రెండో రోజు కొనసాగిన భారత్ హవా .. అఫ్గానిస్తాన్పై 451 పరుగుల ఆధిక్యం.. డెబ్యూ మ్యాచ్లో మెరిసిన మానవ్

రెండో రోజు కొనసాగిన  భారత్ హవా .. అఫ్గానిస్తాన్పై  451 పరుగుల ఆధిక్యం.. డెబ్యూ మ్యాచ్లో మెరిసిన మానవ్
  • అరంగేట్రం మ్యాచ్​లోనే 3 వికెట్లు తీసిన మానవ్​ సుతార్
  • హాఫ్ ​సెంచరీతో  రాణించిన వాషింగ్టన్​ సుందర్
  • తొలి ఇన్నింగ్స్​లో  ఇండియా 564/8 డిక్లేర్​

ముల్లన్‌‌‌‌పూర్: అఫ్గానిస్తాన్‌‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్​లో రెండో రోజు టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (3/21) అద్భుత బౌలింగ్‌‌తో అఫ్గాన్ బ్యాటర్లను తిప్పేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గాన్​మొదటి ఇన్నింగ్స్‌‌లో 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణకు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం భారత్ 451 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. 

అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌‌ను 8 వికెట్లకు 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ (126) శతకంతో రాణించగా, రిషబ్ పంత్ (81) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సుతార్ (28) తో కలిసి ఏడో వికెట్‌‌కు 54 పరుగులు జోడించాడు. దీంతో భారత్​తన తొలి ఇన్నింగ్స్‌‌ను 8 వికెట్లకు 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ సలీం 6 వికెట్లతో శ్రమించాడు. 

అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గానిస్తాన్‌‌ను సుతార్ కోలుకోలేని దెబ్బ తీశాడు. టీ విరామానికి ముందు చివరి ఓవర్ వేయడానికి రంగంలోకి దిగాడు. తొలి మూడు బంతులను ఎదుర్కోవడంలో తడబడిన అఫ్గాన్ ఓపెనర్ అబ్దుల్ మాలిక్.. స్వీప్ షాట్ ద్వారా బయటపడాలని ప్రయత్నించి సుతార్ బౌలింగ్‌‌లో అవుటయ్యాడు. మాజీ కేకేఆర్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ సుతార్​వేసిన బంతి ఆలస్యంగా డిప్ అయి, టర్న్ అవుతూ గుర్బాజ్ బ్యాట్ అంచును తాకి సెకండ్ స్లిప్‌‌లో ఉన్న సాయి సుదర్శన్ చేతుల్లో పడింది. 

మరో బ్యాట్స్​మెన్​అఫ్సార్ జజాయ్ సుతార్​కు సులభమైన రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ ఒక ఎండ్ నుంచి సుతార్‌‌తో వరుసగా 13 ఓవర్లు బౌలింగ్ చేయించాడు. మరో ఎండ్ నుంచి మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్ యాదవ్‌‌లను మారుస్తూ వచ్చాడు.

  • రిషబ్ పంత్​ క్లాసిక్ షాట్స్

అంతకుముందు రిషబ్ పంత్ క్లాసిక్​షాట్స్​ఆడుతూ విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాడు. ప్రతి బంతిని హిట్టింగ్ చేయాలనే తన సహజ శైలిని నియంత్రించుకుంటూ బంతి మెరిట్‌‌ను బట్టి ఆడాడు. 121 బంతులు ఎదుర్కొన్న పంత్​6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు.  రెండో రోజు ఉదయం మొదటి గంటలోనే గిల్ (177 బంతుల్లో 126) ను సలీం (20 ఓవర్లలో 4/109) అవుట్ చేశాడు. ఆఫ్-స్టంప్ లైన్‌‌లో గుడ్ లెంత్‌‌లో పడిన బంతిని ఆడడానికి గిల్ ముందుకు రాగా.. బంతి స్వల్పంగా అవుట్ స్వింగ్ అవుతూ బ్యాట్ అంచును తాకింది.

దీంతో 169 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ధ్రువ్ జురెల్ (20 బంతుల్లో 19) స్క్వేర్ ఆఫ్ ది వికెట్ వైపు కొన్ని అందమైన షాట్లు ఆడాడు. కానీ సలీం వేసిన రివర్స్ స్వింగ్ బంతిని జురెల్ లెంత్ అంచనా వేసి వదిలేయగా.. అది వెళ్లి ఆఫ్ స్టంప్‌‌ను ఎగరగొట్టింది. వాషింగ్టన్, సుతార్ ఏడో వికెట్‌‌కు 54 పరుగులు జోడించి జట్టు స్కోరును 500 మార్కు దాటించారు. వాషింగ్టన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు సంకేతం ఇచ్చాడు.