అమెరికాలో భారత సంతతి ఫ్యామిలీ మృతి

అమెరికాలో భారత సంతతి ఫ్యామిలీ మృతి
  •     విలాసవంతమైన భవంతిలో దంపతులు, కూతురి మృతదేహాలు
  •     భర్త డెడ్‌‌బాడీ వద్ద గన్.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఓ సంపన్న కుటుంబం అమెరికాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మసాచుసెట్స్‌‌ రాష్ట్రంలోని డోవర్ మాన్షన్‌‌లో రాకేశ్‌‌ కమల్‌‌ (57), ఆయన భార్య టీనా (54), కుమార్తె అరియానా (18) మృతదేహాలను గురువారం (అమెరికా టైం ప్రకారం) రాత్రి 7.30 సమయంలో గుర్తించినట్లు నార్‌‌‌‌ఫోక్‌‌ డిస్ట్రిక్ట్ అటార్నీ మైఖేల్ మొరిస్సే వెల్లడించారు. ఒకటీరెండు రోజులుగా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఓ బంధువు అక్కడికి వెళ్లారని, దీంతో ఈ ఘటన బయటపడిందని చెప్పారు.

 డొమెస్టిక్ వయొలెన్స్ పరిస్థితి కనిపిస్తున్నదని, కమల్ డెడ్‌‌బాడీ దగ్గర తుపాకీని గుర్తించామని తెలిపారు. తుపాకీతో ఈ ముగ్గురిపై ఎవరు కాల్పులు జరిపారనే దానిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. మెడికల్ ఎగ్జామినర్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని, ఆ తర్వాతే ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అనేది నిర్ధారిస్తామని చెప్పారు. వీరిపై గతంలో ఎలాంటి ఫిర్యాదులు లేదా పోలీస్ కేసులు కానీ, గృహ హింస కేసులు కానీ నమోదు కాలేదని అన్నారు. ముగ్గురి మృతి వెనుక బయటి వ్యక్తుల హస్తం లేదని ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా తేలిందని చెప్పారు.

ఆర్థిక సమస్యలే కారణమా?

టీనా, కమల్ కలిసి గతంలో ‘ఎడునోవా’ పేరు తో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కంపెనీని నడిపారు. ఎడునోవాను 2016లో స్టార్ట్ చేయగా.. 2021 లో దాని కార్యకలాపాలు ఆగిపోయాయి. వారి ఆన్‌‌లైన్ రికార్డులను బట్టి చూస్తే.. కొన్నేండ్లు గా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న ట్లు తెలుస్తున్నది. తాము నివసించేందుకు 2019లో ఓ పెద్ద, విలాసవంతమైన భవంతిని కమల్ దంపతులు కొనుగోలు చేశారు. 

19 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మాన్షన్‌‌లో 11 బెడ్రూమ్స్ ఉన్నాయని, దాన్ని అప్పట్లో 4 మిలియన్ డాలర్లకు తీసుకొన్నారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఇప్పుడు ఆ భవంతి విలువ 5.45 మిలియన్ డాలర్లు కాగా.. ఇటీవల 3 మిలియన్ డాలర్లకే అమ్మేశారని చెప్పాయి. ఎడునోవా వెబ్‌‌సైట్‌‌లో పేర్కొన్న వివరాల ప్రకారం రాకేశ్‌‌.. బోస్టన్‌‌ వర్సిటీ, ఎంఐటీ స్టోవన్ స్కూల్‌‌ ఆఫ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌, స్టాన్‌‌ఫోర్డ్‌‌ వర్సిటీ నుంచి పట్టా లు పొందారు. ఇక టీనా.. హార్వర్డ్‌‌ వర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు.