
జాతీయ జెండాపై సార్వత్రిక అభిమానం, గౌరవం, విధేయత ఉన్నది. అయినా జాతీయ జెండా ప్రదర్శనకు వర్తించే చట్టాలు, పద్ధతులు, సమావేశాలకు సంబంధించి ప్రజల్లోనే కాకుండా ప్రభుత్వ సంస్థలు/ ఏజెన్సీల్లో కూడా జాతీయ జెండాపై అవగాహన లేకపోవడం తరచూ మనం గమనిస్తున్న విషయం.
కాలానుగుణంగా ప్రభుత్వం జారీ చేసే చట్టబద్ధత లేని సూచనలతోపాటు, జాతీయ జెండాను ప్రదర్శించడం అనేది చిహ్నాలు, పేర్లు(అక్రమ వినియోగ నిరోధక) చట్టం, 1950, జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971 నిబంధనల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇలాంటి అన్ని రకాల చట్టాలు, సమావేశాలు, అభ్యాసాలు, సూచనలను భారత ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002 ద్వారా సంబంధిత వ్యక్తులకు మార్గదర్శకత్వం, ప్రయోజనం కోసం తయారు చేశారు.
సౌలభ్యం కోసం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా – 2002ను మూడు భాగాలుగా విభజించారు. కోడ్ మొదటి భాగంలో జాతీయ జెండా సాధారణ వివరణ ఉంటుంది. కోడ్ లోని రెండో భాగంలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు మొదలైన వారు జాతీయ జెండాను ఎగురవేయడానికి సంబంధించిన నియమాలు ఉంటాయి.
కోడ్ లోని మూడో భాగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వారి సంస్థలు, ఏజెన్సీలు జాతీయ జెండాను ఎగురవేయడానికి పాటించాల్సిన నియమాలు ఉంటాయి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002, అదే సంవత్సరం జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. అంతకుముందు వరకు ఉన్న ఫ్లాగ్ కోడ్ – ఇండియాను ఈ చట్టం భర్తీ చేస్తుంది.
జాతీయ జెండా మూడు దీర్ఘచతురస్రాకార భాగాలు లేదా సమాన వెడల్పు గల ఉపభాగాలతో రూపొందించిన మూడు రంగులతో ఉండాలి. జెండాలోని మొదటి భాగంపై కాషాయం రంగు, మూడో భాగంలో ఆకుపచ్చ రంగు ఉండాలి.
మధ్యలో తెల్లగా ఉండాలి. దాని మధ్యలో నీలం రంగులో 24 సమానంగా విభజించిన చువ్వలతో అశోక ధర్మచక్ర రూపకల్పన ఉండాలి. అశోక చక్రం రూపకల్పనకు స్క్రీన్ ప్రిటింగుకు లేదా ప్రింటింగుకు గానీ లేదా ఎంబ్రాయిడరీకి గానీ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ రూపకల్పన జెండాపై ఉన్న తెల్ల రంగుపై ఇరువైపులా పూర్తిగా కనిపించేలా ఉండాలి.
- జాతీయ జెండాను చేనేత లేదా పత్తి/ పాలిస్టర్/ ఉన్ని/ పట్టు/ ఖాదీ వస్త్రంతో యంత్ర సహాయంతో చేసింది అయి ఉండాలి.
- జాతీయ జెండా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. జెండా ఎత్తు(వెడల్పు)కు పొడవు నిష్పత్తి 3:2 అయి ఉండాలి .
- జాతీయ పతాకం ఎగురవేయడానికి సరైన కొలుతలు ఉన్న పతకాన్ని ఎన్నుకోవాలి.
- చిహ్నాలు, పేర్లు (దుర్వినియోగ నిరోధక చట్టం–1950ను అతిక్రమించి జాతీయ జెండాను ఎలాంటి వాణిజ్య ప్రసారాలకు ఉపయోగించకూడదు.
- జాతీయ జెండాను ఎక్కడ ఎగురవేసినా దానికి గౌరవమైన స్థానంలో ఉంచి, పటిష్టంగా ఉంచాలి.
- జెండాను ఏ వ్యక్తికి లేదా వస్తువుకు గానీ సెల్యూట్ కోసం ఉపయోగించకూడదు.
- ప్రభుత్వం జారీ చేసిన సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ భవనాలపై జెండాను సగం ఎత్తులో ఎగురవేసే సందర్భాల్లో తప్పించి, జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేయకూడదు.
- జాతీయ పతాకాన్ని ఏ రూపంలో కూడా వస్త్రాలుగా ఉపయోగించరాదు. ప్రైవేటు వ్యక్తుల దహన సంస్కారాల్లో కూడా వినియోగించరాదు.
- జాతీయ పతాకంపై ఎలాంటి రాతలు రాయకూడదు.
- జాతీయ పతాకాన్ని గ్రహీతలుగా స్వీకరించరాదు. దాతగా ఇవ్వరాదు.
- జాతీయ జెండాను ఇతర జెండాలతో కలిపి ఎగురవేయరాదు. ప్రత్యేకంగా ఎగురవేయాలి.
- పాడైన లేదా చిరిగిన జాతీయ పతాకాన్ని ఎగురవేయరాదు.
- జాతీయ పతాకం కంటే ఎత్తులో ఇతర పతాకాలు ఉంచరాదు.
- జాతీయ పతాకాన్ని అలంకరణలకు ఉపయోగించరాదు.
- ఎక్కడైతే బహిరంగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారో వారు వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రదర్శించాలి.
- ఇతర దేశాల పతాకాలను వరుస క్రమంలో ప్రదర్శించినప్పుడు మన జాతీయ పతాకాన్ని వాటితోపాటు ప్రదర్శించినప్పుడు మిక్కిలి కుడి భాగంలో ప్రదర్శించాలి. ఆంగ్ల అక్షర వరుస క్రమంలో ఇతర దేశాల జాతీయ పతాకాలను దేశాల పేర్ల అనుసారం కూర్చాలి.
- భారత జాతీయ పతాకం, ఐక్యరాజ్యసమితి పతాకంతోపాటు ఎగురవేసినప్పుడు జాతీయ పతాకాన్ని ఇరువైపుల కూర్చాలి.
- జాతీయ పతాకాన్ని సరిహద్దు ప్రాంతాల్లో సరిహద్దు కస్టమ్స్ కేంద్రం, పరిశీలన కేంద్రం, బయటకు విడిచే కేంద్రం
- ముందు ఎగురవేస్తారు.
- స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి, జాతీయ వారం( జలియన్ వాలా బాగ్ త్యాగ జ్ఞాపకార్థం ఏప్రిల్ 6 నుంచి 13 వరకు) ఇతర ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రాలు గుర్తించిన రోజుల్లోనూ, రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లోనూ జాతీయ పతాకాన్ని వసతి భవనాలపై ఎగురవేస్తారు.
- ఉన్నతాధికారులు మరణించినప్పుడు సంతాప సూచకంగా పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేస్తారు.
- గుర్తించిన జాతీయ పర్వదినాల్లో ఉన్నతాధికారులు మరణించినప్పుడు జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేయరాదు. కానీ, పార్థివదేహం ఉన్న భవనంపై మాత్రం పార్థివదేహాన్ని తొలగించే వరకు సగం ఎత్తులో ఎగురవేయాలి.
- పరేడ్ ల్లోనూ, ఊరేగింపులోనూ సంతాపసూచకంగా అక్కడ జాతీయ పతాకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు రెండు పాయలుగా ఉన్న మడచల ఉపరితలం ఉన్న పల్చని నల్లని గుడ్డని పతాక అంచున బిగించి సహజంగా వేలాడుతుండే విధంగా వదిలేయాలి.
- జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేయ దలచినప్పుడు ముందుగా పతాకాన్ని పై అంచున ఎగురవేసి తర్వాత సగం ఎత్తు స్థాయికి దింపాలి. ఆ రోజుకు జెండాను కిందకు దించాల్సి వచ్చినప్పుడు దానిని ముందు ఉచ్ఛస్థాయికి (పై చివరికి) ఎక్కించిన తర్వాత మాత్రమే కిందికి దించాలి.
తొలిసారి విజయవాడలో ప్రదర్శన
మన జాతీయ పతాకం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణ పతాకం. తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాక నమూనాను ప్రదర్శించారు. త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ 1947, జులై 22న జాతీయ పతాకంగా ఆమోదించింది. మన జాతీయ జెండాను అధికారికంగా 1947, ఆగస్టు 14న అర్ధరాత్రి ప్రదర్శించారు. దీనిని తొలిసారిగా పార్లమెంట్ భవనంపై ఎగురవేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగురవేస్తున్నారు.
జాతీయ పతాకాన్ని భారతీయ పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగురవేయడానికి వీలుగా 2002, జనవరి 26 నుంచి ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002 అమలులోకి వచ్చింది. జాతీయ పతాకం మధ్యలో తెలుపు రంగుపై మొదట మహాత్మాగాంధీ సూచించిన చరఖా ఉండేది. ఆ తర్వాత చరఖా స్థానంలో ముదురు నీలి రంగు(నేవీ బ్లూ)లోని అశోకుడి ధర్మచక్రం ఎంచుకున్నారు. అశోక చక్రం అభివృద్ధికి సంకేతం. దీనిని సారనాథ్‌లోని అశోక స్తంభం నుంచి గ్రహించారు. అశోకుడి ధర్మచక్రంలో 24 ఆకులు ఉంటాయి. ఇందులో గల 24 ఆకులు 24 గంటలకు, ధర్మానికి, న్యాయానికి, క్రమశిక్షణకు సంకేతం.