రైతు కూలీ బిడ్డ ప్రపంచ విజేత

రైతు కూలీ బిడ్డ ప్రపంచ విజేత
  •  వరల్డ్ పారా అథ్లెటిక్స్‌‌‌‌లో వరంగల్ అమ్మాయి దీప్తికి గోల్డ్
  • 400 మీ. ఈవెంట్‌‌‌‌లో వరల్డ్ రికార్డు బ్రేక్‌‌‌‌

రైతు కూలీ బిడ్డ  పరుగుల ప్రపంచాన్ని జయించింది. వైకల్యాన్ని అధిగమించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడింది. వరంగల్ బిడ్డ, పారా అథ్లెట్ జీవాంజి దీప్తి వరల్డ్
 పారా అథ్లెటిక్స్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. విశ్వ వేదికపై మెరుపు వేగంతో పరుగులు పెట్టిన ఆమె వరల్డ్ రికార్డును కూడా బద్దలు కొట్టింది.

హైదరాబాద్ , వెలుగు: తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి  వరల్డ్ పారా అథ్లెటిక్స్‌‌‌‌లో చాంపియన్‌‌‌‌గా నిలిచింది.  టి20 కేటగిరీ విమెన్స్‌‌‌‌ 400 మీటర్ల ఈవెంట్‌‌‌‌లో వరల్డ్ రికార్డు టైమింగ్‌‌‌‌తో గోల్డ్ మెడల్‌‌‌‌ సొంతం చేసుకుంది. జపాన్‌‌లోని కోబ్ నగరంలో సోమవారం జరిగిన ఫైనల్లో దీప్తి 55.07 సెకండ్లతో టాప్‌‌‌‌ ప్లేస్ సాధించింది. ఈ క్రమంలో గతేడాది పారిస్‌‌‌‌లో అమెరికాన్‌‌‌‌ బ్రెనా క్లార్క్‌‌‌‌ 55.12 సెకండ్లతో నెలకొల్పిన వరల్డ్ రికార్డును బ్రేక్‌‌‌‌ చేసింది.

మేధోపరమైన బలహీనత ఉన్న అథ్లెట్లు  పోటీపడే ఈ టి20 కేటగిరీలో టర్కీ అథ్లెట్ ఐసెల్ ఓండెర్‌‌‌‌‌‌‌‌ (55.19సె), ఈక్వెడార్‌‌‌‌‌‌‌‌కు చెందిన లిజాన్షెలా ఆంగులో (56.68సె) సిల్వర్, బ్రాంజ్ గెలిచారు. కాగా, మెన్స్‌‌‌‌ ఎఫ్‌‌‌‌56 కేటగిరీ  డిస్కస్‌‌‌‌ త్రోలో ఇండియా అథ్లెట్ యోగేశ్‌‌‌‌ కతునియా 41.80 మీటర్లతో సిల్వర్ గెలిచాడు. మెన్స్‌‌‌‌  షాట్‌‌‌‌పుట్ ఎఫ్‌‌‌‌34 క్లాస్‌‌‌‌లో   భాగ్యశ్రీ జాదవ్ 7.56 మీటర్లతో  సిల్వర్ ఖాతాలో వేసుకుంది. 

మట్టిలో మాణిక్యం

పారా అథ్లెటిక్స్‌‌‌‌లో ప్రపంచ విజేతగా నిలిచిన దీప్తి జీవితం స్ఫూర్తి దాయకం. నిరుపేద రైతు కూలీ కుటుంబంలో పుట్టి..  పుట్టెడు కష్టాలతో పాటు అవమానాలను భర్తిస్తూ పెరిగి..  పరుగే ప్రాణంగా ఆమె సాగిస్తున్న ప్రయాణం అసమానం. తెలంగాణ అథ్లెటిక్స్ ద్రోణాచార్యుడు నాగపురి రమేశ్ కోచింగ్‌‌‌‌లో వెలుగులోకి వచ్చిన మరో మట్టిలో మాణిక్యం దీప్తి.  వరంగల్‌‌‌‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆమె స్వగ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రైతు కూలీలు.

రోజూ పనిచేస్తే గానీ పూట గడవని కుటుంబంలో జన్మించింది దీప్తి. పుట్టుకతోనే మానసిక వైకల్యం ఉండటంతో సరిగ్గా మాట్లాడేది కాదు. ఎదుటివాళ్లు చెప్పేది ఆమెకు తొందరగా అర్థమయ్యేది కాదు. దాంతో ఈ అమ్మాయిని ఎవ్వరూ పెండ్లి చేసుకోరని ఊరోళ్లు వెక్కిరించేవారు. తోటి చిన్నారులు ఆమెతో ఆడుకునేవాళ్లు కాదు. దాంతో తల్లిదండ్రులు కూలీకి వెళ్తే  దీప్తి చెప్పులు లేకుండా  పొలం గట్లపై సరదాగా తీసింది. ఆ పరుగులే దీప్తికి నేస్తాలయ్యాయి. ఆ పరుగునే తన  కెరీర్‌‌‌‌గా మార్చుకుంది. 

రమేశ్‌‌, గోపీచంద్ సపోర్ట్‌‌

ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ కంట్లో పడటం దీప్తి జీవితాన్ని మార్చింది. దీప్తి టాలెంట్ గుర్తించిన రమేశ్‌‌ గచ్చిబౌలిలో సాయ్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో చేర్చి దగ్గరుండి శిక్షణ ఇచ్చాడు. తన శిక్షణలో రాటుదేలిన దీప్తి తొలుత సాధారణ అథ్లెట్లతో.. రెగ్యులర్ టోర్నీల్లో  పోటీపడి పతకాలను గెలుచుకుంది. ఈ క్రమంలో కోచింగ్‌‌‌‌, ప్రయాణ ఖర్చుల కోసం దీప్తి తల్లిదండ్రులు తమకున్న ఎకరా పొలాన్ని అమ్మేయగా.. బ్యాడ్మింటన్ కోచ్‌‌‌‌ పుల్లెల గోపీచంద్ తన గోపీ–మిత్రా ఫౌండేషన్‌‌‌‌ ద్వారా ఆమెకు కొంత సపోర్ట్ ఇచ్చాడు. గోపీ సూచనతోనే దీప్తికి రమేశ్‌‌‌‌ మెడికల్ టెస్టులు చేయించాడు.

డాక్టర్లు ‘మానసిక వైకల్య’ సర్టిఫికెట్ ఇవ్వడంతో  దీప్తి పారా గేమ్స్‌‌‌‌లో పోటీ పడే అవకాశం లభించింది. పారా పోటీల్లో అడుగు పెట్టిన తర్వాత దీప్తికి ఎదురేలేకుండా పోయింది. నేషనల్, ఇంటర్నేషనల్ పోటీల్లో పతకాల మోత మోగిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో  వరల్డ్ పారా గ్రాండ్‌‌‌‌ప్రిలో 400 మీ. ఈవెంట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌‌‌గా రికార్డు సృష్టించింది.

 ప్రతిష్టాత్మక పారా ఆసియా గేమ్స్‌‌‌‌లోనూ గోల్డ్ నెగ్గింది. దాంతో ఒకప్పుడు దీప్తిని వెక్కిరించిన ఊరి వాళ్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తడం మొదలు పెట్టారు. దీప్తి మా  ఊరి బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆ మెడల్‌‌‌‌తో దీప్తికి  రూ. 30 లక్షల ప్రైజ్‌‌‌‌మనీ లభించింది. ఆ డబ్బుతో దీప్తి తల్లిదండ్రులు అర ఎకరం  పొలం కొన్నారు. వాళ్ల ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగైంది. తాజాగా వరల్డ్ పారా అథ్లెటిక్స్‌‌‌‌ గోల్డ్‌‌‌‌తో దీప్తి కెరీర్‌‌‌‌‌‌‌‌ అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు పారా ఒలింపిక్స్‌‌‌‌ గోల్డ్ దిశగా  తను పరుగులు పెట్టనుంది.