బొద్దింకల్లా బతుకుతూ.. బొద్దింకలాంటోళ్లను ఎన్నుకుంటూ.. అలాగే చస్తూ.. : భారతీయులపై ఈ కామెంట్స్ ఎందుకు చేశాడు..?

బొద్దింకల్లా బతుకుతూ.. బొద్దింకలాంటోళ్లను ఎన్నుకుంటూ.. అలాగే చస్తూ.. : భారతీయులపై ఈ కామెంట్స్ ఎందుకు చేశాడు..?

సోషల్ మీడియాలో ఒక ప్రయాణికుడు రైలు ఎక్కడానికి పడుతున్న అవస్థలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో కేవలం ఒక వ్యక్తి ప్రయాణ కష్టాలను మాత్రమే కాకుండా.. భారతదేశంలోని సామాన్యుడి రోజువారీ ట్రావెల్ కష్టాలను కళ్లకు కడుతోంది. సుమారు 20 సెకన్లు ఉన్న వీడియో క్లిప్‌లో.. కదులుతున్న రైలులో చోటు కోసం ఒక వ్యక్తి ఒక డోర్ నుంచి మరో డోర్ వరకు పరుగులు తీయడం, చివరకు ప్రాణాలకు తెగించి రైలు బయట వేలాడుతూ ప్రయాణించిన దృశ్యాలు నెటిజన్లను కలవరానికి గురిచేసింది.

జయంత్ భండారి వివాదాస్పద కామెంట్స్..
ఈ వీడియోపై స్పందిస్తూ కెనడాకు చెందిన విశ్లేషకుడు, భారత్‌పై తరచూ విమర్శలు చేసే జయంత్ భండారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భారతీయుల జీవన ప్రమాణాలను కించపరుస్తూ వ్యాఖ్యానించటంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. భారతీయులు బొద్దింకల్లా బతుకుతారు.. బొద్దింకల్లాగే చనిపోతారు వీడియోపై కామెంట్ చేశారు భండారి. ఇండియన్స్ తమను పాలించే వారిగా అట్టడుగున ఉండే బొద్దింకలకే ఓటు వేస్తారని అన్నారు. ఆ పాలకులు కూడా వీరిని అలాగే చూస్తారని, తాను వారిని బొద్దింకలతో పోల్చడం వారికి కోపం తెప్పిస్తుంది అంటూ ఎక్స్‌ లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు.

భండారి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చాలా మంది తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొంతమంది భారత్‌లో ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని విమర్శిస్తుండగా, మరికొందరు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. దేశంలో జనాభా పెరిగిపోవడం వల్ల మనుషుల ప్రాణాలు చౌకగా మారుతున్నాయని, ఇక్కడ ఎవరైనా చనిపోయినా ఎవరూ పట్టించుకోరంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి కలలు కంటున్నాం కానీ.. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు.. ప్రయాణికులను కించపరిచే వారిపై మరికొందరు మండిపడుతున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్నది సామాన్యులు. సేవలు అందించటంలో విఫలమైన రైల్వే వ్యవస్థలో వారు తమ పని కోసం పోరాడుతున్నారని.. వారు కూడా మనలాంటి మనుషులే తప్ప బొద్దింకలు కాంటూ భండారి వ్యాఖ్యలను ఖండించారు ఒక యూజర్. మెుత్తానికి వైరల్ అవుతున్న ఈ వీడియో భారతీయుల ఆత్మగౌరవంతో పాటు మౌలిక సదుపాయాల లేమిని స్పష్టంగా చూపిస్తోంది ఆధునిక టెక్ ప్రపంచంలో.