భారీ నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు.. ఎందుకంటే..?

భారీ నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు.. ఎందుకంటే..?

సోమవారం భారీ పతనంతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఇంట్రాడేలో లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు అమాంతం పెరిగిపోవటంతో మార్కెట్లను చమురు ధరల మంటలు ఆవహించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ తర్వాత క్రూడ్ ధరలు 6 శాతం మేర పతనం అయ్యాయి. త్వరలోనే యుద్ధం ముగింపునకు వస్తుందంటూ ట్రంప్ ఇచ్చిన హింట్ మార్కెట్లకు ధైర్యాన్ని నింపింది.

ఉదయం 10.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 437 పాయింట్ల లాభంలో ఉండగా, నిఫ్టీ సూచీ 130 పాయింట్లు ఎగబాకింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 696 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 533 పాయింట్ల పెరుగుదలను నమోదు చేశాయి. నేడు ఇంట్రాడేలో ఆటో, ఫార్మా రంగాల షేర్లు ప్రధానంగా లాభాలతో దూసుకుపోతుండగా.. ఐటీ స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడితో చిత్తయ్యాయి.

ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
ప్రపంచం మెుత్తం క్రూడ్ ఆయిల్, గ్యాస్ షార్టేజీతో అంధకారంలోకి వెళ్లిపోతోంది. ఈ క్రమంలో ఇరాన్ హర్ముజ్ జలసంధి వద్ద ఆయిల్ సరఫరాకు ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తే ఇప్పుడు చేసిన దాడుల కంటే 20 రెట్లు శక్తివంతమైన దాడులు జరుపుతామని ఇరాన్ దేశాన్ని హెచ్చరించారు ట్రంప్. అయితే మరోపక్క హర్ముజ్ జలసంధి తర్వాత ఎర్రసముద్రం గల్ఫ్ ఆఫ్ అడాన్‌ని కలిపే బాబ్ ఎల్ మన్డెబ్ వద్ద కూడా ఇలాంటి అడ్డంకులే క్రూడ్ సరఫరాకు ఎదురవుతాయా అనే భయాలు పెరుగుతున్నాయి. 

ఇక ప్రపంచ మార్కెట్లలో కూడా ఆందోళనలు తగ్గి సౌత్ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి రావటంతో ఆ సానుకూల పవనాలు దేశీయ ఇన్వెస్టర్లను కూడా ముందుకు నడిపిస్తున్నాయి. అలాగే గతరాత్రి అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో క్లోజ్ కావటం దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను మెరుగుపరిచింది.