ముంబై: అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా, బలంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విదేశాల్లో యుద్ధాల వంటి ఉద్రిక్తతల వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిపారు.
పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో కొందరు మన విజయాలను తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముంబైలో సోమవారం జరిగిన భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) 37వ వార్షికోత్సవంలో ఆమె మాట్లాడారు.
ప్రతిదీ కుప్పకూలుతున్నట్లు కొందరు నిరుత్సాహపరుస్తున్నారని విమర్శించారు. సామాన్యుడు చేస్తున్న మంచిని మరిచిపోయి నిరాశపూరితంగా మాట్లాడటం సరికాదని, భయపడకూడదని స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కొనసాగుతున్నందున, ఇంధనం (ఫ్యూయల్), ఎరువులు (ఫెర్టిలైజర్స్), విదేశీ మారకద్రవ్యం (ఫారెక్స్) అనే మూడు ఎఫ్‌లపై దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి కోరారు.
‘‘వీటి ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ మూడింటినీ డాలర్లతో కొనాల్సి ఉంటుంది. దేశ భద్రత కోసమే వీలైనంత వరకు విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయాలని ప్రధాని కోరారు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరగడం వల్లే ఆయన ఈ పిలుపు ఇచ్చారు. గత 80-90 రోజులుగా ఇవి మారుతూనే ఉన్నాయి”అని ఆమె చెప్పారు.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల సుమారు రూ. లక్ష కోట్ల నష్టం వస్తోందని తెలిపారు. పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రో ధరలు పెరగడంతో ఇంటి బడ్జెట్లు, రవాణా ఖర్చులపై మరింత ఒత్తిడి పెరిగిందని నిర్మల వివరించారు.
అవసరానికి తగ్గట్టుగా లోన్లు ఇవ్వాలి
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు)కు రూ.8.1 లక్షల కోట్ల బకాయిలు నిలిచిపోవడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వర్కింగ్ క్యాపిటల్, వృద్ధిపై ప్రభావం చూపుతోందని చెప్పారు. వీటికి 45 రోజులలోపు డబ్బు అందేలా చూడాలని ప్రభుత్వరంగ సంస్థలను కోరారు. బ్యాంకింగ్ వ్యవస్థ సంప్రదాయ పద్ధతులను వీడాలని, చిన్న వ్యాపారాల బిజినెస్ సైకిల్స్‌కు తగ్గట్టు లోన్లు/రీపేమెంట్స్ఆప్షన్లు ఇవ్వాలని అన్నారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, టూరిస్టు రిసార్టులు, దుస్తుల ఎగుమతిదారులు, ఆటో విడిభాగాల సరఫరాదారులకు ప్రతి నెలా కచ్చితమైన తేదీల్లో డబ్బు అందక పోవచ్చని చెప్పారు. కొన్ని సంస్థలకు నెలల తరబడి బకాయిలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. అందరికీ ఒకే రకమైన రీపేమెంట్ విధానాన్ని ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు. సరైన వ్యాపారానికి, సరైన సమయంలో, సరైన ఉద్దేశం కోసం క్రెడిట్ అందించడమే బ్యాంకుల లక్ష్యంగా ఉండాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
