బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా బాసర రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం, ఓని గ్రామం వద్ద జరుగుతున్న పబ్లిక్ రోడ్డు పనులకు సంబంధించిన కంకర, ఇసుక వంటి నిర్మాణ సామగ్రిని టిప్పర్ ద్వారా తరలిస్తున్నారు. పనులు పూర్తి చేసి తిరిగి వస్తున్న టిప్పర్ రాంగ్ రూట్‌లో యూ టర్న్ తీసుకుని మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. బాసర సీఐ కిరణ్ కుమార్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని భైంసా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
