అక్టోబర్‌‌ 4న రెడ్‌‌క్రాస్‌‌ హైదరాబాద్‌‌ జిల్లా శాఖ ఎన్నికలు

అక్టోబర్‌‌ 4న రెడ్‌‌క్రాస్‌‌ హైదరాబాద్‌‌ జిల్లా శాఖ ఎన్నికలు
  • 15 స్థానాలకు బ్యాలెట్‌‌ విధానంలో పోలింగ్‌‌
  •     సెప్టెంబర్‌‌ 24న నామినేషన్ల స్వీకరణ

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు: ఇండియన్‌‌ రెడ్‌‌క్రాస్‌‌ సొసైటీ హైదరాబాద్‌‌ జిల్లా శాఖకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా సహకార అధికారి, ఎన్నికల అధికారి కె.అనిత తెలిపారు. జిల్లా మేనేజింగ్‌‌ కమిటీలోని 15 స్థానాలకు అక్టోబర్‌‌ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బ్యాలెట్‌‌ విధానంలో పోలింగ్‌‌ నిర్వహించనున్నారు. మాసబ్‌‌ట్యాంక్‌‌లోని అంబేద్కర్‌‌నగర్‌‌ ప్రభుత్వ గర్ల్స్‌‌ హైస్కూల్‌‌లో పోలింగ్‌‌ జరగనుంది. నామినేషన్లను సెప్టెంబర్‌‌ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వీకరిస్తారు. నామినేషన్‌‌ రుసుము రూ.10 వేలు కాగా, ప్రతి నామినేషన్‌‌ను ఇద్దరు సభ్యులు ప్రతిపాదించాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌‌ 25న నామినేషన్లను పరిశీలించి, మధ్యాహ్నం 1.30 గంటలకు చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు.

సెప్టెంబర్‌‌ 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. అక్టోబర్‌‌ 4న పోలింగ్‌‌ ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత జిల్లా శాఖ అధికారులు, స్టేట్‌‌ మేనేజింగ్‌‌ కమిటీ సభ్యుల ఎన్నికతో పాటు చైర్మన్‌‌, వైస్‌‌ చైర్మన్‌‌, ట్రెజరర్‌‌లు ప్రమాణ స్వీకారం చేస్తారు.  ఎన్నికలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఎన్నికల అధికారి 9100115759 నంబర్​ను సంప్రదించాలని అనిత సూచించారు.