రైల్వేలో 2014 నుంచి 5. 56 లక్షల నియామకాలు..లోక్‌‌‌‌సభకు వెల్లడించిన రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్

రైల్వేలో 2014 నుంచి 5. 56 లక్షల నియామకాలు..లోక్‌‌‌‌సభకు వెల్లడించిన రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే రిక్రూట్‌‌‌‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తూ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మిషన్ మోడ్ కింద చేపట్టిన ఈ నియామకాలకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌‌‌‌సభకు ఈ వివరాలను వెల్లడించారు. 2014 నుంచి 2026 జూన్ వరకు దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 5,56,000 మందికి పైగా అభ్యర్థులను రైల్వే శాఖ రిక్రూట్ చేసుకుందని చెప్పారు. ఇందులో ఒక్క సదరన్ రైల్వే పరిధిలోనే 50,485 నియామకాలు ఉన్నాయని పేర్కొన్నారు.

 గతంలో 2004-–05 నుంచి 2013-–14 మధ్య కాలంలో కేవలం 4.11 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ కాగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2024, 2025 రిక్రూట్‌‌‌‌మెంట్ సైకిల్‌‌‌‌లో భాగంగా నిర్వహించిన కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ పరీక్షలకు సుమారు 4.5 కోట్ల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. దేశవ్యాప్తంగా అభ్యర్థుల సౌలభ్యం కోసం 150కిపైగా సిటీల్లో, 15 ప్రాంతీయ భాషల్లో ఈ ప్రవేశ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్టు మంత్రి స్పష్టం చేశారు. 

2026–27లో రెండే రైలు ప్రమాదాలు

సాంకేతికత, మౌలిక సదుపాయాల పెరుగుదల, పటిష్టమైన నిర్వహణ కారణంగా భారతీయ రైల్వేల్లో భద్రత ఎంతో మెరుగైందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం లోక్‌‌‌‌సభకు తెలిపారు. 2026-–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం రెండే రైలు ప్రమాదాలు నమోదవడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రైల్వే వ్యవస్థలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నందువల్లే ప్రమాదాల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైందని మంత్రి స్పష్టం చేశారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కవచ్ 4.0’ భద్రతా వ్యవస్థను అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ–-ముంబై, ఢిల్లీ–-హౌరా మార్గాలతో పాటు మొత్తం 2,490 కిలోమీటర్ల మేర విజయవంతంగా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మరో 21,937 కిలోమీటర్లలో కవచ్ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతుండగా, దీనిని 7,435 లోకోమోటివ్‌‌‌‌లు, 1,200 ఇఎంయూ/ఎంఇఎంయూ రైళ్లలో అమర్చుతున్నామని పేర్కొన్నారు. లోకో పైలట్ నిర్ణీత వేగ పరిమితిని దాటితే ఈ వ్యవస్థ వెంటనే బ్రేకులను వేసి రైలును నియంత్రిస్తుందని పేర్కొన్నారు.