మాల్దీవుల నుంచి మన బలగాలు వెనక్కి

మాల్దీవుల నుంచి మన బలగాలు వెనక్కి
  •     ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం
  •     ఈ నెల10 లోపే 25 ట్రూప్స్ వాపస్​ పోయాయని లోకల్​ మీడియా వెల్లడి

మాలె/బీజింగ్ :  మాల్దీవుల నుంచి భారత మిలిటరీ బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఈ ద్వీపదేశంలో స్థానికులకు హెలికాప్టర్ల ద్వారా మానవతా సాయం అందించడానికి సర్వైలెన్స్  ఎయిర్ క్రాఫ్ట్  నిర్వహిస్తున్న మిలిటరీ సిబ్బందిని భారత్  తిరిగి స్వదేశానికి పంపుతోంది. మాలె దక్షిణం వైపు ఉన్న అడ్డూ పగడపుదీవి నుంచి 25 ఇండియన్  ట్రూప్స్ ను ఈనెల 10 కన్నా ముందే వెనక్కి పంపారని మాల్దీవుల మీడియా వెల్లడించింది. ఇండియన్  బలగాల ఉపసంహరణ కోసం గత నెలలో భారత, మాల్దీవుల ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. తమ దేశం నుంచి వెళ్లిపోవాలని భారత బలగాలను అంతకుముందే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్  మొయిజ్జు ఆదేశించారు. నిరుడు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పార్లమెంటులో మొయిజ్జు మాట్లాడుతూ తన ప్రథమ కర్తవ్యం దేశం నుంచి భారత బలగాలను వెనక్కి పంపడమే అని స్పష్టం చేశారు. మే 10 తర్వాత సివిల్  డ్రస్సుల్లో కూడా భారతీయ బలగాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మాల్దీవుల్లో ఉన్న మొత్తం భారతీయ భద్రతా సిబ్బందిని మే 10 లోపు దశలవారీగా ఉపసంహరించుకుంటామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మాల్దీవుల సార్వభౌమత్వాన్ని కాపాడుతం :  చైనా

మాల్దీవుల సార్వభౌమత్వాన్ని కాపాడుతామని, అందుకే ఆ ద్వీపదేశానికి అండగా ఉన్నామని చైనా పేర్కొంది. మాల్దీవుల నుంచి భారతీయ బలగాలు వెనక్కి వెళ్లిన తర్వాత చైనా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, తమ దేశాన్ని భారత బలగాలు వీడి వెళ్లనున్న నేపథ్యంలో సైనిక సాయం కోసం చైనాతో మాల్దీవుల ప్రభుత్వం గత వారం ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికే ఈ డీల్  చేసుకున్నామని మాల్దీవుల రక్షణ శాఖ పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా తన స్టాఫ్​కు చైనా శిక్షణ ఇస్తుందని, అంతేకాకుండా ప్రాణాంతకం కాని ఆయుధాలను ఉచితంగా తమకు సరఫరా చేస్తుందని తెలిపింది. మరోవైపు చైనాకు చెందిన రిసెర్చ్​ షిప్.. మాలేలో ప్రవేశించేందుకు మొయిజ్జు ప్రభుత్వం అనుమతించింది. ఈ ఏడాది జనవరిలో మొయిజ్జు చైనాలో పర్యటించారు. తమ దేశానికి మౌలికసదుపాయాల విషయంలో సాయం చేసేందుకు చైనాతో ఆయన మొత్తం 20 ఒప్పందాలు కుదుర్చుకున్నారు.