
Stock Market: భారత్-పాక్ మధ్య పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్న వేళ ఈక్విటీ మార్కెట్లు నిన్న లాభపడిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీలు భారీగా పతనాన్ని చూశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 1000 పాయింట్లు క్షీణించింది. ప్రధానంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటమే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.
మంగళవారం ఉదయం 10.55 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 755 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 199 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిప్టీ బ్యాంక్ సూచీ 288 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. అయితే ఇదే క్రమంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం లాభాలతో దూసుకుపోతున్నాయి. నేడు స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి లాగిన రెండు ప్రధాన రంగాలు ఎఫ్ఎంసీజీ, ఐటీగా ఉన్నాయి. ఇదే క్రమంలో ఆటో స్టాక్స్ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం కావటంతో ఆరంభంలో నష్టాలతో పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ.64వేల కోట్లు ఆవిరైపోయింది. అయితే ప్రస్తుతం మార్కెట్లు కొంత నష్టాల నుంచి రికవరీ బాటలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ఆసియా మార్కెట్లతో పాటు సౌత్ కొరియా, జపాన్, చైనా మార్కెట్లు లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో అమెరికా ప్రస్తుతం ఇతర దేశాలతో ఒకదాని తర్వాత మరొకటి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్న వేళ యూఎస్ స్టాక్ మార్కె్ట్లు కూడా తిరిగి పుంజుకుంటున్నాయి. దీంతో సోమవారం నాస్డాక్, డౌజోన్స్ భారీ ర్యాలీని నమోదు చేశాయి.