అమెరికానా.. వద్దులే: వివక్ష, వీసా సమస్యలే కారణం

అమెరికానా.. వద్దులే: వివక్ష, వీసా సమస్యలే కారణం

అగ్రరాజ్యంలో ఎంబీఏ కోసం ఎక్కువమంది పోవట్లే

ఉద్యోగం, రాజకీయాలు, వివక్ష, వీసా సమస్యలే కారణం

జీమ్యాట్​ అభ్యర్థుల దరఖాస్తులు 45 శాతానికి తగ్గుదల

మన కాలేజీలవైపే మొగ్గు.. 19% పెరిగిన అప్లికేషన్లు

కెనడా, బ్రిటన్​లకూ అప్లికేషన్లు పంపుతున్న స్టూడెంట్లు

 

అమెరికానా.. ఆ, ఏం పోతంలె, ఇక్కడే కానిచ్చేస్తే అయిపోతది’.. ఇదీ జీమ్యాట్​ రాసినోళ్ల అనుకుంటున్న మాట. అనుకుంటున్నది కాదు, ఈ ఏడాది అమెరికా బీ స్కూల్స్​ (బిజినెస్​ మేనేజ్​మెంట్​ కాలేజీలు)కు దరఖాస్తు చేసుకున్న జీమ్యాట్​ అభ్యర్థుల సంఖ్య చూస్తే నిజమే అనిపిస్తది. మారుతున్న గ్లోబల్​ ట్రెండ్స్​కు తగ్గట్టు స్టూడెంట్లు అమెరికా వెళ్లేందుకు వెనకాడుతున్నారు. 2015లో 57 శాతం మంది జీమ్యాట్​ అభ్యర్థులు అమెరికా బీ స్కూళ్లకు అప్లై చేసుకుంటే, ఈ ఏడాది అది 45 శాతానికి పడిపోయింది. గ్రాడ్యుయేట్​ మేనేజ్​మెంట్​ అడ్మిషన్​ కౌన్సిల్​ (జీమ్యాక్​) చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 336 బీ స్కూళ్లలో 1,145 ఎంబీఏ ప్రోగ్రామ్​(కోర్సు)లపై ఈ ఏడాది జూన్​ నుంచి ఆగస్టు వరకు జీమ్యాక్​ సర్వే చేసి లెక్కలు తీసింది.

అమెరికాలో కోర్సులకు తగ్గిన ఆదరణ

ఒకప్పుడు బిజినెస్​ మేనేజ్​మెంట్​ చదివేందుకు స్టూడెంట్లు అమెరికాకు క్యూ కట్టేవాళ్లు. కానీ, ఇప్పుడు ట్రెండ్స్​ చూస్తే ఆ పరిస్థితి కనిపించట్లేదు. అమెరికాని 48 శాతం మేనేజ్​మెంట్​ ప్రోగ్రామ్​లలో స్టూడెంట్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. 23 శాతం ప్రోగ్రామ్​లకైతే అది మరింత ఎక్కువగా ఉంది. ఇండియానే కాదు, రెండేండ్ల ముందు వరకూ అమెరికాకు వెళ్లే వేరే దేశాల స్టూడెంట్ల సంఖ్య ఎక్కువగానే ఉండేది. కానీ, 2018, 2019లో మాత్రం అది 13.7 శాతం తగ్గిపోయింది. అమెరికా వెళ్లినా ఇప్పుడు ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదని, అందుకే అమెరికా వెళ్లడం కన్నా ఇండియాలోనే చదువుకోవడమో లేదంటే వేరే దేశపు బీ స్కూళ్లకు అప్లై చేయడమో మంచిదని జీమ్యాట్​లో అర్హత సాధించిన సగం మంది స్టూడెంట్లు చెబుతున్నారు. స్టూడెంట్​ వీసా సమస్యలే తాము అమెరికా వెళ్లడానికి ప్రధాన అడ్డంకి అని 48 శాతం మంది, అక్కడి రాజకీయ పరిస్థితులు
అడ్డుకుంటున్నాయని 47 శాతం మంది, భద్రత భయాలతో 37 శాతం, వివక్ష కారణాలతో 34 శాతం మంది.. అమెరికా చదువులపై నిరాసక్తత చూపిస్తున్నారు.

మంచి కాలేజీలకూ వెళ్లట్లే​

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్​ మేనేజ్​మెంట్​పై తగ్గిపోతున్న ఆసక్తి కూడా అమెరికాకు వెళ్లే స్టూడెంట్ల సంఖ్యపై ప్రభావం చూపిస్తున్నాయి. మంచి లైఫ్​ ఉన్న ఎంబీఏ కోర్సులైనా, పేరున్న, మంచి ర్యాంకున్న కాలేజీలు, యూనివర్సిటీలపైనా స్టూడెంట్లు ఆసక్తి చూపించట్లేదు. టాప్​ 50 కోర్సుల్లోని 47 శాతం కోర్సులకు ఈ ఏడాది దరఖాస్తులు 21 శాతం తగ్గిపోవడమే అందుకు నిదర్శనం. గత ఏడాదితో పోలిస్తే తగ్గుదల చాలా ఎక్కువ. జీమ్యాట్​లో 700 అంతకన్నా ఎక్కువ స్కోరు వచ్చిన స్టూడెంట్లలో అమెరికా యూనివర్సిటీలకు 2017లో అప్లై చేసుకున్నది 69 శాతం మంది. కానీ, ఈ ఏడాది అది 62 శాతానికి పడిపోయింది.

మన దగ్గర పెరుగుతున్నయ్​

అమెరికా వెళ్లని చాలా మంది స్టూడెంట్లు మన దేశంలోని మంచి కాలేజీల వైపు చూస్తున్నారు. ఆయా కాలేజీల్లోని టాప్​ 28 కోర్సులకు దరఖాస్తులు బాగా పెరిగాయి. 11 శాతం కోర్సులకు స్థిరంగా కొనసాగుతున్నాయి. కాలేజీలకు వచ్చే స్టూడెంట్ల సంఖ్య ఏటా పెరుగుతున్నా, ఆ వృద్ధి రేటు మాత్రం తగ్గుతోంది. ఇటు చైనా స్టూడెంట్లూ తమ సొంత దేశానికే ముందు ఓటేస్తున్నారు. ఇక, అమెరికాకు దరఖాస్తులు తగ్గినా, దాని పొరుగు దేశం కెనడా, బ్రిటన్​లకు మాత్రం స్టూడెంట్లు ఎక్కువగా వెళుతున్నారు.
ప్రత్యేకించి ఎక్కువ మంది స్టూడెంట్లు బ్రిటన్​వైపు మొగ్గు చూపుతున్నారు.

– సంగీత్​ చౌఫ్లా, సీఈవో, జీమ్యాక్​