మళ్లీ ఉగ్రదాడి జరిగితే యుద్ధమే!.పాక్​కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

మళ్లీ ఉగ్రదాడి జరిగితే యుద్ధమే!.పాక్​కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
  • ప్రధాని మోదీ హైలెవల్​ మీటింగ్
  • పాల్గొన్న రాజ్​నాథ్, త్రివిధ దళాల చీఫ్​లు

న్యూఢిల్లీ: భవిష్యత్తులో మళ్లీ ఉగ్రమూకలను ఎగదోసి దాడికి పాల్పడితే యుద్ధ చర్యగానే పరిగణిస్తామని పాకిస్తాన్​కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాక్​కు చెందిన టెర్రరిస్టులు ఇకపై భారత గడ్డపై బాంబులు పేల్చడం, కాల్పులు జరపడం, సైబర్, బయోలాజికల్, కెమికల్ అటాక్స్ కు పాల్పడటం లేదా గవర్నమెంట్ బిల్డింగ్స్, మిలిటరీ స్థావరాలపై దాడులు చేయడం వంటివి జరిపితే దానిని దేశానికి వ్యతిరేకంగా ప్రకటించిన యుద్ధంగానే పరిగణించాలని మోదీ సర్కారు గట్టి నిర్ణయానికి వచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మళ్లీ ఉగ్రదాడులకు పాల్పడితే ఇలాగే తీవ్రస్థాయిలో మిలిటరీ యాక్షన్ తప్పదని పాక్​ను హెచ్చరించినట్టుగా వెల్లడించాయి. కాగా, మిలిటరీ కూడా పాక్​ను హెచ్చరించింది. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ఇండియన్ నేవీ కమొడోర్ రఘు నాయర్ ఈమేరకు మీడియా సమావేశంలో స్పందించారు. ‘‘దేశ సార్వభౌమత్వ రక్షణకు ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంటాం. దేశ రక్షణకు ఎప్పుడు అవసరమైనా మళ్లీ సైనిక చర్యకు వెనకాడబోం” అని హెచ్చరించారు.

ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్

పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్​నాథ్, జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి పాల్గొన్నారు.