
అంటాల్యా : ఇండియా రికర్వ్ ఆర్చర్లు భజన్ కౌర్, అంకిత భకట్ పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడం ద్వారా వ్యక్తిగత కోటాలో పారిస్ బెర్తు దక్కించుకున్నారు. ఈ టోర్నీలో భజన్ గోల్డ్ మెడల్ కూడా గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భజన్ 6–2తో ఇరాన్‌కు చెందిన మోబినాను ఓడించి విజేతగా నిలిచింది.
తొమ్మిదో సీడ్ అంకిత ప్రిక్వార్టర్స్‌లో6–0తో ఫిలిప్పీన్స్ ఆర్చర్ గాబ్రియెల్లె మోనికాకు చిత్తు చేసి క్వార్టర్స్ చేరి పారిస్ బెర్తు దక్కించుకుంది. అయితే క్వార్టర్ ఫైనల్లో మోబినా 6–4తో అంకితను ఓడించింది. కాగా, స్టార్ ఆర్చర్ దీపిక కుమారి తొలి రౌండ్‌లోనే ఓడి నిరాశ పరిచింది. మాజీ వరల్డ్ నం. 1 దీపిక 4–-6తో అజర్‌బైజాన్‌కు చెందిన అనామక ఆర్చర్ రమజనోవా చేతిలో పరాజయం పాలైంది.