రెండేండ్ల యాసంగి సీఎంఆర్ బకాయిలు .. గడువు ముగిసినా తిరిగివ్వని మిల్లర్లు

రెండేండ్ల యాసంగి  సీఎంఆర్ బకాయిలు .. గడువు ముగిసినా తిరిగివ్వని మిల్లర్లు
  • లక్ష మెట్రిక్ టన్నులు
  • ఇంకా పూర్తికాని గత వానాకాలం సీఎంఆర్ టార్గెట్
  • ఈ సారి ఘణనీయంగా తగ్గిన ధాన్యం దిగుబడి

నిర్మల్, వెలుగు: సీఎంఆర్ బియ్యం విషయంలో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సీఎంఆర్ బియ్యాన్ని అప్పజెప్పకుండా మిల్లర్లు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. 2022, 23 యాసంగి సీజన్​కు సంబంధించి సీఎంఆర్ బియ్యాన్ని ఈనెల 15లోగా అప్పగించాలని ప్రభుత్వం గడువు విధించింది. కానీ గడువు ముగిసే సమయానికి 5 శాతం ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించారు.

 ప్రభుత్వం విధించిన గడువును మిల్లర్లు పెద్దగా పట్టించుకోవడంలేదు. డెడ్​లైన్ ముగిసినప్పటికీ బియ్యాన్ని అప్పగించడంలో తీవ్ర అశ్రద్ధ చూపుతున్నారు. యాసంగి సీజన్​కు సంబంధించి నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ కోసం లక్షా 58 వేల 566 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 48 రైస్ మిల్లులకు అప్పగించారు. ఇందులో భాగంగా లక్షా 6 వేల 831 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 6,831 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే అప్పజెప్పారు. ఇంకా లక్ష మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉంది.

తప్పించుకుంటున్న మిల్లర్లు

ప్రభుత్వం 2022, 23 వానాకాలం సీఎంఆర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ మిల్లర్లు తప్పించుకుంటుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేండ్ల వానాకాలం సీజన్​కు సంబంధించి ప్రభుత్వం లక్షా 68 వేల 177 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం అప్పజెప్పింది. మిల్లర్లు లక్షా 13 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 95 వేల 150 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పజెప్పగా 17వేల 8508 మెట్రిక్ టన్నులు ఇంకా ఇవ్వాల్సి ఉంది. జిల్లాలోని 34 రైస్ మిల్లులు ఆ బియ్యాన్ని ఇవ్వకుండా బకాయి పెట్టాయి. ప్రభుత్వం గత ఫిబ్రవరి 29వ తేదీ వరకే డెడ్​లైన్ విధించినప్పటికీ మిల్లర్లు ఆ గడువును పట్టించుకోకుండా బియ్యాన్ని అప్పజెప్పలేదు. ప్రభుత్వం దీనిపై కఠినంగా వ్యవహరిస్తూ మిల్లులకు 125 శాతం పెనాల్టీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ యాసంగి సీజన్​కు సంబంధించి సీఎంఆర్ విషయంలో కూడా మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

కలెక్టర్ సీరియస్..

సీఎంఆర్ బియ్యం అప్పజెప్పే విషయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రైస్ మిల్లర్లపై సీరియస్​గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల మిల్లులను తనిఖీ చేసి సీఎంఆర్​పై ఆరా తీశారు. పలు మిల్లులకు భారీగా పెనాల్టీలు విధించారు. రెండు మిల్లులపై కేసులు సైతం నమోదు చేయించారు. 2022, 23 యాసంగి సీజన్​కు సంబంధించి సీఎంఆర్ గడువు ముగియడంతో బియ్యం అందించని మిల్లులపైనా చర్యలకు సిద్ధమవుతున్నారని సమాచారం.

యాసంగిలో తగ్గిన దిగుబడి

2023, 24 యాసంగి సీజన్ కు సంబంధించి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. వ్యవసాయ శాఖ మొదట 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అయితే వరి పంటకు చీడపీడలు, తెగుళ్లు సోకడంతో దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. ఎకరాకు 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా 14 క్వింటాళ్లు కూడా రాలేదని అధికారులు చెప్తున్నారు. 

దీని కారణంగా దిగుబడి అంచనాను తగ్గించిన వ్యవసాయ శాఖ.. లక్షా 45 వేల 730 మెట్రిక్ టన్నుల దిగుబడులు రావచ్చని ఆశిస్తోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 70 వేల 806 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రూ.150 కోట్లను 15 వేల మంది రైతులకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.34 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.121 కోట్లు చెల్లించాల్సి ఉంది. కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న ఆటంకాల కారణంగా జూన్ 10 వరకు గడువును పొడిగించే అవకాశాలున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు.