పెరిగిన వంట నూనెల దిగుమతులు

పెరిగిన వంట నూనెల దిగుమతులు

న్యూఢిల్లీ: నల్ల సముద్రం నుంచి సరఫరా ఆగిపోవడం, రిఫైనర్లు రానున్న పండుగల కోసం స్టాక్‌‌లను పెద్ద ఎత్తున నిల్వచేస్తుండడంతో గతనెల భారతదేశం  వంటనూనెల దిగుమతులు రికార్డు స్థాయిలో 1.76 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగాయి.  పొద్దుతిరుగుడు నూనెను ఉత్పత్తి చేసే నల్ల సముద్ర దేశాలలో నిల్వలు తగ్గుతున్నాయి. 2021–22 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశ సగటు నెలవారీ వంటనూనెల దిగుమతులు 1.17 మిలియన్ టన్నులుగా ఉన్నాయని సాల్వెంట్ ఎక్స్‌‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్​ఏఈ) తెలిపింది. 

ఈ ఏడాది జూన్‌‌లో భారతదేశం 1.3 మిలియన్ టన్నుల వంటనూనెల‌‌ను దిగుమతి చేసుకుంది. డీలర్ల సగటు అంచనాల ప్రకారం, పామాయిల్ దిగుమతులు జూన్‌‌లో 683,133 టన్నుల నుంచి జులైలో 1.09 మిలియన్ టన్నులకు పెరిగాయి.  ఏడు నెలల్లో ఇదే అత్యధికం.  రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అన్ని దేశాలూ దిగుమతులను పెంచాయని జీజీఎన్​ రీసెర్చ్‌‌లో మేనేజింగ్ పార్ట్​నర్​ రాజేష్ పటేల్ అన్నారు. 

సన్‌‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ఒక నెలలో 73శాతం పెరిగి 3,30,000 టన్నులకు చేరుకున్నాయి.  రవాణా సమస్యల కారణంగా సోయా ఆయిల్ దిగుమతులు మాత్రం 22శాతం తగ్గి 3,40,000 టన్నులకు పడిపోయాయి.