అమెరికాకు ఇండియా స్టార్టప్​ల క్యూ

అమెరికాకు ఇండియా స్టార్టప్​ల క్యూ

ఇండియా స్టార్టప్​లు అమెరికా బాట పట్టాయి. అక్కడి మార్కెట్లో అవకాశాలను దక్కించుకోవడానికి కష్టపడుతున్నాయి. గత మూడునాలుగేళ్లలో దాదాపు 400 ఇండియా స్టార్టప్​లు అమెరికా వచ్చాయని సిలికాన్​వ్యాలీకి చెందిన ఎంట్రప్రెన్యూర్​ ఎంఆర్​రంగస్వామి చెప్పారు. ఇవన్నీ ఇండియాలో విజయవంతంగా బిజినెస్​లను నడిపించాయని చెప్పారు. ఇండియా స్టార్టప్​లు అమెరికా రావడం ఇది వరకు ఎక్కువగా ఉండేది కాదని, గత మూడేళ్లుగా ఈ ట్రెండ్​ బలపడిందని తెలిపారు. అమెరికా అతిపెద్ద ఐటీ మార్కెట్​ కాబట్టి ‘సాస్​’ (సాఫ్ట్​వేర్​ యాజ్​ సర్వీస్​) స్టార్టప్​లు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయని అన్నారు. వీటికి అమెరికాలో భారీగా క్లయింట్లు ఉన్నారని వెల్లడించారు. వందలాది మంది సీఈఓలు అమెరికాలో స్థిరపడ్డారని అన్నారు. ‘‘ఇలాంటి స్టార్టప్​లకు సాయం చేయడానికి మేం ఇండియాస్పోరా పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాం. అవసరమైనవాటికి మెంటార్​షిప్​సేవలను అందిస్తాం. ఫండింగ్​కూడా ఇవ్వగలమేమో చూస్తాం. మా సభ్యుల్లో చాలా మంది వెంచర్​ క్యాపిటలిస్టులు ఉన్నారు. ఎన్నో కంపెనీల్లో ఇన్వెస్ట్​ చేశారు.  ఇండియా సాఫ్ట్​వేర్​ మార్కెట్​ విలువ 20 బిలియన్​ డాలర్లను దాటడం లేదు. అమెరికా మార్కెట్​ విలువ ట్రిలియన్​ డాలర్లలో ఉంటుంది. అందుకే ఇండియా స్టార్టప్​లు ఇక్కడికి వస్తున్నాయి. వాటికి అమెరికాలో చాలా వ్యాపార అవకాశాలు దక్కుతున్నాయి. ఇండియా మార్కెట్​ కూడా అమెరికా మాదిరే ఎదగాలి. క్లౌడ్​కంప్యూటింగ్ ఇండియాలో ఎంతో పాపులర్​ అయింది. చాలా పెద్ద కంపెనీలు ‘సాస్​’ స్టార్టప్​ల నుంచి సాఫ్ట్​వేర్లను కొంటున్నాయి. ప్రస్తుతం ఇండియా స్టార్టప్​ల బిజినెస్​ పెరుగుతోంది కానీ ఇది మరింత అధికం కావాలి”అని ఆయన వివరించారు. 

ఇండియాలో భారీగా ఇన్వెస్ట్​ ..

భారతదేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎలా ఉందని అడిగినప్పుడు, గత మూడు-నాలుగేళ్లలో యూఎస్​ తోపాటు  ఇతర దేశాలలో నివసిస్తున్న చాలా మంది భారతీయులు, అలాగే భారతీయ వెంచర్ క్యాపిటలిస్టులు భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టారని స్వామి చెప్పారు. "రిలయన్స్.. ఫేస్​బుక్​తోపాటు ఇతర విదేశీ కంపెనీల నుంచి ఇన్వెస్ట్​మెంట్లు దక్కించుకుంది. ఇతర పెద్ద కంపెనీలు కూడా ఇండియా బాట పడుతున్నాయి. భారతదేశంలోని టెక్ స్టార్టప్‌‌లలో,  టెక్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. అందుకే భారతదేశంలో వంద యునికార్న్‌‌లు ఏర్పడ్డాయి. అయితే వీటిపై ఇప్పుడు మాంద్యం ప్రభావం కనిపిస్తోంది.  యునికార్న్‌‌లకు చాలా ఎక్కువ వాల్యుయేషన్​తో నిధులు సమకూరాయి. భారతదేశ మార్కెట్ ప్రస్తుతం మారుతోంది. కరెక్షన్​ కనిపిస్తోంది. ఈ యునికార్న్‌‌లలో కొన్ని అదృశ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని విలీనం అవుతాయి. ఇంకొన్ని తదుపరి స్థాయికి వెళ్లవచ్చు. కొందరు దుకాణం సర్దేయవచ్చు. ఐపీఓకు వెళ్లాలని కొన్ని స్టార్టప్​లు కోరుకుంటున్నాయి. ఈ పరిస్థితులను అమెరికా ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు. వేచిచూసే ధోరణితో ఉన్నారు. అందుకే గత 18 నెలల నుంచి ఇండియా స్టార్టప్​లకు నిధుల రాక తగ్గింది. ఇండియాలో స్టార్టప్​ ఎకోసిస్టమ్​లో సానుకూల మార్పులు వస్తున్నాయి. అయితే కొన్ని పాతరూల్స్​ను తొలగించాలి. ఏంజిల్​ ట్యాక్స్​విధింపులో సమస్యలు ఉన్నాయి. ఇండియా స్టార్టప్​లు అమెరికాకు రావాలంటే చాలా రూల్స్​ ఉన్నాయి. ఇట్లాంటి ఇబ్బందులను పరిష్కరించాలి ”అని రంగస్వామి అన్నారు.