V6 News

దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 58%.. మ‌ర‌ణాలు 3 శాతం

దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 58%.. మ‌ర‌ణాలు 3 శాతం

దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు క్ర‌మంగా మెరుగుప‌డుతోంద‌ని, ఇప్ప‌టికే దాదాపు 3 ల‌క్ష‌ల మంది పేషెంట్లు క‌రోనా నుంచి కోలుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 58 శాతానికి పైగా ఉంద‌న్నారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై గ్రూప్ ఆఫ్ మినిస్ట‌ర్స్‌తో శ‌నివారం ఉద‌యం ఆయ‌న స‌మావేశ‌మయ్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డిలో భాగంగా తీసుకుంటున్న చ‌ర్య‌లు మంచి ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని అన్నారు. క‌రోనా కేసులు రెట్టింపు కావ‌డానికి ప‌డుతున్న స‌మ‌యం 19 రోజుల‌కు చేరింద‌ని, ఇది లాక్‌డౌన్‌కు మూడు రోజుల ముందు ఉన్న డ‌బులింగ్ రేటుకు స‌మాన‌మ‌ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు. ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో క‌రోనా మ‌ర‌ణాలు కూడా త‌క్కువ‌గా ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా డెత్ రేటు 3 శాతంగా ఉంద‌ని తెలిపారు. కాగా, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసుల సంఖ్య 5,08,953కు చేరింది. శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు 15,685 మంది మ‌ర‌ణించ‌గా.. 2,95,881 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్ర‌స్తుతం 1,97,387 మంది క‌రోనా చికిత్స పొందుతున్నారు.