- టారిఫ్లను కోర్టు ద్వారా అడ్డుకున్న భారత సంతతి అడ్వకేట్
- ‘ఆర్థిక అధికారాలను’ ట్రంప్ దుర్వినియోగం చేశారని వాదన
- పన్నులు వేసే అధికారం పార్లమెంటుకే ఉంటుందన్న కత్యాల్
- అతడి వాదనతో ఏకీభవించిన కోర్టు.. ప్రపంచవ్యాప్తంగా నీల్‌పై చర్చ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన దిగుమతి సుంకాలపై సుప్రీంకోర్టులో చరిత్రాత్మక విజయం సాధించి భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ట్రంప్ తన 'ఎమర్జెన్సీ ఆర్థిక అధికారాలను' దుర్వినియోగం చేస్తూ విధించిన టారిఫ్ లు రాజ్యాంగ విరుద్ధమని వాదించి, కోర్టు ద్వారా వాటిని కొట్టివేయించడంలో కత్యాల్ కీలక పాత్ర పోషించారు.
"ఈ రోజు అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన పాలనను, అమెరికా ప్రజలను రక్షించింది. అధ్యక్షులు శక్తివంతులే కావచ్చు, కానీ మన రాజ్యాంగం అంతకంటే శక్తివంతమైనది. అమెరికాలో పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు (పార్లమెంటు) మాత్రమే ఉంటుంది" అని తీర్పు అనంతరం ఆయన గర్వంగా ప్రకటించారు.
"ఒక వలసదారుడి కుమారుడు కోర్టుకు వెళ్లి, అమెరికా చిరు వ్యాపారుల తరపున నిలబడి, సాక్షాత్తూ దేశ అధ్యక్షుడే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వాదించి గెలవడం ఈ దేశంలోని గొప్పతనం. ఇది వ్యక్తుల గురించి కాదు, అధికార విభజన, రాజ్యాంగ విలువల రక్షణ గురించి జరిగిన పోరాటం" అని పేర్కొన్నారు. భారత దేశం నుండి అమెరికాకు వలస వెళ్లిన డాక్టర్, ఇంజనీర్ దంపతులకు 1970లో షికాగోలో నీల్ కత్యాల్(55) జన్మించారు.
డార్ట్‌మౌత్ కాలేజీ, యేల్ లా స్కూల్ నుండి లా డిగ్రీ పొందారు. బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో అమెరికా 'యాక్టింగ్ సొలిసిటర్ జనరల్'గా పనిచేశారు. సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులను వాదించి, అత్యధిక కేసులు వాదించిన మైనారిటీ లాయర్‌గా రికార్డు సృష్టించారు. గతంలో ట్రంప్ విధించిన ముస్లిం దేశాలపై ప్రయాణ నిషేధాన్ని సవాలు చేయడం, జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించడం వంటివి ఈయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.
