కార్డిఫ్: టీ20 వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌లను ఇండియా విమెన్స్ జట్టు ఓటమితో ముగించింది. టార్గెట్ ఛేజింగ్‌లో రిచా ఘోష్ (68) చెలరేగినా.. బుధవారం జరిగిన చివరి వామప్ మ్యాచ్‌లో టీమిండియా 5 రన్స్ స్వల్ప తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. టాస్ ఓడిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 171/6 స్కోరు చేసింది. అమీ జోన్స్ (64), నాట్ సివర్ బ్రంట్ (57) హాఫ్ సెంచరీలు చేశారు.
నాలుగో ఓవర్‌లోనే డ్యానీ వ్యాట్ (3)ను ఔట్ చేసిన ఇండియా బౌలర్లు ఆ తర్వాత చేతులెత్తేశారు. జోన్స్, బ్రంట్‌ను హిట్టింగ్‌ను అడ్డుకోలేకపోయారు. దాంతో రెండో వికెట్‌కు 50 రన్స్ జోడించి జోన్స్ వెనుదిరిగింది. వెంటనే అలైస్ క్యాప్సీ (2), ఫ్రెయా కెంప్ (7) ఔటయ్యారు. చివర్లో డానీ గిబ్సన్ (30 నాటౌట్) మెరుగ్గా ఆడటంతో ఇంగ్లండ్ మంచి టార్గెట్‌ను నిర్దేశించింది.
శ్రేయాంక పాటిల్ 2, షెఫాలీ, రేణుకా సింగ్, శ్రీచరణి, రాధా యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. తర్వాత ఇండియా 19.5 ఓవర్లలో 166 రన్స్‌కే ఆలౌటైంది. ఇంగ్లిష్ బౌలర్లు లిన్సే స్మిత్ (3/42), చార్లీ డీన్ (2/16), కోల్మన్ (2/22), గిబ్సన్ (2/17) ఇండియా లైనప్‌ను దెబ్బతీశారు. ఓ ఎండ్‌లో రిచా పోరాడినా.. రెండో ఎండ్‌లో హర్మన్‌ప్రీత్ (17), భారతి ఫుల్మాలి (18), రాధా యాదవ్ (16)తో సహా మిగతావారు నిరాశపర్చారు. ఇన్నింగ్స్‌లో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.
