దేశంలో భారీగా పెరగనున్న బంగారం ఉత్పత్తి!

దేశంలో భారీగా పెరగనున్న బంగారం ఉత్పత్తి!
  • ఏటా 20 టన్నుల ప్రొడక్షన్​కు ఛాన్స్​
  • వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ రిపోర్టు

వెలుగు బిజినెస్​ డెస్క్​: మన దేశంలో గోల్డ్​ ప్రొడక్షన్​ ఏడాదికి 20 టన్నులకు చేరే ఛాన్స్​ ఉందని వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ రిపోర్టు వెల్లడించింది. 2020లో మన దేశంలో గోల్డ్​ ప్రొడక్షన్​ కేవలం 1.6  టన్నులు . అడ్డంకులు తొలగించి, పెట్టుబడులను ప్రోత్సహిస్తే ఈ ప్రొడక్షన్​ పెరుగుదల సాధ్యపడుతుందని పేర్కొంది. బంగారం వినియోగంలో టాప్​లో ఉంటున్న ఇండియా, ప్రొడక్షన్​లో మాత్రం అంతంత మాత్రమేనని రిపోర్టు తెలిపింది. ఇండియాలో గోల్డ్​ ప్రొడక్షన్​లోకి ఎంటరవడం అంత ఈజీ కాదని పేర్కొంది. ‘గోల్డ్​ మైనింగ్​ ఇన్​ ఇండియా’ పేరుతో వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ ఈ రిపోర్టును రిలీజ్​ చేసింది.

50 మిలియన్​ డాలర్ల రాయల్టీ

ఇతర దేశాలలోని వనరులు, అక్కడి ప్రొడక్షన్​ను చూస్తే ఇండియాలో లాంగ్​ టర్మ్​లో  ఏటా 20 టన్నుల ప్రొడక్షన్​ సాధించగల అవకాశాలు మెండుగా ఉన్నాయని వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ చెబుతోంది. ఏటా 20 టన్నుల ప్రొడక్షన్​ను రీచ్​కాగలిగితే దేశానికి రాయల్టీ పేమెంట్స్​ రూపంలో 50 మిలియన్​ డాలర్ల ఆదాయం వస్తుందని తెలిపింది. లండన్​ బులియన్​ మార్కెట్ అసోసియేషన్​ (ఎల్​బీఎంఏ) గోల్డ్​ రేటు ప్రకారం బంగారం ప్రొడక్షన్​పై 4 శాతం చొప్పున రాయల్టీని లెక్కకట్టినట్లు డబ్ల్యూజీసీ (వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​) వివరించింది. అంతేకాదు, దేశంలోని మరో మూడు–నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా ఈ రంగం ఉపాధి కలిగించగలదని తెలిపింది. 

బంగారం మైనింగ్​లో ప్రాబ్లమ్స్​

దేశంలో గోల్డ్​ మైనింగ్​కు ప్రధానంగా మూడు అడ్డంకులు ఉన్నట్లు డబ్ల్యూజీసీ ఈ రిపోర్టులో ఎత్తి చూపింది. రెగ్యులేటరీ సవాళ్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. మైనింగ్​ లైసెన్స్​ అప్రూవల్ తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ టైము పడుతోందని వివరించింది. సింగిల్​ లైసెన్సు కోసం 10 నుంచి 15 ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరగాల్సి ఉందని పేర్కొంది.  రెండో సమస్య, ట్యాక్సేషనేనని తెలిపింది. గత కొన్నేళ్లలో కార్పొరేట్ల లాభాలపై పన్నులను ప్రభుత్వం తగ్గించేసింది. కానీ, మైనింగ్​ ఎక్విప్​మెంట్​ దిగుమతులపై డైరెక్ట్​, ఇండైరెక్ట్​ ట్యాక్సులను తగ్గించలేదని వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే ఈ ట్యాక్సులు ఇండియాలో ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. చివరగా, దేశంలోని బంగారపు గనులు మారుమూల ప్రాంతాలలోనే ఉన్నాయని, దీంతో అక్కడ వసతులు చాలా తక్కువగా ఉంటున్నాయని తెలిపింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు వంటి మౌలిక వసతులు మెరుగుపరచడంపై శ్రద్ధ చూపించడం లేదని పేర్కొంది. కాగా, గనుల నుంచి బంగారం వెలికి తీసేందుకు అనువైన వాతావారణాన్ని కల్పించేలా ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని డబ్ల్యూజీసీ తెలిపింది. కొన్ని సమస్యలను ఇప్పటికే పరిష్కరించిందని వెల్లడించింది. 1957 నాటి మైన్స్​​ యాక్టుకు సవరణలు తెచ్చారని, 2016లో నేషనల్​ మినరల్స్​ ఎక్స్​ప్లొరేషన్​ పాలసీని, 2019 లో కొత్త నేషనల్​ మినరల్ పాలసీని తెచ్చారని పేర్కొంది.

గోల్డ్ మైనింగ్ కెపాసిటీ పెరగాలె

బంగారం వినియోగంలో ప్రపంచంలోనే టాప్​ దేశాలలో ఒకటిగా నిలుస్తున్న ఇండియాకు ఇక్కడ గోల్డ్​ ప్రొడక్షన్​ పెంచుకోవడం మెరుగైన అవకాశమే. మైనింగ్​ కెపాసిటీ పెంచుకుంటే బాగుంటుంది. గోల్డ్​ మైనింగ్​ రంగంలో అడ్డంకులు తొలగించడంతోపాటు, పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది. మైన్స్​, మినరల్స్​ చట్టాలలో ఇటీవల చేసిన మార్పులు ఎంకరేజింగ్​గా కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్​ కంటిన్యూ అయితే కచ్చితంగా దేశంలో గోల్డ్ ప్రొడక్షన్​ పెరుగుతుంది.

:: పీ ఆర్​ సోమసుందరం, రీజినల్​ సీఈఓ, ఇండియా, డబ్ల్యూజీసీ