మాల్దీవులకు వెళ్లేటోళ్లలో మనోళ్లే మస్తుమంది

మాల్దీవులకు వెళ్లేటోళ్లలో మనోళ్లే మస్తుమంది
  • ఏటా 2.05 లక్షల మంది అక్కడ పర్యటిస్తున్నరు 
  • మాల్దీవ్స్ మంత్రుల వ్యాఖ్యలతో టూర్లు రద్దు చేసుకుంటున్న వైనం

న్యూఢిల్లీ/మాలె: మాల్దీవ్స్‌‌కు వెళ్తున్న టూరిస్టుల్లో ఇండియన్లు టాప్ ప్లేస్‌‌లో ఉన్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. కరోనా తర్వాతి నుంచి ఏటా 2 లక్షల మందికి పైగా అక్కడ పర్యటిస్తున్నట్లు తేలింది. మాల్దీవ్స్ టూరిజం మినిస్ట్రీ లెక్కల ప్రకారం.. 2023లో 2.09 లక్షల మంది ఆ దేశంలో పర్యటించారు. 2022లో 2.4 లక్షల మంది, 2021లో 2.11 లక్షల మంది వెళ్లారు. 2018లో మాల్దీవ్స్‌‌లో పర్యటించిన టూరిస్టుల్లో ఇండియన్లు 5 స్థానంలో ఉండగా, 2019లో రెండో స్థానానికి వెళ్లారు. కరోనా తర్వాతి నుంచి టాప్‌‌లోనే ఉంటున్నారు. అయితే, తాజాగా మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చాలా మంది తమ టూర్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ‘బాయ్‌‌కాట్‌‌ మాల్దీవ్స్’ హ్యాష్‌‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌‌లో ఉంది. కొన్ని టూరింగ్ సంస్థలు కూడా మాల్దీవ్స్ ప్యాకేజీలను రద్దు చేస్తున్నాయి. ఇదే సమయంలో లక్షద్వీప్‌‌ టూర్లకు స్పెషల్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇండియాకు సంఘీభావంగా.. మాల్దీవ్స్‌‌కు ఫ్లైట్ బుకింగ్స్‌‌ను సస్పెండ్ చేస్తున్నట్లుగా ‘ఈజ్‌‌మైట్రిప్’ ప్రకటించింది. మరోవైపు, గత 20 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా లక్షద్వీప్‌‌ గురించి ప్రపంచవ్యాప్తంగా జనాలు సెర్చ్ చేసినట్లు గూగుల్ ట్రెండ్స్ లో వెల్లడైంది.

ముగ్గురు మంత్రుల వ్యాఖ్యలపై మాల్దీవ్స్ వివరణ

ప్రధాని మోదీపై తమ మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో తమకు సంబంధంలేదని మాల్దీవ్స్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సోమవారం మాలెలోని ఫారిన్ మినిస్ట్రీ ఆఫీసులో రాయబారి అలీ నజీర్ మొహమ్మద్‌‌తో ఇండియన్ హైకమిషనర్ మును ముహవర్ భేటీ అయ్యారు. ‘‘సస్పెండ్‌‌ అయిన ఆ మంత్రులు చేసిన వ్యాఖ్యలు మాల్దీవ్స్ ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవు” అని ఈ సందర్భంగా నజీర్ చెప్పినట్లు మాల్దీవ్స్ అధికారులు వెల్లడించారు. అంతకుముందు ఇండియాలో మాల్దీవ్స్ రాయబారి ఇబ్రహీం షహీబ్‌‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.