- గత ఐదేళ్లలో 110 శాతం పెరిగిన స్థానిక తయారీ
- 2013–14 నుంచి 2025–26 మధ్య నాలుగు రెట్ల వృద్ధి
- పారస్ డిఫెన్స్ షేర్లు 18శాతం ర్యాలీ
న్యూఢిల్లీ: మిసైల్స్, గన్స్, రాకెట్స్, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు వంటి డిఫెన్స్ ఉత్పత్తుల తయారీలో ఇండియా దూసుకుపోతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు లోకల్‌గా తయారయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2024-–25) లో నమోదైన రూ. 1.54 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 15.6 శాతం ఎక్కువ. ఇండియా డిఫెన్స్ తయారీ 2020–21 లో రూ. 84,643 కోట్లు ఉండగా, గత ఐదేళ్లలో రెండింతల కంటే ఎక్కువ (110 శాతం) పెరిగింది. పదేళ్ల క్రితం అంటే ఆర్థిక సంవత్సరం 2013-–14 (రూ. 43,746 కోట్ల) తో పోలిస్తే ఏకంగా నాలుగు రెట్ల వృద్ధి సాధించింది.
ప్రభుత్వ రంగానిదే పైచేయి
డిఫెన్స్ తయారీలో ప్రభుత్వ రంగ కంపెనీలు దుమ్ములేపుతున్నాయి. ప్రైవేట్ కంపెనీలు కూడా పుంజుకుంటున్నాయి. డిఫెన్స్ ఉత్పత్తిలో ప్రభుత్వ రంగ డిఫెన్స్ కంపెనీల వాటా దాదాపు 76 శాతంగా ఉంది. మరోవైపు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం, ఉత్పాదకత గణనీయంగా పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం 2024–-25 లో మొత్తం ఉత్పత్తిలో ప్రైవేట్ రంగ వాటా 22 శాతంగా ఉండగా, 2025-–26 నాటికి అది 24 శాతానికి పెరిగింది. ప్రైవేట్ డిఫెన్స్ సంస్థల మొత్తం ఉత్పత్తి విలువ ఎన్నడూ లేని విధంగా రూ. 42 వేల కోట్లు దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఎగుమతుల ఊపు
ఇండియాలో డిఫెన్స్ ఉత్పత్తుల తయారీ పెరగడమే కాదు వీటి ఎగుమతులు కూడా రికార్డ్ లెవెల్స్‌కు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో మన ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుండడంతో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మోస్ మిసైల్స్‌ను ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు అమ్మగా, వియత్నాం, ఇండోనేషియాకు కూడా విక్రయించే అవకాశాలు ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో భారత డిఫెన్స్ ఎగుమతులు అసాధారణ వృద్ధిని నమోదు చేశాయని రక్షణశాఖ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. 2014–-15 లో రూ. రెండు వేల కోట్ల లోపు ఉన్న డిఫెన్స్ ఎగుమతులు, 2025–-26 నాటికి రూ. 38,400 కోట్లకు చేరాయని, 2030 నాటికి రూ. 50 వేల కోట్లకు ఈజీగా చేరుకుంటాయని అన్నారు. ఇండియా డిఫెన్స్ తయారీలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు 50:50 భాగస్వామ్యానికి చేరుకుంటాయన్నారు.
డిఫెన్స్ షేర్లు జూమ్
డిఫెన్స్ సెక్టార్‌లో తయారీ రూ. 1.78 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరిందన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో బుధవారం స్టాక్ మార్కెట్లో ఈ సెక్టార్ షేర్లు భారీ లాభాలతో దూసుకుపోయాయి. దేశీయ డిఫెన్స్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోందనే వార్తలు ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. పారస్ డిఫెన్స్ అత్యధికంగా 18శాతానికి పైగా లాభపడింది. డేటా ప్యాటర్న్స్ 6.6శాతం, భారత్ డైనమిక్స్ అండ్ గార్డెన్ రీచ్ 6శాతం పెరిగాయి. హెచ్ఏఎల్, కొచ్చిన్ షిప్‌యార్డ్ 5శాతం మేర లాభపడగా, మజ్గావ్ డాక్ 3.4శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 3శాతం, భారత్ ఫోర్జ్ 0.51శాతం ఎగిశాయి.
