే కొనసాగుతాయని లేఖలో స్పష్టం చేసింది.
ఫిల్మ్ ఫెడరేషన్ చర్చలు:
అటు ఫిల్మ్ ఛాంబర్ పంపిన ప్రతిపాదనలపై చర్చించడానికి, ఫిల్మ్ ఫెడరేషన్ 24 అనుబంధ సంఘాలతో సమావేశం కానుంది. అటు చిరంజీవితో కూడా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు సమ్మె భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ సంక్షోభానికి త్వరలోనే ఒక పరిష్కారం లభించాలని యావత్ సినీ పరిశ్రమ ఎదురుచూస్తోంది. ఈ వివాదం సద్దుమణగకపోతే భవిష్యత్తులో పలు భారీ చిత్రాల విడుదలలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. మరి ఫిల్మ్ ఛాంబర్ ప్రతిపాధనలను ఫెడరేషన్ ఒకే అంటుందా.. లేదా అనేది చూడాలి.