
హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. వేసవిలో గ్రామ పంచాయతీలకు, ఆవాసాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు సరఫరా చేస్తున్న పీఆర్, మిషన్ భగీరథ అధికారులను మంత్రి అభినందించారు. రానున్న రోజుల్లోనూ ఇలాగే పనిచేయాలని సూచించారు.
కొన్నిచోట్ల మంచినీటి పైపులు లీకయ్యే అవకాశం ఉందని, వర్షపు నీళ్లు మంచినీటిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, దోమలు వృద్ధి చెందకుండా, సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఎన్సీ కనకరత్నం, కమిషనర్ అనితా రామచంద్రన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.