కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీ పార్టీలో ఆయన చేరారు. మంగళవారం (మార్చి 31) ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్‌ల సమక్షంలో ఈ టెన్నిస్ దిగ్గజం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పేస్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీజేపీలో చేరిన అనంతరం లియాండర్ పేస్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. దేశానికి, యువతకు సేవ చేసే అవకాశం తనకు లభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఖేలో ఇండియా ఒక అద్భుతమైన కార్యక్రమమని కితాబిచ్చారు. ఖేలో ఇండియా, యువతరం పట్ల ప్రధాని మోడీ చూపిన అదే అంకితభావం, ఏకాగ్రతతో యువతపై దృష్టి పెట్టాలన్నది నా ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
లియాండర్ పేస్ బ్యాక్ గ్రౌండ్:
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ 1973, జూన్ 17న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జన్మించారు. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన డబుల్స్ ఆటగాళ్లలో ఈయనొకరు. పేస్ తన కెరీర్‌లో మొత్తం 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఇందులో 8 డబుల్స్, 10 మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ ఉన్నాయి.
1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పేస్ కాంస్య పతకం సాధించి టెన్నిస్‌లో ఒలింపిక్ పతకం గెలిచిన తొలి ఆసియా ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత భారత్‌కు వ్యక్తిగత ఒలింపిక్ పతకాన్ని అందించిన తొలి క్రీడాకారుడిగా కూడా రికార్డ్ నెలకొల్పారు. డేవిస్ కప్‌లో అత్యధిక డబుల్స్ విజయాలు (45) సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించడంతో పాటు వరుసగా 7 ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఏకైక భారతీయ క్రీడాకారుడు ఈయనే.
టెన్నిస్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఫ్రెంచ్, యూఎస్, ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ టోర్నీల్లో పేస్ టైటిల్స్ సాధించాడు. టెన్నిస్‌లో ఆయన సాధించిన అద్భుతమైన విజయాలకు గానూ పేస్‌ను 2024లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు. ఆయన ప్రస్తుతం బెంగాల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
